Begin typing your search above and press return to search.

10 వేల కోట్ల పండుగ - సిటీ ఆఫ్ జాయ్'లో దసరా పండుగ.. ప్రపంచాన్ని కట్టిపడేస్తున్న రంగుల జాతర!

దుర్గా పూజ కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు. ఇది సామాజిక ఉత్సవం కూడా. బెంగాలీ సంప్రదాయంలో అమ్మవారిని కుమార్తెగా భావించి ఇంటికి పిలిచినట్లుగా పూజిస్తారు.

By:  Tupaki Political Desk   |   30 Sept 2025 1:29 PM IST
10 వేల కోట్ల పండుగ - సిటీ ఆఫ్ జాయ్లో దసరా పండుగ.. ప్రపంచాన్ని కట్టిపడేస్తున్న రంగుల జాతర!
X

భారతదేశంలో నవరాత్రుల ఉత్సవాలు అన్ని రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతాయి. ఉత్తరాదిలో రామలీల ప్రదర్శనలు, దక్షిణాదిలో గోల్లు బొమ్మలు, పశ్చిమంలో గర్బా నృత్యాలు ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే, ఈ పండుగ వస్తే దేశ వాసుల మనసులో మెదిలే మొదటి నగరం మాత్రం కోల్‌కత్తా. ఎందుకంటే అక్కడి దసరా ఉత్సవాలు ముఖ్యంగా దుర్గా పూజలు వీక్షించాలే తప్ప చెప్పితే సంతోషించలేం.

కళల నగరం కోల్‌కత్తా

కోల్‌కతాకు ‘సిటీ ఆఫ్ జాయ్’అనే బిరుదు యాదృచ్ఛికంగా రాలేదు. నవరాత్రి రోజుల్లో ఆ నగరం ఆర్ట్ గ్యాలరీగా మారిపోతుంది. అమ్మవారి మండళ్లను నిర్మించేందుకు శిల్పులు, సంప్రదాయ కళాకారులు మాత్రమే కాకుండా ఆధునిక ఆర్కిటెక్ట్‌లు కూడా రంగంలోకి దిగుతారు. వెదురు, వస్త్రాలతో కట్టిన పండళ్లు (మండపాలు) వివిధ థీమ్‌లతో రూపొందుతాయి. ఒక పండాల్ ఈజిప్టు పిరమిడ్‌లా ఉంటే, ఇంకోటి ఆధునిక సైన్స్ మ్యూజియంలా ఉంటుంది. దీపాలంకరణలు, లైటింగ్ ఎఫెక్ట్‌లు, సంగీతం ఇవన్నీ కలసి ఒక మాయాజాలాన్ని సృష్టిస్తాయి. ఈ కారణంగానే ప్రతి సంవత్సరం విదేశీ పర్యాటకులు వేల సంఖ్యలో ఈ వేడుకను చూసేందుకు తరలివస్తారు.

ప్రజల మనసుకు దగ్గరైన పూజ

దుర్గా పూజ కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు. ఇది సామాజిక ఉత్సవం కూడా. బెంగాలీ సంప్రదాయంలో అమ్మవారిని కుమార్తెగా భావించి ఇంటికి పిలిచినట్లుగా పూజిస్తారు. ఆమెకు ఇష్టమైన వంటకాలను ప్రసాదాలుగా సమర్పిస్తారు. నృత్యాలు, గీతాలతో ఆడపడుచుగా చూసి మురిపిస్తారు. చివరికి నిమజ్జనానికి పంపేటప్పుడు ఇంటి అమ్మాయి పుట్టింటి నుంచి బయలుదేరుతున్నట్టుగా కన్నీరు పెట్టుకుంటారు. ఈ భావోద్వేగం ఉత్సవానికి ప్రత్యేకతనిస్తోంది.

ఆసక్తికరంగా పెళ్లిళ్లు..

ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ పండగ సందర్భంలో అనేక పెళ్లిళ్లు కుదురుతాయి. పండాళ్లను పెళ్లి మండపాలుగా భావించి, అక్కడే వివాహాలు జరపడం ఆనవాయితీ. ఢాకీలు (బెంగాలీ డోలు వాయిద్యకారులు) ఢమరుకం మోగిస్తే.. యువత నృత్యాలతో సందడి చేస్తుంది. మహిళలు చేతితో చప్పట్లు కొడుతూ నృత్యం చేస్తారు. దసరా రోజున జరిగే ‘సింధూర్ ఖేలా’లో మహిళలు ఒకరికి ఒకరు సింధూరం రాసుకుంటూ సంతోషాన్ని పంచుకోవడం మరింత ప్రత్యేకతనిస్తుంది.

ప్రపంచ గుర్తింపు

ఈ వేడుకల ప్రాముఖ్యతను యునెస్కో కూడా గుర్తించింది. 2021లో ‘ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీ’ జాబితాలో కోల్‌కత్తా దుర్గా పూజను చేర్చింది. ఇది ఒక నగరానికి మాత్రమే కాదు, మొత్తం దేశానికే గర్వకారణం. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో, కళా సృజనతో, భావోద్వేగంతో కలిపి జరిగే ఉత్సవం ప్రపంచంలో అరుదుగా కనిపిస్తుంటుంది.

ఆర్థిక ప్రాధాన్యత

ఈ వేడుకల్లో ఆర్థిక లావాదేవీలు కూడా గణనీయంగా జరుగుతాయి. ప్రతి ఏడాది రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల వరకూ ఈ పండుగ కోసం ఖర్చవుతుంది. ఇది ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు అయ్యే ఖర్చుకు సమానం. పండాళ్ల నిర్మాణం నుంచి ఆహార పదార్థాలు, దుస్తులు, అలంకరణలు, పర్యాటక వసతులు – అన్నింటిలోనూ ఆర్థిక చలనం ఉంటుంది.