వైరల్ ఫొటో : ఒకే ఫ్రేములో వంగవీటి, వల్లభనేని, కొడాలి
వైసీపీ కీలక నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో కలిసిన ఉన్న ఫొటో వైరల్ అవుతోంది.
By: Tupaki Political Desk | 7 Oct 2025 1:43 PM ISTవైసీపీ కీలక నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో కలిసిన ఉన్న ఫొటో వైరల్ అవుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఈ ముగ్గురు ఒకప్పుడు మంచి స్నేహితులు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, వీరు ఎప్పుడు కలిసినా ఆ ఫొటో మాత్రం ఇంటర్నెట్ లో హాట్ డిబేట్ కు కారణమవుతూనే ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై పెద్దగా ఆసక్తి చూపని వంగవీటి రాధా.. టీడీపీ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక రాధా భార్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సమీప బంధువుగా చెబుతారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం, డిప్యూటీ సీఎం మెయిన్ టార్గెట్ లో ఉన్న కొడాలి, వల్లభనేనితో వంగవీటి రాధా స్నేహం కొనసాగించడం ఆసక్తిరేపుతోంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంగవీటి కుటుంబానికి పెద్ద ఎత్తున ఫాలోయింగు ఉంది. ప్రధానంగా కాపు సామాజికవర్గ నేతగా వంగవీటి మోహన రంగాను ఆరాధించిన అభిమానులు, ఆయన మరణం తర్వాత రాధాకృష్ణను అనుసరిస్తున్నారు. రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పీఆర్ఫీ, కాంగ్రెస్, వైసీపీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాధా.. గత రెండు ఎన్నికల్లో పోటీకి విముఖత చూపారు. ఇక రాధా కాంగ్రెస్ పార్టీలో ఉండగా, కొడాలి, వల్లభనేని వంశీ టీడీపీలో ఉండేవారు. రాధా టీడీపీలోకి వచ్చిన సమయంలో ఆ ఇద్దరు వైసీపీలోకి మారారు. కానీ ఈ ముగ్గురి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది.
పార్టీలు వేరయినా ఈ ముగ్గురు తరచూ కలిసేవారు. కానీ, గత ప్రభుత్వంలో కొడాలి, వల్లభనేని వ్యవహరించిన తీరు వల్ల వారితో కలవడం రాధా బాగా తగ్గించినట్లు చెబుతున్నారు. ఇక గత ఎన్నికల్లో వారికి వ్యతిరేకంగా టీడీపీ కోసం రాధా పనిచేశారు. సన్నిహిత మిత్రులు అయినా, రాజకీయంగా ఆ ఇద్దరిని శత్రువులుగానే చూసిన రాధా తన కుటుంబానికి చెందిన కార్యక్రమాల్లో మాత్రం వారిని విస్మరించలేదని తాజా సంఘటన ద్వారా మరోసారి బయటపడింది. ఇటీవల రాధాకు కుమార్తె జన్మించగా, సోమవారం రాత్రి ఉయ్యాల ఫంక్షన్ నిర్వహించారు. దీనికి రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు వంగవీటి కుటుంబం ఆహ్వానించింది.
ఇక కొంత కాలంగా పెద్దగా హడావుడి చేయకుండా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ కలిసి రాధా కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యారు. రాధా కుమార్తె రుధినను ఆశ్వీరదించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు స్నేహితులు నవ్వులు చిందిస్తూ దిగిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. రాజకీయాలు వేరు.. స్నేహం వేరని ఈ ముగ్గురు స్నేహితులు నిరూపించారని అంటున్నారు. మరోవైపు కొడాలి, వల్లభనేని ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు ఆ ఫొలో కనిపించడం వైసీపీ శ్రేణులకు ఊపిరిపోసింది. ఇటీవల ఈ ఇద్దరు నేతలు వేర్వేరు అనారోగ్య లక్షణాలతో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.
