Begin typing your search above and press return to search.

మెడికవర్ మీద కన్నేసిన కేకేఆర్.. రూ.10వేల కోట్లు ఆఫర్ చేసిందా?

మెడికవర్ విషయానికి వస్తే.. హైదరాబాద్ వాసులకు సుపరిచితమైన ఈ ఆసుపత్రుల చైన్ సంస్థకు దేశ వ్యాప్తంగ పలు నగరాల్లోనూ ఆసుపత్రులు ఉన్నాయి.

By:  Garuda Media   |   19 Jun 2026 12:57 PM IST
మెడికవర్ మీద కన్నేసిన కేకేఆర్.. రూ.10వేల కోట్లు ఆఫర్ చేసిందా?
X

హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులను సొంతం చేసుకునే ప్రక్రియ ఒకటి ఇటీవల కాలంలో ఊపందుకుంది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ తీరు.. ఇటీవల మరింత పెరగటమే కాదు.. రానున్న రోజుల్లో కొన్ని సంస్థల చేతుల్లో కార్పొరేట్ ఆసుపత్రులు ఉండనున్నాయా? అన్నదిప్పుడు చర్చగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా కార్పొరేట్ ఆసుపత్రుల చైన్ నిర్వహణ సాగించే మెడికవర్ హాస్పిటల్స్ మీద మరో కార్పొరేట్ దిగ్గజం కేకేఆర్ (కోల్ బర్గ్ క్రావిస్ రాబర్ట్స్) కన్నేసినట్లుగా రాయిటర్స్ కథనం ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర తీసింది.

మెడికవర్ విషయానికి వస్తే.. హైదరాబాద్ వాసులకు సుపరిచితమైన ఈ ఆసుపత్రుల చైన్ సంస్థకు దేశ వ్యాప్తంగ పలు నగరాల్లోనూ ఆసుపత్రులు ఉన్నాయి. చాలామందికి మెడికవర్ అన్నంతనే తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థగా భావిస్తారు. కానీ.. అందులో నిజం లేదు. ఇది స్వీడన్ హెడ్డాఫీసుగా పని చేసే ఒక అంతర్జాతీయ హెల్త్ కేర్ నెట్ వర్క్. అయితే.. భారత్ లోని దీని వ్యాపార కార్యకలాపాలన్నీ హైదరాబాద్ కేంద్రంగా సాగుతాయి.

కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ మహానగరంలో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ అన్న పేరుతో ప్రముఖ ఆసుపత్రి ఉండేది. దీని నెట్ వర్క్ ఆసుపత్రులను 2017లో స్వీడన్ కు చెందిన మెడికర్ గ్రూప్ మెజారటీ వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత దాన్ని మెడికవర్ హాస్పిటల్స్ గా పేరు మార్చి రీబ్రాండింగ్ చేశారు. అయితే.. భారతదేశంలో ఈ ఆసుపత్రుల కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉంది. అంతేకాదు.. దీని హెడ్దాఫీస్ స్వీడన్ లో ఉన్నప్పటికి.. మెడికవర్ ఇండియా ఛైర్మన్ కం ఎండీగా నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి.అనిల్ క్రిష్ణ వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్స్ చైన్ కు దేశ వ్యాప్తంగా దాదాపు 6వేల బెడ్స్ తో 26 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ న నిర్వహిస్తోంది. ఇందులో 16 హాస్పిటల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. మెడికవర్ గ్రూప్ నకు యూరోప్ లోని దాదాపు 18కి పైగా దేశాల్లో హాస్పిటల్స్ ను నిర్వహిస్తోంది. అలాంటి ఈ గ్రూప్ లో అమెరికా కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ కన్నేసినట్లుగా చెబుతున్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఈక్విటీలో మెజార్టీ వాటా కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా రాయిటర్స్ వార్తా కథనంలో వెల్లడైంది.

