ప్రపంచంలో టాప్ 100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో తెలుగోడు
ప్రతిష్టాత్మక ‘టైమ్’ మ్యాగజైన్ ప్రపంచంలోని టాప్ 100 అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. 2026కు సంబంధించి మొత్తం ఆరు విభాగాలకు సంబంధించిన ప్రముఖుల్ని ఎంపిక చేసింది.
By: Garuda Media | 16 April 2026 11:06 AM ISTప్రతిష్టాత్మక ‘టైమ్’ మ్యాగజైన్ ప్రపంచంలోని టాప్ 100 అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. 2026కు సంబంధించి మొత్తం ఆరు విభాగాలకు సంబంధించిన ప్రముఖుల్ని ఎంపిక చేసింది. ఇందులో కళాకారులు.. నాయకులు.. పయనీర్లు.. టైటాన్లు..ఐకాన్లు.. ఇన్నోవేటర్లు ఉన్నారు. కొత్త ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్తలు.. సాంకేతిక నిపుణుల విభాగంలో మనోడు.. తెలుగోడు (భారత సంతతికి చెందిన) డాక్టర్ కిరణ్ ముసునూరుకు చోటు దక్కింది. ఆయన విషయానికి వస్తే ఆయన్ను.. ప్రముఖ కార్డియాలజిస్ట్, జన్యుశాస్త్రవేత్తగా పేర్కొంటారు. ప్రస్తుతం పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని పెరెల్ మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో మెడిసిన్ & జెనెటిక్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
గుండె జబ్బులను నివారించేందుకు సీఆర్ఐఎస్ పీఆర్(CRISPR) జన్యు సవరణ సాంకేతికతను ఉపయోగించటంలో ఆయన ప్రపంచ స్థాయి నిపుణుడిగా పేరుంది. 2025-26లోఅరుదైన.. ప్రాణాంతకమైన జీవక్రియ వ్యాధితో పుట్టిన బేబీ కేజే అనే శిశువును కాపాడేందుకు ప్రపంచంలోనే తొలిసారి కస్టమ్ మేడ్ చికిత్సను రూపొందించిన టీంకు ఆయన నాయకత్వం వహించారు.
ఇందుకు ఆయనకు టైమ్ మ్యాగ్ జైన్ లో ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావంతమైన వ్యక్తులలో ఒకరిగా గుర్తింపు లభించింది. అంతేకాదు..ఆయన చేస్తున్న పరిశోధన కూడా ఆయనకు ఈ అరుదైన గుర్తింపునకు అవకాశం కల్పించింది. ఆయన చేస్తున్నపరిశోధనను వాడుక భాషలో సింఫుల్ గా చెప్పాలంటే.. కాలేయంలోని కొలెస్ట్రాల్ జన్యువులను శాశ్వతంగా నియంత్రించటం ద్వారా గుండెపోటు రాకుండా కేవలం ఒక్క ఇంజెక్షన్ తో రక్షణ కల్పించే వ్యాక్సిన్ చికిత్సపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పలు అంతర్జాతీయ పురస్కారాలతో పాటు.. అమెరికా వైట్ హౌస్ నుంచి ప్రెసిడెన్షియల్ ఎర్లీ కెరీర్ అవార్డును సొంతం చేసుకున్నారు.
ఇక.. ఆయన కుటుంబ వివరాల్లోకి వెళితే.. ఆయన తండ్రి కోటేశ్వరరావు ముసునూరు కూడా అమెరికాలో ఫేమస్ కార్డియాలజిస్టు. ఆయన 1976లో ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. అదే ఏడాది కిరణ్ న్యూయార్క్ లో జన్మించారు. చిన్నతనం నుంచి తండ్రితో పాటు ఆసుపత్రికి వెళ్లి.. రోగుల కేస్ షీట్ల ను చూస్తుండేవారు. వైద్యరంగం మీద ఉన్నఆసక్తితో తండ్రి బాటలోనే ఆయనా కార్డియాలజిస్టు అయ్యారు. అంతేకాదు.. ఆ రంగంలో పరిశోధనల వైపుమరింత ఫోకస్ చేశారు. లిపిడ్ జీవక్రియను.. గుండెపోటు ముప్పును నియంత్రించే జన్యువులపై ఆయనపెద్ద ఎత్తున అధ్యయనం చేశారు. గుండెపోటును నివారించే టీకాను తయారు చేసేందుకు జన్యు ఎడిటింగ్ ప్రక్రియను ఉపయోగించవచ్చన్నవిషయాన్ని ఆయన కనుగొన్నారు.
డాక్టర్ కిరణ్ లోని మరో గొప్ప అంశం ఏమంటే.. ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాల నుంచి అనేక డిగ్రీలు పొందటం.హార్వర్డ్, రాక్ ఫెల్లర్, వెయిల్ కార్నెల్ మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా లాంటి వర్సిటీల్లో వివిధ డిగ్రీలు సాధించారు. ప్రస్తుతం పెన్సిల్వేనియా వర్సిటీలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాల్నిబయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
తాజా జాబితాలో భారతీయులు.. భారత సంతతికి చెందిన వ్యక్తులు ఎవరెవరు చోటు సంపాదించారన్నవిషయానికి వస్తే.. సుందర్ పిచాయ్ (గూగుల్), వికాస్ ఖన్నా (ప్రముఖ మిచెలిన్ స్టార్ షెఫ్), నీల్ మోహన్(యూట్యూబ్ సీఈవో), జోహ్రాన్ మమ్ దానీ (న్యూయార్క్ నగర మేయర్), బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ లకు చోటు దక్కింది.టైంజాబితాలో ర్యాంకులు ఉండదు. కాకుంటే.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఎంపిక చేసిన జాబితాను విడుదల చేస్తారు.
