Begin typing your search above and press return to search.

కూట‌మి వేరు.. ప్ర‌భుత్వం వేరు: మాజీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పొత్తులు పెట్టుకోవ‌డం, కూట‌మి క‌ట్ట‌డం వంటివి ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌రిమితం కావాల‌న్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల మేలు, రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి పెట్టాల‌న్నారు.

By:  Garuda Media   |   3 Aug 2026 3:55 PM IST
కూట‌మి వేరు.. ప్ర‌భుత్వం వేరు:  మాజీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంపై మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నీటి వివాదాల విష‌యంలో సుతిమెత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇది సరికాద‌న్నారు. ఎక్కడ ఎలా వ్య‌వ‌హ‌రిస్తే.. న్యాయం జ‌రుగుతుందో అలానే వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఈ విష‌యంలో మొహ‌మాటాల‌కు తావులేద‌న్నారు. పొత్తులు పెట్టుకోవ‌డం, కూట‌మి క‌ట్ట‌డం వంటివి ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌రిమితం కావాల‌న్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల మేలు, రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి పెట్టాల‌న్నారు.

నేను గ‌తంలోనే..

రాష్ట్రం విడిపోతే.. నీటి యుద్ధాలు త‌ప్ప‌వ‌ని తాను గ‌తంలోనే చెప్పాన‌ని కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మ‌రోసారి చెప్పు కొచ్చారు. కానీ, ఆ నాడు త‌న మాట‌ను వినిపించుకోలేద‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనే నీటి విభ‌జ‌న చేసి ఉంటే ఇప్పుడు స‌మ‌స్య‌లు ఉండేవి కావ‌ని తెలిపారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య అప్ర‌క‌టిత యుద్ధం లాంటిది జ‌రుగుతోంద‌ని.. ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. నీటి విష‌యంలో ఎవ‌రికి వారు ప‌ట్టుద‌ల‌త పోతే అది రాజ‌కీయంగా కూడా న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

గోదావరి, కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రంపై ఏపీ ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. అయితే.. కూట‌మిలో ఉన్నారు కాబ‌ట్టి.. ఒత్తిడి తీసుకురాలేమ‌ని అనుకుంటే పొర‌పాటేన‌ని చెప్పారు. బీహార్‌లోనూ జేడీయూ పొత్తులోనే ఉంద‌ని.. అయినా అక్క‌డ కావాల్సిన‌వి సాధించుకుంటున్నార‌ని తెలిపారు. అలానే.. ఏపీలో కూట‌మిని ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌రిమితం చేసి.. ప్ర‌స్తుతం ఇదొక ప్ర‌భుత్వం అనేకోణంలో ఆలోచ‌న చేయాల‌ని సూచించారు. ''కూటమిలో పార్టీలు వేరు.. ప్రభుత్వాలు వేరు. రైతుల ప్రయోజనాలు కాపాడటం ఏపీ ప్రభుత్వం బాధ్యత'' అని వ్యాఖ్యానించారు.

గోదావరి, కృష్ణా జలాలపై ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు క‌లిసి కూర్చుని మాట్లాడుకుని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌ని కిర‌ణ్‌కుమార్ రెడ్డి సూచించారు. పోలవరం పూర్తిస్థాయిలో నిర్మించకపోతే విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండదన్నారు. ఈ నేప‌థ్యంలో ఒడిశా, ఛత్తీస్ గఢ్ లో పోలవరం కోసం భూసేకరణ చేయాల్సి ఉందని తెలిపారు. అవ‌స‌ర‌మైతే.. ఏపీ ప్రభుత్వం ఒడిశా, ఛత్తీస్ గఢ్ తో సంప్రదింపులు జ‌ర‌పాల‌ని సూచించారు.

ఒడిశాలో భూసేకరణకు అవసరమైతే ఏపీ ప్ర‌భుత్వం ఎక్కువ పరిహారం ఇవ్వాలని మాజీ సీఎం సూచించారు. కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలకు డబుల్ పంచ్ పడబోతుందని, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యు నల్ అమల్లోకి వస్తే కృష్ణా జలాల్లో ఏపీకి 277 టీఎంసీలు, తెలంగాణకు 97 టీఎంసీల మేర‌కు నష్టం వాటిల్లు తుంద‌ని కిరణ్ కుమార్ చెప్పారు. దీనిపై ఉమ్మ‌డిగా స్పందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. పార్టీల‌ను ప్ర‌భుత్వంగా చూడ‌కూడ‌ద‌ని.. ఆయ‌న రెండు రాష్ట్రాల‌కు సూచించారు.