త్వరలో మెడికవర్ ఐపీవోకు వెళుతుందన్న మాట బలంగా వినిపిస్తున్న సమయంలోనే.. ఇందులో మెజార్టీ వాటాను కేకేఆర్ సొంతం చేసుకునేందుకు చర్చలు జరపటం ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం రూ.9900 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ డీల్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నా.. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ కేకేఆర్ సంస్థ ఏంటి? దీని బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీస్తే మాత్రం ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

అమెరికాలోని న్యూయార్క్ నగర ప్రధాన కార్యాలయంగా పని చేసే ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్ మెంట్.. ప్రైవేట్ ఈక్విటీ సంస్థగా చెబుతారు. 1976లో జెరోమ్ కోల్ బర్గ్ జూనియర్.. హెన్రీ క్రావిస్.. జార్జ్ ఆర్ రాబర్ట్స్ తో కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. ఇంతకూ దీని వ్యాపార శైలి ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు సింఫుల్ గా ఒక చిన్న పోలికతో ఇదెలాంటి వ్యాపారం చేస్తుందో చెప్పేయొచ్చు. ఏ వ్యాపారం నిర్వహించే సంస్థ అయినా సరే.. దానికున్న అప్పులు.. ఈక్విటి పెట్టుబడుల ద్వారా కంపెనీని పూర్తిగా కొనేయటం.. దాన్నిలాభాల్లోకి తీసుకొచ్చి మళ్లీ దాని వాటాను అమ్మేసే లీవరేజ్డ్ బైఅవుట్ విధానాన్ని కేకేఆర్ ఫాలో అవుతుంది. అంతేకాదు.. ఇప్పుడు ఈ విధానాన్ని ఫాలో అయ్యే సంస్థలు చాలానే కనిపిస్తాయి. అయితే.. ఈ విధానాన్ని షురూ చేసిందే కేకేఆర్ కావటం గమనార్హం.

భారతదేశంలో నాణ్యమైన వైద్యానికి ఉన్న డిమాండ్ తో పాటు.. భారీగా పెరిగిన ఆరోగ్య బీమా మార్కెట్ నేపథ్యంలో కేకేఆర్ సంస్థ కొన్నేళ్లుగా భారతీయ ఆసుపత్రుల నెట్ వర్క్ మీద భారీగా కన్నేసినట్లుగా చెబుతారు. ఇప్పటికే ఈ సంస్థ కేరళకు చెందిన బీబీ మెమోరియల్ హాస్పిటల్స్ ద్వారా హైదరాబాద్ కు చెందిన స్టార్ హాస్పిటల్ లో 60 శాతం మెజార్టీ వాటాను రూ.1800 కోట్లకు కొనుగోలు చేయటం తెలిసిందే. ప్రముఖ కార్డియాలజిస్ట్ కం పద్మశ్రీ అవార్డు గ్రహాత డాక్టర్ మన్నం గోపీచంద్ స్థాపించిన ఈ హాస్పిటల్ ను సొంతం చేసుకోవటానికి అపోలో.. మణిపాల్ లాంటి దిగ్గజ సంస్థలు పోటీ పడినా.. కేకేఆర్ మాత్రం చివరకు డీల్ ను క్లోజ్ చేయటం విశేషం. మెడికవర్ తో తాజాగా జరుపుతున్న చర్చలు సక్సెస్ అయి.. మెజార్టీ వాటాను సొంతం చేసుకుంటే భారతదేశంలో అపోలో.. ఆస్టర్ లాంటి హెల్త్ కేర్ నెట్ వర్క్ లకు కేకేఆర్ గ్రూప్ అతి పెద్ద పోటీదారుగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. మెడికవర్ లో మెజార్టీ వాటాను సొంతం చేసుకోవటానికి వెనుక చాలానే హోంవర్కు నడుస్తుందన్న మాట కార్పొరేట్ ప్రపంచంలో వినిపిస్తోంది.