ఆయనకు రెండు పదవులు...బొత్సనే టార్గెట్ !
విజయనగరం జిల్లా రాజకీయాలను తెలుగుదేశం అధినాయకత్వం నేరుగా పరిశీలిస్తోంది అని అంటున్నారు.
By: Satya P | 25 Dec 2025 9:16 AM ISTవిజయనగరం జిల్లా రాజకీయాలను తెలుగుదేశం అధినాయకత్వం నేరుగా పరిశీలిస్తోంది అని అంటున్నారు. దశాబ్దాల తరబడి పూసపాటి రాజుల కంట్రోల్ లో టీడీపీ రాజకీయాలు నడిచేవి. కోటలోనే అన్ని నిర్ణయాలు తీసుకునేవారు. అలా అశోక్ గజపతిరాజు శాసించారు. ఆయన గోవా గవర్నర్ పదవిని స్వీకరించారు. ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా విజయనగరం నుంచి ఉన్నారు. దాంతో జిల్లా రాజకీయాలను టీడీపీ హైకమాండ్ క్లోజ్ గా పరిశీలిస్తూ వస్తోంది. అదే సమయంలో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గాన్ని బీసీలను ప్రోత్సహిస్తూ వైసీపీ పట్టుని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో యువకుడు అయిన కిమిడి నాగార్జునకు మరోసారి విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠం దక్కింది.
డీసీసీబీ చైర్మన్ గా :
ఇప్పటికే ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. దాంతో ఆయన ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇస్తారని అంతా అనుకున్నారు. ఈ కీలక పదవి కోసం ఎక్కువ మంది పోటీ పడ్డారు కూడా. పార్టీ అధికారంలో ఉండడంతో జిల్లా కిరీటం దక్కితే చాలు వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ అని ఈలోగా అధికార పార్టీలో కీలకంగా వ్యవహరించవచ్చు అని ఎంతో మంది నేతలు ఆశపడ్డారు. కానీ చివరికి కిమిడి నాగార్జుననే ఈ పదవి వరించడంతో వారంతా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే నాగార్జునలో ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన దూకుడుగా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. ఇంకా చెప్పాలీ అంటే జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణనే ఢీ కొడుతున్నారు.
చీపురుపల్లి నుంచే :
ఇక ఆయన్ 2019లో తొలిసారి చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స చేతిలో ఓటమి పాలు అయినా బాగానే ఓట్లు సాధించారు. అంతే కాదు 2024 ఎన్నికల నాటికి పార్టీని అక్కడ పటిష్టం చేశారు తాను పోటీ చేద్దామని చూసేలోగా పెదనాన్న కిమిడి కళా వెంకటరావుకు టికెట్ ఇచ్చారు. అధినాయకత్వం నిర్ణయం ప్రకారం గెలుపునకు సహకరించారు. దాని ఫలితంగా డీసీసీబీ చైర్మన్ పదవి దక్కింది. ఇక 2029 లో కచ్చితంగా నాగార్జున పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్ కి గెలిచి వస్తారని కూడా పార్టీ నమ్ముతోంది.
భారీ టార్గెట్ తోనే :
జిల్లాలో సామాజిక వర్గం పరంగా బొత్సని ఎదుర్కోవాలంటే యువకుడు అయిన నాగార్జునే బెటర్ అని ఎంచి మరీ ఆయనను జిల్లా సారదిగా టీడీపీ చేసింది అని అంటున్నారు. విజయనగరం జిల్లాలో మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లు అలాగే ఎంపీ సీటుని గెలిపించాల్సిన బాధ్యతను ఆయన మీద పెట్టారు. ఇక తూర్పు కాపులు గతంలో వైసీపీ వైపు ఎక్కువగా ఉండేవారు, ఇపుడు జనసేనతో పొత్తు ఉంది. టీడీపీ సైతం ఆ సామాజిక వర్గానికి పదవులు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. దాంతో ఈ జిల్లాలో వైసీపీకి బ్రేకులు వేసి తాము మళ్ళీ గెలిచేందుకు తగిన వ్యూహాలను అనుసరించడం కోసమే నాగార్జునను నియమించారు అని అంటున్నారు. అందుకే ఆయనకు రెండు పదవులు ఇచ్చారని అంటున్నారు.
