Begin typing your search above and press return to search.

వైసీపీ నేత కొడాలి నాని హంగామా.. జగన్ చెల్లెళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   23 March 2026 4:15 PM IST
వైసీపీ నేత కొడాలి నాని హంగామా.. జగన్ చెల్లెళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు
X

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. వైసీపీలో అత్యంత ముఖ్యమైన నేతల్లో ఒకరైన కొడాలి కొద్దికాలంగా సైలెంటుగా ఉంటున్న విషయం తెలిసిందే. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన అనారోగ్యం కారణంగా దాదాపు ఏడాదిగా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ కేడర్ కు ధైర్యం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడటంతో కొడాలి మళ్లీ యాక్టివ్ అయ్యారు. తొలిసారిగా గుడివాడ నియోజకవర్గం కాకుండా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ జిల్లాలో హంగామా చేశారు. జొన్నపాడు గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కొడాలి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. చాలా కాలం తర్వాత కొడాలి తనదైన స్టైల్ లో మాట్లాడటంతో వైసీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఫైర్ బ్రాండ్ నాయకుడు కోలుకున్నారని, ఇక జిల్లాలో దూకుడు చూపుతామని వ్యాఖ్యానిస్తున్నారు. చాలాకాలం తర్వాత కొడాలి కార్యకర్తల ముందుకు రావడం వైసీపీలో సందడి తెచ్చిందని అంటున్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి వాగ్దాటి చూపేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాలతో ఆయన మీడియాకు దూరంగా ఉంటున్నారు.

ఇక ఎన్టీఆర్ జిల్లా జోన్నపాడులో జరిగిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కూటమి నేతల దొంగ వాగ్దానాల వల్ల జగన్ ఓడిపోయారని విమర్శించారు. జగన్ ఓడిపోయినా ఆయన చేసిన పనులను గొప్పగా చెప్పుకునే అవకాశం వైసీపీ కార్యకర్తలకు ఉందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో జగన్ చేసిన పనులు వల్ల వైసీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారని అన్నారు.

కూటమి నేతల దొంగ హామీలను ఆ పార్టీ నేతలే దాట వేస్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఎవరూ తొందర పడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలకు జగన్ రెడ్డి విలువ తెలిసిందని అన్నారు. ఎన్నికల్లో జగన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాల హామీలు, అమలు పరిచిన పథకాలను 2024లో ప్రజలు గుర్తించకపోయినా, 2029లో గుర్తుకు తెచ్చుకుని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంటే పేద ప్రజలు, పేద విద్యార్థులకు న్యాయం జరిగేదని అన్నారు. ఇక జగన్ చెల్లెళ్లపైనా కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మాజీ సీఎం జగన్ కుటుంబ ఆస్తుల వివాదంపై కొడాలి స్పందిస్తూ.. జగన్ రెడ్డి ఇంట్లో ఉన్న చెల్లెళ్లు బయటకు తీసుకువచ్చి నిందలు మోపుతున్నారని, ప్రజలు ఒక విషయాన్ని ఆలోచించాలని మాజీ మంత్రి కొడాలి కోరారు. తండ్రి చనిపోతే ఆస్తుల్లో వాటా ఇస్తారని, కానీ తాను సంపాదించిన ఆస్తిలో కూడా వాటా ఇచ్చారని, అయినా ఆడపిల్లలు దారుణంగా మాట్లాడుతున్నారని కొడాలి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చెల్లెళ్లు తప్పుగా మాట్లాడుతున్నా ఆయన సంస్కారంతో ఒక్కమాట కూడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. జగన్ నిజమైన మానవతావాదిగా అభివర్ణించారు. ఇక తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు అబాసుపాలయ్యారని ధ్వజమెత్తారు.