ఎన్టీఆర్ నుంచి ఏం నేర్చుకున్నారు జగన్.. !
ఎందుకంటే.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆయనకు కేవలం మంత్రి మాత్రమే. కానీ, మనకు వచ్చే సరికి.. మన తెలుగు బిడ్డ, కేంద్రంలో చక్రం తిప్పుతున్న యువకిశోరం.
By: Garuda Media | 9 Dec 2025 10:17 PM ISTమన తెలుగు వాడు పైగా యువకుడు.. కేంద్రంలో బలమైన గళం వినిపిస్తున్న నాయకుడు.. కింజరాపు రామ్మోహన్ నాయుడు. పార్టీల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయం ఏ విధంగా ఉన్నా.. ప్రస్తుతం నెలకొన్న ఇండిగో సంక్షోభ సమయంలో ఆయనకు తెలుగు నేలంతా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆయనకు కేవలం మంత్రి మాత్రమే. కానీ, మనకు వచ్చే సరికి.. మన తెలుగు బిడ్డ, కేంద్రంలో చక్రం తిప్పుతున్న యువకిశోరం.
సో.. ఢిల్లీలో తెలుగు వారి పరువును కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క తెలుగు వ్యక్తిపైనా.. ప్రతి రాజకీయ పార్టీ, నేతలపైనా ఉంది. కరడు గట్టిన బద్ధ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అయినప్పటికీ.. అన్నగారు ఎన్టీఆర్.. ప్రధాన మంత్రి పదవికి తెలుగు వాడైన పీవీనరసింహారావును ఎంపిక చేసినప్పుడు.. ఆయన నంద్యాల నుంచి పోటీ చేస్తానంటే.. ఎన్టీఆర్.. అసలు పోటీనే పెట్టనని బహిరంగ ప్రకటన చేసిన నేల ఇది!. ఎందుకు? ఢిల్లీలో తెలుగు గళం వినిపించాలని కదా!.
మరి తెల్లారి లేస్తే.. ఎన్టీఆర్ జపం చేస్తూ.. తన పార్టీ నాయకుడు కాకున్నా.. ఆయనను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే వైసీపీ అధినేత జగన్.. ప్రస్తుత ఇండిగో క్లిష్ట సమయంలో మన తెలుగు వాడిగా.. పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్‌నాయుడును.. ఇలానా.. అవమానించేది? ఈ విధంగా ట్రోల్ చేస్తారా? ఎవరో ఏదో ఉత్తరాది టీవీలో యాంకర్ గోస్వామి ఏదో అన్నాడని.. దానిని ట్రోల్ చేసి.. పబ్బంగడుపుకోవడమేనా? రాజకీయం అంటే!.
క్లిష్ట సమయంలో మేమంతా ఒక్కటే అంటూ.. రామ్మోహన్‌ను బలపరచకపోయినా.. ఫర్వాలేదు. కానీ, ఆయ న ఆత్మస్థయిర్యాన్ని ఇలా దెబ్బతీయడం.. ఈ విధంగా ట్రోల్ చేయడం సరైన చర్యేనా? పోనీ.. ఇప్పటి కిప్పుడు రామ్మోహన్ డైల్యూట్ అయిపోయినా.. వైసీపీ కోరుతున్నట్టు ఆయన రాజీనామా చేసేసినా.. వైసీపీ కి ఒరిగే లబ్ధి ఏంటి? ఇది సరైన చర్య కాదని.. నలుగురూ నవ్వుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా యువకుడు, కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. ఇది తెలుగు వారికి గర్వకారణం. కనీసం తెలంగాణ ప్రజలకు, అక్కడి పాలక , విపక్షానికి ఉన్న విజ్ఞత కూడా మనకు లేకపోతే ఎలా.. ?
