స్కూల్ లో విద్యార్థినుల అర్థనగ్న కార్యక్రమాలు.. సభ్యసమాజం నివ్వెర!
ప్రస్తుత రోజుల్లో రీల్స్, షార్ట్ వీడియోల పిచ్చి విద్యార్థులను ఏ స్థాయికి తీసుకెళ్తోందో ఈ ఘటన అద్దం పడుతుందని చెప్పవచ్చు.
By: Tupaki Political Desk | 15 March 2026 1:54 PM ISTకోల్‌కతాలోని ఒక పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా స్కూల్ ఈవెంట్లలో దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు లేదా సామాజిక సందేశాన్నిచ్చే నాటికలు ప్రదర్శిస్తారు. కానీ, ఇక్కడ అందుకు భిన్నంగా స్కూల్ విద్యార్థినులు కేవలం టవల్ చుట్టుకొని, అర్ధనగ్నంగా కనిపించేలా నృత్యం చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో, అసలు అది స్కూల్ ఈవెంటేనా లేక మరేదైనా ప్రైవేట్ ప్రోగ్రామా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన చోట ఇలాంటి ప్రదర్శనలు ఏంటి? అంటూ తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.
యాజమాన్యం, తల్లిదండ్రుల పట్టించుకోరా?
ఈ ఘటనపై నెటిజన్లు ప్రధానంగా స్కూల్ యాజమాన్యాన్ని, విద్యార్థినుల తల్లిదండ్రులను నిలదీస్తున్నారు. చిన్నపిల్లలు చేసే పనులకు పెద్దల పర్యవేక్షణ ఉండాలి. స్కూల్ స్టేజీపై ప్రదర్శన ఇచ్చే ముందు రిహార్సల్స్ జరుగుతాయి, దుస్తులను ఎంపిక చేస్తారు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయులు లేదా ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘తమ పిల్లలు అశ్లీలతకు దగ్గరగా ఉండే ఇలాంటి డాన్సులు చేస్తుంటే తల్లిదండ్రులు ఎలా అనుమతించారు? అసలు వారికి బుద్ధి ఉందా?’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఘాటుగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
దారి తప్పుతున్న బాల్యం!
ప్రస్తుత రోజుల్లో రీల్స్, షార్ట్ వీడియోల పిచ్చి విద్యార్థులను ఏ స్థాయికి తీసుకెళ్తోందో ఈ ఘటన అద్దం పడుతుందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే కోరికతో లేదంటే అక్కడ ట్రెండ్ అవుతున్న అసభ్యకర పాటలకు స్టెప్పులు వేయాలనే ఉత్సాహంతో విద్యార్థులు హద్దులు దాటుతున్నారు. స్కూల్ యాజమాన్యాలు కూడా వినోదం పేరుతో ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వల్ల విద్యాసంస్థల పవిత్రత దెబ్బతింటోంది. విద్యార్థుల మానసిక వికాసానికి తోడ్పడాల్సిన కార్యక్రమాలు, వారిని తప్పుడు మార్గంలో నడిపించేలా ఉండడం ఆందోళన కలిగించే అంశం.
పెరుగుతున్న ఆందోళన!
ఈ ఘటన జరిగి వీడియో వైరల్ అవుతున్నప్పటికీ, అటు పాఠశాల యాజమాన్యం నుంచి గానీ, ఇటు విద్యాశాఖ అధికారుల నుంచి గానీ ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇటువంటి ఉదంతాలపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో మరిన్ని పాఠశాలల్లో ఇవే సంప్రదాయాలు మొదలయ్యే ప్రమాదం ఉంది. పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ దీనిపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కేవలం వినోదం కోసం విలువలని బలిపీఠం ఎక్కించడం సరైంది కాదని అందరూ అభిప్రాయపడుతున్నారు.
పాఠశాలలు కేవలం మార్కులు ఇచ్చే యంత్రాలుగా కాకుండా, ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే కేంద్రాలుగా నిలవాలి. కళలు, నృత్యాలు మన సంస్కృతిని ప్రతిబింబించాలి తప్ప, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉండకూడదు. ఈ కోల్‌కతా ఘటన మనందరికీ ఒక హెచ్చరిక. విద్యార్థులకు ఏది సరైనదో, ఏది కాదో నేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులపై ఉంది. విద్యాసంస్థల్లో ఇటువంటి అవాంఛనీయ ప్రదర్శనలు మళ్ళీ జరగకుండా చూడటమే మనముందున్న కర్తవ్యం.
