Begin typing your search above and press return to search.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు....కిషన్ రెడ్డి నా మజాకానా !

వామ్మో కిషన్ రెడ్డి అని అంతా అంటున్నారిపుడు. తెలంగాణా రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత ఆయన.

By:  Satya P   |   25 Jun 2026 9:25 AM IST
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు....కిషన్ రెడ్డి నా మజాకానా !
X

వామ్మో కిషన్ రెడ్డి అని అంతా అంటున్నారిపుడు. తెలంగాణా రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత ఆయన. కేంద్ర మంత్రిగా గత ఏడేళ్ళుగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి రాజకీయ జీవితం ఏకంగా నాలుగు దశాబ్దాలు పైదాటింది. విద్యార్థి రాజకీయాల నుంచే ఆయన రాటు తేలారు. యువజన రాజకీయాలతో పోరాటాలు చేశారు. ఆఖరికి ఉమ్మడి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఎమ్మెల్యే అయ్యారు. ఎంపీ అయి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఇలా గత రెండు టెర్ముల నుంచి ఆయన గెలుస్తూ వస్తున్నారు. ఇక తెలంగాణాలో బీఆర్ ఎస్ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కిషన్ రెడ్డి విమర్శలు కూడా నిర్మాణాత్మకంగా చేస్తూ వస్తున్నారు. అంతే కాదు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి చేయాల్సిన కృషి చేస్తున్నారు.

టార్గెట్ చేసిన రేవంత్ :

ఇదిలా ఉంటే కిషన్ రెడ్డిని కోరి మరీ తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే టార్గెట్ చేశారు. ఆయన కాంగ్రెస్ సీఎం. ఈయన బీజేపీ కేంద్ర మంత్రి. రెండూ జాతీయ పార్టీలే. పైగా తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటోంది. దాంతో సామ దాన భేద దండోపాయాలు అన్నీ ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ముప్పుని ముందే గ్రహించి పొలిటికల్ గా కంట్రోల్ లో పెట్టాలన్న వ్యూహంతోనే కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. కేంద్రం నుంచి తెలంగాణాకు ఏ సాయం దక్కకుండా చేస్తున్నారు అని విమర్శించారు. కేంద్రం సాయం చేస్తామన్నా మోకాలడ్డు తున్నారు అని ఆక్షేపించారు. మెట్రో ఫేజ్ టూ కి కేంద్రం అనుమతించక పోవడానికి కిషన్ రెడ్డి కారణం అన్నారు. ఇలా ఎన్ని అనాలో అన్నీ అనేశారు.

ఊహించని స్టెప్ తో :

దానికి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది చెప్పారు. అంతటితో ఆయన ఆగి ఉండలేదు. నేరుగా తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలసి కేంద్ర మంత్రులను కలిశారు. తానే అపాయింట్మెంట్ తీసుకుని మరి కేంద్ర రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తో భేటీ వేయించారు. అక్కడ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డితో కలసి తాను కూడా పాల్గొన్నారు. విషయం ఏమిటి ఎక్కడ డ్రా బ్యాక్స్ ఉన్నాయన్నది కూడా సీఎం కేంద్ర మంత్రి ఇద్దరూ అశ్వని వైష్ణవ్ వద్దనే వివరంగా తెలుసుకున్నారు. ఇలా రేవంత్ అండ్ కిషన్ రెడ్డి షేక్ హ్యాండ్ లతో తెలంగాణా రాజకీయం ఒక్కసారి షేక్ అయిపోయింది. నిజానికి తనని నిందిస్తూ ఘాటైన విమర్శలు చేసే ప్రత్యర్ధి విషయంలో ఎవరూ ఇంతలా చొరవ తీసుకుని వ్యవహరించరు. కానీ కిషన్ రెడ్డి ఇక్కడే స్మూత్ గా వ్యవహారం డీల్ చేస్తూనే తన మీద మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి అయినా విమర్శించకుండా చేయాల్సిన ఢిల్లీ మంత్రాంగం చేశారు అని అంటున్నారు.

వారికీ సందేశం :

అంతే కాదు తాను తెలంగాణా ప్రజలకు కూడా ఈ ఎపిసోడ్ ద్వారా చెప్పాల్సింది చెప్పారు అని అంటున్నారు. తాను తెలంగాణా అభివృద్ధిని అడ్డుకోవడం లేదని కేంద్రం వైపు నుంచి ఏమి చేయాలో అన్నీ చేస్తాను అని ఒక సందేశం ఇచ్చేశారు. ఇలా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కిషన్ రెడ్డి వేసిన ఈ ఎత్తుగడ మీద తెలంగాణా రాజకీయాల్లో చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే భవిష్యత్తులో బీజేపీ ఈ ఇష్యూని జనంలో పెట్టి బీజేపీకి తెలంగాణా ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అన్నది బాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వీలు ఉండేలా బూస్ట్ ఇస్తుందని కూడా అంటున్నారు. మొత్తానికి సైలెంట్ గా ఉంటూ అరుపులు కేకలు లేకుండా కిషన్ రెడ్డి తన పాలిటిక్స్ ఏంటో చూపించారు అని అంటున్నారు. దటీజ్ కిషన్ రెడ్డి అని కూడా అంటున్నారు.