Begin typing your search above and press return to search.

కొడాలి నాని బిగ్ సౌండ్ వెనక ?

వైసీపీలో ఒకనాడు ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న వారు కొడాలి నాని. వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత.

By:  Satya P   |   3 March 2026 9:13 AM IST
కొడాలి నాని బిగ్ సౌండ్ వెనక ?
X

వైసీపీలో ఒకనాడు ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న వారు కొడాలి నాని. వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత. వైసీపీ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు కీలకమైన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. వీటికి మించి దూకుడు రాజకీయాలు చేసే నేతగా ఉంటారు. కూటమి నేతల మీద ఆయన పదునైన విమర్శలు చేస్తారు. ఆ విషయంలో ఆయన దూకుడు వేరుగా ఉంటుందని అంటారు. ఇదిలా ఉంటే కొడాలి నాని ఓటమి తరువాత ఎక్కడా కనిపించలేదు. తాజాగా గుంటూరు వెళ్ళి మరీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఆయనను పరామర్శించారు.

జగన్ సీఎం అంటూ :

వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారు అని ఈ సందర్భంగా కొడాలి నాని బిగ్ సౌండ్ చేశారు. వైసీపీ గ్రాఫ్ పెరిగింది అన్నది ఆయన సౌండ్ ద్వారా వ్యక్తం అవుతోంది. జైలుకు రెడ్ బుక్ కి ఎవరూ భయపడేది లేదని అన్నారు. తాము దేనికైనా రెడీ అన్నట్లుగా ఆయన కూటమి ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చేశారు. మొత్తానికి చూస్తే కొడాలి నాని తాజా వ్యాఖ్యలలో అదే దూకుడు కనిపించింది. మరి ఆయన మళ్లీ జనంలోకి వస్తున్నారా ఇది వరకు మాదిరిగా మీడియాకు కనిపిస్తారా గుడివాడలో హల్ చల్ చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది.

ధీమా వచ్చిందా లేక :

ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ళు గట్టిగా నిండలేదు, కానీ 2029 ఎన్నికలకు తాము తయారు అని వైసీపీ అంటోంది. అంతే కాదు జగన్ సీఎం అని ముందే ప్రకటిస్తోంది. ఆ ధీమా వైసీపీకి చాలా తొందరగానే వచ్చింది అని అంటున్నారు. మరి నిజంగా దేనిని చూసి వైసీపీ నేతలు ఈ విధంగా అతి నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు అన్న చర్చ అయితే నడుస్తోంది. కొడాలి నాని వంటి వారు వైసీపీ గెలుపు తధ్యమని చెప్పడం ప్రత్యేకంగా చూడాలని అంటున్నారు. కూటమి ప్రభంజనంలో భారీ ఓటమి చూసిన నాని అయితే చాలా కాలం సైలెంట్ అయ్యారు. ఒక దశలో ఆయన రాజకీయాల్లో కొనసాగరు అని కూడా ప్రచారం సాగింది. కానీ ఇపుడు ఆయన వచ్చేది మేమే అని గట్టిగా చెప్పడం మీద వైసీపీతో పాటు బయట కూడా ఒక డిస్కషన్ అయితే సాగుతోంది.

పోటీకి సిద్ధమేనా :

అయితే నాని గుడివాడ ఇంకా వెళ్ళాల్సి ఉందని అంటున్న వారూ ఉన్నారు. ఆయన గుడివాడలో పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరుతున్న వారూ ఉన్నారు అక్కడ టీడీపీ జెండా ఎగరేసిన రాము తనదైన శైలిలో దూకుడుగానే ఉన్నారని అంటున్నారు. ఇక నాని గుడివాడ వైపు చూడకపోవడంతో వైసీపీ క్యాడర్ అయితే నిరాశలో ఉంది అన్న వార్తలు వచ్చాయి. నాని గుడివాడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్నది కూడా ఇంకో చర్చగా ఉంది. ఏది ఏమైనా కొడాలి నాని బిగ్ సౌండ్ వెనక తిరిగి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటాను అన్న సంకేతం అయితే ఉంది. మరి ఆ ముహూర్తం ఎపుడు అన్నదే వైసీపీ నేతలకూ తెలియడం లేదుట. మొత్తానికి నాని రీ ఎంట్రీ ఎపుడు ఇస్తారు అని అంతా ఆసక్తిగా అయితే చూస్తున్నారు.