అనుమతులు తెచ్చింది అశోక్... వైసీపీకి ఝలక్
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విషయంలో టీడీపీ వైసీపీల మధ్య క్రెడిట్ వార్ సాగుతోంది.
By: Satya P | 4 Jan 2026 1:27 PM ISTభోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విషయంలో టీడీపీ వైసీపీల మధ్య క్రెడిట్ వార్ సాగుతోంది. క్రెడిట్ చోరీ చేశారు చంద్రబాబు అని వైసీపీ మాజీ మంత్రులు సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది అంతా జగన్ సీఎం గా ఉండే సమయంలో అని చెబుతున్నారు. జగన్ అనుమతులు అన్నీ తెచ్చారని కోర్టులలో వివాదాలు క్లియర్ చేయించారు అని భూసేకరణ జరిపించి శంకుస్థాపన చేశారు అని వైసీపీ చెబుతోంది. మొత్తం 80 శాతం పైగా వర్క్ అంతా వైసీపీ హయాంలో జరిగింది అని గుర్తు చేస్తోంది. అయితే దాని మీద టీడీపీ కౌంటర్లు వేసింది. బుర్ర ఉన్నవాడు ఎవడూ భోగాపురంలో ఎయిర్ పోర్టు కడతారా అని జగన్ అప్పట్లో విపక్ష నేతగా ఉన్నపుడు ప్రశ్నించిన వీడియోను కూడా మీడియాకు వదిలి ఇదీ మీ విజన్ అని సెటైర్లు వేస్తోంది.
అశోక్ హయాంలోనే :
ఇదిలా ఉంటే భోగాపురం ఎయిర్ పోర్టు మీద కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక కామెంట్స్ చేశారు. ఢిల్లీ నుంచి వాణిజ్య విమానంలో నేరుగా భోగాపురం ఎయిర్ పోర్టులో దిగి ట్రయల్ రన్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ ఇండియా సహకారంతో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ కావడం గర్వకారణం అన్నారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌లో తొలి ఫ్లైట్ దిగడం చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. అంతే కాదు భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి 2016లోనే అప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రి అశోక్ గజపతి రాజు అనుమతులు తెచ్చారని గుర్తు చేశారు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత 18 నెలలుగా నిరంతర సమీక్షలతో ప్రాజెక్టును వేగవంతం చేశామని ఆయన చెప్పారు.
ఆరు నెలలు ముందుగా :
ఇక ఈ ఏడాది డిసెంబర్ కి పూర్తి అవుతుంది అని లక్ష్యంగా పెట్టుకున్న పనులను ఆరు నెలలు ముందుగానే పూర్తి చేస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పడం విశేషం. ఈ ప్రాజెక్టులో ఎల్అండ్టి జిఎంఆర్ డీజీసీఏ అధికారులు కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. అలాగే భూములు త్యాగం చేసిన స్థానిక రైతాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా కేంద్ర మంత్రి చెబుతూ వారి సహకారం మరువలేనిది అన్నారు.
వరల్డ్ క్లాస్ ఏవియేషన్ హబ్‌గా :
భోగాపురం వరల్డ్ క్లాస్ ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చెందనుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై వచ్చిన విమర్శలకు భోగాపురమే సమాధానంగా ఉందని ఆయన అన్నారు. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల దిశ దశ ఈ విమానాశ్రయంతో పూర్తిగా మారనున్నాయని జోస్యం చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌తో టూరిజం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. విశాఖ రీజియన్ రోజురోజుకీ ఆర్థికంగా బలోపేతం అవుతుందని ఆయన అన్నారు.
మోడీ చేతుల మీదుగా :
ఇక భోగాపురం ఎయిర్ పోర్టు మరో నాలుగైదు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభం అవుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. అన్ని సాంకేతిక, నియంత్రణ ప్రక్రియలు పూర్తయ్యాయని, ఫ్లైట్ ల్యాండ్ కావడం అంటే ఎయిర్‌పోర్ట్ పనులు దాదాపు పూర్తైనట్టే అని ఆయన స్పష్టం చేశారు. ఒడిశా, రాయపూర్ ప్రాంతాల ప్రజలకు కూడా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉపయోగపడనుందని అన్నారు. అలాగే అన్ని ప్రాంతాలకు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇక భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాందిగా మారిందని ఆయన చెప్పారు, స్థానిక యువతకు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని కేంద్ర మంత్రి చెప్పడం విశేషం.
