Begin typing your search above and press return to search.

జే&కే లోని బంకర్ లో ఉగ్రవాదుల మ్యాగీ, రైస్... ఇవి వారిద్దరివేనా..!

గత ఏడాది డిసెంబర్‌ లో జమ్మూలోని అటవీ ప్రాంతాలలో దాదాపు మూడు డజన్ల మంది ఉగ్రవాదులను నిర్మూలించడానికి ప్రారంభించిన ప్రధాన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ తర్వాత ఇది జరిగింది!

By:  Raja Ch   |   20 Jan 2026 6:14 PM IST
జే&కే లోని బంకర్ లో ఉగ్రవాదుల మ్యాగీ, రైస్... ఇవి వారిద్దరివేనా..!
X

కిష్త్వార్‌ లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా దళాలు 'ఆపరేషన్ ట్రాషి-1'ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ మంగళవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. గత ఏడాది డిసెంబర్‌ లో జమ్మూలోని అటవీ ప్రాంతాలలో దాదాపు మూడు డజన్ల మంది ఉగ్రవాదులను నిర్మూలించడానికి ప్రారంభించిన ప్రధాన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ తర్వాత ఇది జరిగింది! ఈ సమయంలో బలమైన బంకర్ కు సంబంధించిన ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

అవును... జమ్మూ కాశ్మీర్‌ లోని కిష్త్వార్‌ లోని కఠినమైన, ఘనీభవించిన పర్వతాలలో.. పాకిస్తాన్‌ కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ (జేఎం) ఉగ్రవాదులు దాదాపు 12,000 అడుగుల ఎత్తులో కార్గిల్ శైలి బలవర్థకమైన బంకర్‌ లో ఉన్నారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ రహస్య స్థావరాన్ని భారత సైన్యం ఛేదించిన తర్వాత అందులో... మ్యాగీ, బియ్యం సహా పలు ఆహార పదార్థాలు కనిపించాయి. దీంతో.. వారు ఇక్కడ నెలల తరబడి నివాసానికి ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు!

మరికొన్ని రోజుల్లో దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కిష్త్వార్ ప్రాంతంలో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ఈ ప్రాంతంలోకి మరింత మంది ఉగ్రవాదులను పంపించడానికి తీవ్రంగా ప్రయాణిస్తున్నట్లు నిఘావర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. భద్రతా దళాలు పలు ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే భద్రతా దళాలు ఈ బలమైన బంకర్ ను ఛేదించాయి.

ఈ క్రమంలో ఇందులో... దాదాపు 50 మ్యాగీ ప్యాకెట్లు, టమోటాలు, బంగాళాదుంపలు వంటి తాజా కూరగాయలుతో పాటు 20 కిలోల నాణ్యమైన బాస్మతి బియ్యం, ధాన్యాలు, వంట గ్యాస్, ఎండిన కలప, 15 రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. వీరికి శీతాకాలం మొత్తం మనుగడ సాగించడానికి గల ప్రణాళికలను ఇవి వెల్లడిస్తున్నాయని అంటున్నారు. ఈ కట్టుదిట్టమైన బంకర్ ను జైషే కమాండర్ సైఫుల్లా, అతని డిప్యూటీ ఆదిల్ ఉపయోగిస్తున్నారని అంటున్నారు.

కాగా... జమ్మూ కాశ్మీర్‌ లోని కిష్త్వార్ జిల్లాలోని ఛత్రు ప్రాంతంలో ఆదివారం సెర్చ్ బృందంపై ఇద్దరు ఉగ్రవాదులు మెరుపుదాడి చేసి.. ఒక సైనికుడిని చంపి, మరో ఎనిమిది మందిని గాయపరిచారు! ఉగ్రవాదులు దాక్కొన్న ప్రదేశానికి సైనికుల బృందం చేరుకుంటుండగా.. ఇద్దరు ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరి, ఎత్తు నుండి కాల్పులు జరిపారని చెబుతున్నారు. ఆ తర్వాత ఉగ్రవాదులు అక్కడ నుంచి పారిపోయారు! ఈ క్రమంలో ఈ బంకర్ వ్యవహారం వెలుగు చూసింది!