అభివృద్ధి పనులకే ఓట్లేస్తారంటే తప్పులో కాలేసినట్లే..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
అభివృద్ధి చేస్తే ఓట్లు పడతాయని రాజకీయ నాయకులు అనుకుంటే తప్పులో కాలేసినట్లేనని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Political Desk | 8 Aug 2026 11:31 PM ISTఅభివృద్ధి చేస్తే ఓట్లు పడతాయని రాజకీయ నాయకులు అనుకుంటే తప్పులో కాలేసినట్లేనని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో తన అనుభవాన్ని వివరించి ఆశ్చర్యపరిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2009 ఎన్నికల్లో తనకు ఎదురైన ఎన్నికల అనుభవాన్ని ఆయన తాజాగా బయటపెట్టారు. రాజకీయాల్లో గెలుపోటములను నిర్దేశించే అంశాలు ఏంటో తెలుసుకోవాలంటే కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన స్టోరీని తెలుసుకోవాల్సిందేనని అంటున్నారు.
ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీ కేడర్ తో నిర్వహించిన సమావేశంలో రాజకీయాల్లో రాణించాలంటే ఎలా పనిచేయాలన్న అంశంపై తన స్వీయ అనుభవాన్ని వివరించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన ప్రకారం రాజకీయాల్లో కొనసాగాలంటే అభివృద్ధి ఒక్కటే విజయాన్ని తెచ్చిపెట్టదని, నాయకులు వ్యక్తిగత పనితీరు, క్రమశిక్షణ కూడా ముఖ్యమేనని అంటున్నారు. దీనికి ఉదాహరణగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన పీలేరు నియోజకవర్గంలోని మంచాలమంద అనే మారూమూల గ్రామం ఓటర్లు 2009 ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును గుర్తు చేసుకున్నారు.
1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గం పరిధిలోని మంచాలమంద గ్రామానికి ఒక్కసారి కూడా వెళ్లలేదట. దానికి కారణం ఆ గ్రామానికి వెళ్లాంటే 9 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిరావడమే. దీంతో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంతవరకు కిరణ్ కుమార్ రెడ్డి ఆ గ్రామంలో అడుగు పెట్టలేదని చెప్పారు. సుమారు 1200 ఓటర్లు ఉన్న ఆ గ్రామంలో అందరూ అగ్రవర్ణాల వారే ఉండేవారని, ఒక్కరికి పక్కా ఇళ్లు ఉండేవి కావని కూడా చెప్పారు. రోడ్డుతోపాటు ఎలాంటి వసతులు లేని ఆ గ్రామాన్ని 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిరకాలుగా అభివృద్ధి చేశానని, గ్రామానికి తారు రోడ్డు నిర్మించడంతోపాటు 500 ఇళ్లు నిర్మించి అందరికీ పక్కా గృహ వసతి కల్పించానని వివరించారు. అంతేకాకుండా ఆ గ్రామానికి చెందిన వ్యక్తికి ఆ మండలానికి అధ్యక్షుడిగా కూడా ఎంపిక చేశానని తెలిపారు.
ఇలా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసిన తనకు 2009 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ వస్తుందని భావించానని, అయితే ఎన్నికల ఫలితాల తర్వాత దిమ్మదిరిగిపోయే షాక్ తగిలిందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2004 ఎన్నికల్లో 300 ఓట్లు మెజార్టీ ఆ గ్రామంలో వస్తే, అభివృద్ధి పనులు చేసిన తర్వాత 2009 ఎన్నికల్లో మెజార్టీ 30 ఓట్లకు పడిపోయిందని వెల్లడించారు. ఫలితాలు చూసి షాక్ తిన్న తాను ఇలా ఎందుకు జరిగిందని విశ్లేషిస్తే ఊహించని అంశాలు తెలిశాయని చెప్పారు. గ్రామానికి చెందిన తన అనుచరులు అధికారంలో ఉండగా బాగా సంపాదించుకున్నారని, కార్లు, బళ్లు కొనుగోలు చేసి దర్జాగా తిరగడం ప్రారంభించారని, ఇది చూసిన జనాలు ఓటు వేస్తే వారు గొప్పొళ్లుగా చెప్పుకుంటారనే భావనతో తనకు ఓటేయడం మానేశారని వివరించారు.
ఈ అనుభవంతో జనాలను ఆకట్టుకోవాలంటే అభివృద్ధి ఒక్కటే ప్రామాణికం కాదని తనకు తెలిసిందని, వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవడం ముఖ్యమనే విషయం తనకు తెలిసిందని కిరణ్ కుమార్ రెడ్డి విశ్లేషించారు. రాజకీయాల్లో ఎక్కువ కాలం కొనసాగాలంటే దేవుడు అనుగ్రహం ఉండాలని, ఇక్కడ దేవుడు అంటే ఓటరు మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఓటర్లు ఏ విషయంలో ప్రతిస్పందిస్తారో తెలియదని, అందుకే రాజకీయాల్లో ఫార్ములాలు ఉండవని, కష్టపడి పనిచేయడం ఒక్కటే మార్గమని ఆయన కార్యకర్తలకు హితబోధ చేశారు. మొత్తానికి కిరణ్ కుమార్ రెడ్డి స్వీయ అనుభవం రాజకీయాల్లో ఎదగాలనుకునే వారికి ఒక చక్కని పాఠమేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
