Begin typing your search above and press return to search.

రాహుల్ నవ్వులపాలు కావొద్దు.....బీజేపీ హితవు వెనక ?

హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌లో విదేశీ నేతలు భారత అంతర్గత రాజకీయాలపై వ్యాఖ్యానించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన వైఖరి మార్చుకోవాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. భారత్‌లో ఎక్కువ సమయం గడపాలని, సీనియర్లను గౌరవించాలని, బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీపై ద్వేషం వీడాలని హితవు పలికారు.

By:  Satya P   |   17 Nov 2026 9:36 AM IST
రాహుల్ నవ్వులపాలు కావొద్దు.....బీజేపీ హితవు వెనక ?
X

కాంగ్రెస్ అగ్ర నేత, గాంధీల వంశీకుడు, కాబోయే ప్రధానిగా ట్యాగ్ తో దేశమంతా చుట్టి వస్తున్న వారు అయిన రాహుల్ గాంధీ, ఇంకా చెప్పాలంటే లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అంటే పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం చూస్తే ప్రధాని మోడీ తరువాత ఆయనే ఉంటారు అన్న మాట. ఇక రెండున్నర దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో ఎంపీగా ఉంటూ చురుకైన పాత్ర పోషిస్తున్న రాహుల్ గాంధీ మీద అధికార బీజేపీ విమర్శలు చేయడం సహజం. కానీ ఇపుడు సెటైర్లతో హాట్ కామెంట్స్ చేస్తూనే హిత బోధ కూడా చేస్తోంది.

విను మా మాట :

రాహుల్ ని విను మా మాట అని బీజేపీ అంటోంది. రాహుల్ గాంధీ తనదైన రాజకీయ వైఖరితో తాను నవ్వుల పాలు అవుతున్నారు, అలాగే దేశాన్ని అవమానిస్తున్నారు అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాహుల్ తీరు మార్చుకోవాల్సిందే అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. రాహుల్ ఇదే విధంగా వైఖరిని ప్రదర్శిస్తే దేశ ప్రజల మెప్పు ఎప్పటికీ పొందలేరని బీజేపీ మంత్రి అంటున్నారు.

ఏడు సూచనలు అంటూ :

ఇక రాహుల్ కి ప్రజల విశ్వాసం పొందడానికి ఏడు సూచనలు బీజేపీ మంత్రి చేయడం విశేషం. నిజానికి ప్రత్యర్ధి ఎదుగుదలకు సలహా సూచనలు అయితే సాధారణంగా ఎవరూ ఇచ్చేది ఉండదు, కానీ బీజేపీ మాత్రం ఉదారంగా వ్యవహరిస్తూ ఈ సూచనలు చేస్తోందా లేక రాహుల్ లో ఇంకా రాజకీయంగా మెచ్యూరిటీ రాలేదని భావించి జనం ముందు తక్కువ చేసి చూపిస్తుందా అన్నది తెలియదు కానీ రాహుల్ కి అయితే కిరణ్ రిజిజు ఏడు కీలక సూచనలు చేస్తూ వాటిని పాటించండని హితవు పలికారు.

బీజేపీకి ఆగ్రహం :

ఇంతకీ బీజేపీకి ఎందుకు ఆగ్రహం వచ్చింది అంటే తాజాగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన భారత్ సమ్మిట్ గురించే. ఈ సమ్మిట్ మీద రాజకీయంగా ఘాటు విమర్శలు బీజేపీ చేస్తోంది. ఈ సమ్మిట్ లో రాహుల్ గాంధీ సమక్షంలో విదేశీ నేతలు భారత అంతర్గత రాజకీయాల గురించి వ్యాఖ్యానించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సమ్మిట్ లో ఇటలీకి చెందిన ఒక నాయకుడు రాహుల్ గాంధీ నినాదమైన ఓట్ చోర్ గద్దీ ఛోడ్ ను పునరావృతం చేయడం దానికి వేదికపై ఉన్న రాహుల్ గాంధీ చప్పట్లు కొడుతూ నవ్వడంపైన బీజేపీ ఫైర్ అవుతోంది అంటున్నారు.

ఇదేమి తీరు :

రాహుల్ తీరుని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తప్పు పడుతూ ఇదేమి తీరు అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తాను నవ్వుల పాలు అవుతున్నారు అని గ్రహించడం లేదని ఆయన అన్నారు. అంతే కాదు, ఆయన దేశాన్ని కూడా అవమానించారని విమర్శించారు. రాహుల్ ప్రజల మన్నన పొందాలంటే విధానం ఇది కాదని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. రాహుల్ భారత్‌లో ఎక్కువ సమయం గడపాలని, తరచూ రహస్య విదేశీ పర్యటనలకు వెళ్లడం మానుకోవాలని జొతవి పలికారు. సీనియర్ నాయకుల్ని గౌరవించాలని అనుభవజ్ఞులైన నేతల నుంచి ఎంతో నేర్చుకోవాలని సూచించారు. భారత వ్యతిరేక శక్తుల్ని కలవడం వారి అజెండాలను ప్రచారం చేయడం కూడా రాహుల్ మానుకోవాలని సూచించారు. ఇక చివరిగా చేసిన మరో సూచన కీలకమే. రాహుల్ బీజేపీని శత్రువుగా కాకుండా రాజకీయ ప్రత్యర్థి గా చూడాలని కిరణ్ రిజిజు అన్నారు. అంతే కాదు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లతో పాటు ప్రధాని మోడీ పట్ల రాహుల్ ద్వేషాన్ని విడిచిపెట్టాలని కేంద్ర మంత్రి సూచించారు.