Begin typing your search above and press return to search.

మత్తు మందుతో మోసం.. అమెరికా మహిళపై దారుణం.. చివరికి ఆమె ఏం చేసిందంటే?

ఆమెను బంధించి, మత్తుమందు ఇచ్చి బయట ప్రపంచంతో సంబంధాలు తెంచేసినా, ధైర్యంతో తప్పించుకుని ఎంబసీని ఆశ్రయించింది. ఈ ఘటన పర్యాటక రంగంలో భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది.

By:  Madhu Reddy   |   23 April 2026 4:00 AM IST
మత్తు మందుతో మోసం.. అమెరికా మహిళపై దారుణం.. చివరికి ఆమె ఏం చేసిందంటే?
X

కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఒక అమెరికా మహిళపై జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. హోమ్‌స్టేలో బస చేసిన ఆమెపై అక్కడి సిబ్బంది అత్యాచారానికి పాల్పడగా, యజమాని నిందితుడిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఆమెను బంధించి, మత్తుమందు ఇచ్చి బయట ప్రపంచంతో సంబంధాలు తెంచేసినా, ధైర్యంతో తప్పించుకుని ఎంబసీని ఆశ్రయించింది. ఈ ఘటన పర్యాటక రంగంలో భద్రతపై ఆందోళన రేకెత్తిస్తోంది.

హోమ్‌స్టేలో నమ్మకద్రోహం:

కొడగు జిల్లాలోని కుట్టా గ్రామంలో ఉన్న ఒక హోమ్‌స్టేలో ఈ ఘోరం జరిగింది. జార్ఖండ్‌కు చెందిన వృజేష్ కుమార్‌ అనే వ్యక్తి అక్కడ పని చేస్తున్నాడు. తన వద్దకు వచ్చిన అమెరికా మహిళను ఆదరించాల్సింది పోయి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలిస్తే తన వ్యాపారం పాడవుతుందని భావించిన హోమ్‌స్టే యజమాని, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు. అతిథిగా వచ్చిన మహిళకు నరకం చూపించారు.

బందీగా బాధితురాలు.. వైఫై కట్:

నిందితులిద్దరూ కలిసి బాధితురాలిని మూడు రోజుల పాటు నరకయాతన పెట్టారు. ఆమె ఎవరికైనా ఫోన్ చేసి విషయం చెబుతుందేమోనన్న భయంతో హోమ్‌స్టేలోని వైఫై కనెక్షన్‌ను ఆఫ్‌ చేశారు. అంతటితో ఆగకుండా ఆమెకు మత్తుమందు ఇచ్చి, ఎవరినీ కలవకుండా గదిలోనే బంధించారు. ఆమెను భయపెట్టి, లొంగదీసుకోవాలని చూశారు. కానీ ఆ మహిళ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, తాను మైసూరు వెళ్తానని చెప్పి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుంది.

పోలీసుల యాక్షన్:

తప్పించుకున్న వెంటనే బాధితురాలు అమెరికా ఎంబసీ అధికారులను సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించింది. వెంటనే స్పందించిన ఎంబసీ, మైసూరు పోలీసులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన కుట్టా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. కోర్టు వీరికి వచ్చే నెల 3వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

పర్యాటకుల భద్రత ప్రశ్నార్థకం?:

ప్రకృతి అందాలకు నిలయమైన కొడగులో ఇలాంటి ఘటన జరగడం పర్యాటకులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. హోమ్‌స్టేల పేరుతో సాగుతున్న ఇటువంటి ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విదేశీ పర్యాటకుల పట్ల ఇలాంటి ప్రవర్తన దేశ గౌరవానికి భంగం కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక బాధితురాలు చూపిన ధైర్యం వల్లే నిందితులు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. ప్రభుత్వాలు పర్యాటక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది.