రాజకీయాల మీద మాజీ సీఎం కిరణ్ సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా మూడేళ్ళ పాటు పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వర్తమాన రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శించారు.
By: Satya P | 9 Aug 2026 7:00 AM ISTఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రిగా మూడేళ్ళ పాటు పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వర్తమాన రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శించారు. అంతే కాదు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు అంటే ఒకప్పుడు ఉన్న సేవా భావం ఇపుడు లేదని ఇది మంచి వ్యాపారంగా మారింది అని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు హాజరైన కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చాలానే చేశారు. చాలా కాలం తరువాత మైకు అందుకున్న ఈ సీనియర్ నేత తన మనసులో మాటలను చెప్పడం విశేషం.
బెస్ట్ బిజినెస్ అంటే :
రాజకీయాలే బెస్ట్ బిజినెస్ గా మారాయని కిరణ్ సెటైర్లు వేశారు. ఒకప్పుడు రాజకీయాలలోకి వచ్చిన వారు ప్రజలకు మేలు చేద్దామని చూసేవారు అని అన్నారు. ఇపుడు అలా కాదని మంచి వ్యాపారంగా మారింది అని ఆయన విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చి బాగా సంపాదించుకోవడం మళ్లీ గెలవడం ఇదంతా ఒక విధంగా తయారైన పరిస్థితి అని ఆయన అన్నారు. ప్రజలకు కూడా రాజకీయాల మీద నెమ్మదిగా నమ్మకం విశ్వాసం పోతోంది అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అందుకే వారు కూడా తాత్కాలిక తాయిలాల మీద మోజు పడుతున్నారని ఆయన అన్నారు.
ఓటర్లది తప్పు కాదు :
తాను 1989లో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచాను అని ఆయన చెప్పారు. ఆ రోజులలో బూత్ మొత్తానికి కలిపి 12 వందల రూపాయలు దాకా ఇచ్చేవారమని గుర్తు చేసుకున్నారు. కానీ ఇపుడు అలా లేదని ఒక్క ఓటరుకే రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అని ఆయన అన్నారు. చదువు లేని వారు ఓటుకు నోటు తీసుకుంటే ఏమో అనుకోవచ్చు అని కానీ నెలకు లక్ష రూపాయల దాకా జీతం తీసుకుంటున్న వారు కూడా బేరాలు పెట్టి మరీ ఓట్లను అమ్ముకోవడం బాధాకరం అన్నారు. ఇలాంటివి చూసినపుడు రాజకీయం తమలాంటి వారు చేయలేరనిపిస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధికి ఓటు లేదు :
అంతే కాదు అభివృద్ధి చేస్తే ఓట్లు రాలుతాయని అనుకుంటే పొరపాటు అని కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తన నియోజకవర్గంలోని ఒక మారుమూల గ్రామానికి కేవలం అయిదు వందల గడప ఉన్న ఊరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అన్నారు. అక్కడ అందరికీ ఇళ్ళు కట్టించామని నీళ్ళు ఇచ్చామని రోడ్లు వేశామని అయినా 2009 ఎన్నికల్లో తనకు కేవలం 30 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది అని ఆయన చెప్పారు. అదే ఏ అభివృద్ధి చేయనపుడు 300 ఓట్ల మెజారిటీ వచ్చిందని ఆయన అంటూ జనాల ఆలోచనలు అర్థం చేసుకోవడం కష్టం అన్నారు.
రాత బాగుంటేనే :
రాజకీయాల్లో విజయానికి ఫార్ములా అంటూ ఏదీ లేదని ఆయన అన్నారు. గెలవడం అయినా ఓడడం అయినా తలరాతను బట్టే ఆధారపడి ఉంటుందని అన్నారు. ఓటర్ల దేవుళ్ళ కరుణ ఎవరి మీద ఉంటే వారు గెలుస్తారు అని అన్నారు. మానవ సంబంధాలే విజయానికి ఎంతో కొంత సహకరిస్తాయని ఆయన అన్నారు. మొత్తం మీద చూస్తే మాజీ సీఎం వర్తమాన రాజకీయాల గురించి తనదైన విశ్లేషణ చేశారు. అంతే కాదు ఇప్పుడు రాజకీయాలు చేయలేమని కూడా వేదాంతం ప్రదర్శించారు. ఆయన వ్యాఖ్యలు అయితే చర్చగా మారుతున్నాయి.
