జూబ్లీ రిజల్ట్ : రివర్స్ అయిన కేకే సర్వే
తెలుగు నాట కేకే సర్వే అన్నది ప్రాముఖ్యత కలిగినదే కాదు విశ్వసనీయమైనదిగా పేరు తెచ్చుకుంది.
By: Satya P | 15 Nov 2025 9:01 AM ISTతెలుగు నాట కేకే సర్వే అన్నది ప్రాముఖ్యత కలిగినదే కాదు విశ్వసనీయమైనదిగా పేరు తెచ్చుకుంది. ఉన్నది ఉన్నట్లుగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని చెప్పడమే కాకుండా చాలా కచ్చితత్వంలో నంబర్స్ తో సహా డేటా మొత్తం అందిస్తారు అని గుర్తింపు అయితే ఉంది. దానికి అచ్చమైన ఉదాహరణలు 2019, 2024 ఎన్నికలు. ఈ రెండు ఎన్నికల్లో ఏపీలో గెలిచే పార్టీ ఏది ఓడే పార్టీ ఏది అని నిక్కచ్చిగా చెప్పడమే కాదు ఎవరిని ఎన్ని సీట్లు వస్తాయో లెక్క వేసి మరీ చెప్పారు. దానికి తగినట్లుగా ఫలితాలు వచ్చాయి. దాంతో అంతా కేకే సర్వే అంటే ఎంతో ఆసక్తిని చూపిస్తూ వచ్చారు. కిరణ్ కొండేటి అనే ఆయన ఈ సర్వేలను నిర్వహిస్తూ వస్తున్నారు ఆ విధంగా ఆయన మెయిన్ స్ట్రీం మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఎంతో ఫ్యామస్ అయ్యారు కూడా.
జూబ్లీ హిల్స్ ఫలితంలో :
ఇదిలా ఉంటే తాజాగా జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాల విషయంలో మాత్రం కేకే సర్వే రాంగ్ చెప్పి బూమరాంగ్ అయింది అని అంటున్నారు. ఇక్కడ బీఆర్ ఎస్ కే విజయావకాశాలు ఉన్నాయని చెప్పడం ద్వారా కేకే సర్వే అందరినీ మొదట్లో ఆకట్టుకుంది. ప్రీ పోల్ సర్వే తో పాటు ఎగ్జిట్ పోల్స్ సర్వేలని కూడా చెప్పింది. ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తే బీఆర్ఎస్ కి ఏకంగా 49 శాతం ఓట్లు వస్తాయి కాంగ్రెస్ కి 41 శాతం, బీజేపీకి 8 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. అంతే కాదు బీఆర్ఎస్ పాలన మీద ప్రజలలో ఎంతో విశ్వాసం ఉందని కూదా విశ్లేషించింది. ఇక ప్రీ పోల్ సర్వేలో అయితే బీఆర్ఎస్ కి 55.2 శాతం ఓటు షేర్ ని, కాంగ్రెస్ కి 37.8 శాతం ఓటు షేర్ ని 7 శాతం బీజేపీకి ఇచ్చింది.
భారీ తేడాతో :
ఇక ఈవీఎంలు ఓపెన్ చేసిన తరువాత భారీ తేడాతో బీఆర్ఎస్ ఓటమి పాలు అయింది. దాంతో కేకే సర్వే తప్పు అయినట్లు అయింది. జూబ్లీ హిల్స్ ఓటర్ల నాడిని పసిగట్టడంలో కేకే సంస్థ సర్వే పూర్తిగా విఫలం చెందింది అని అంటున్నారు. అంతే కాకుండా ఓటర్లను మిస్ లీడ్ చేసినట్లుగా ఉందని అంటున్నారు. ఒక వైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండగా బీఆర్ఎస్ గెలుస్తుందని అంటూ ఒక ప్రీ పోల్ సర్వేని కేకే సంస్థ రిలీజ్ చేసింది. దాంతో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బలమూరి వెంకట్ దీని మీద ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు.
ఒక్కసారిగా ప్రాచుర్యం :
ఇక వెనక్కి వెళ్ళి చూస్తే కనుక 2024 ఎన్నికల ముందు కేకే సర్వే టీడీపీ కూటమికి 160 ప్లస్ దాకా సీట్లు వస్తాయని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. దానికి తగినట్లుగానే 164 సీట్లతో కూటమి గెలిచింది. దాంతో కేకే సర్వే అంటే అందరికీ బాగా గురి కుదిరింది. అయితే ఆ తరువాత మాత్రం తన క్రెడిబిలిటీని కాపాడుకోవడంలో ఈ సంస్థ విఫలం అవుతూ వచ్చింది. గత ఏడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని కేకే సర్వే చెప్పింది. కానీ ఫలితాలు బీజేపీకే పట్టం కట్టాయి. ఇపుడు చూస్తే జూబ్లీ హిల్స్ ఫలితం కూడా సర్వే లెక్కలను దూరం పెట్టి తేడా కొట్టించింది అని అంటున్నారు. దీంతో కేకే సర్వే మీద నమ్మకం అయితే తగ్గుతోందా అన్న చర్చ అయితే వస్తోంది.
