Begin typing your search above and press return to search.

బొత్స Vs నాగార్జున... పసుపుదళం సీనియర్లు అంతా గప్ చుప్!

ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స, టీడీపీ యువనేత, విజయనగరం డీసీసీబీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మధ్య పొలిటికల్ ఫైట్ ఆసక్తి రేపుతోంది.

By:  Tupaki Political Desk   |   11 Oct 2025 2:00 PM IST
బొత్స Vs నాగార్జున... పసుపుదళం సీనియర్లు అంతా గప్ చుప్!
X

ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స, టీడీపీ యువనేత, విజయనగరం డీసీసీబీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మధ్య పొలిటికల్ ఫైట్ ఆసక్తి రేపుతోంది. 2019 ఎన్నికల్లో బొత్సతో చీపురుపల్లి అసెంబ్లీ స్థానంలో తలపడిన నాగార్జున ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో తీవ్రపోరాటం చేశారు. 2024లో మరోసారి పోటీకి ఆయనకు అవకాశం దక్కపోయినా, పార్టీకి చేసిన సేవలకు గాను నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. అయితే అనూహ్యంగా విజయనగరం అమ్మవారి పండుగ సందర్భంగా నాగార్జున తీసుకున్న ఓ కీలక నిర్ణయం రాజకీయంగా సంచలనం రేపింది. సీనియర్ నేత బొత్సకు చెక్ చెప్పిన నాగార్జున రాష్ట్రవ్యాప్తంగా హాట్ డిబేట్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. అయితే విజయనగరం జిల్లాలో మాత్రం టీడీపీ సీనియర్లు, ఇతర నేతల నుంచి ఆయనకు సరైన మద్దతు లభించలేదన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విజయనగరం అమ్మవారి ఉత్సవాలు సందర్భంగా పట్టణంలోని డీసీసీబీ బ్యాంకుపైన తన కుటుంబం కోసం వేదిక ఏర్పాటు చేసుకుంటున్న బొత్సకు ఈ ఏడాది అవకాశం దక్కలేదు. డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున నిర్ణయంతో బొత్స వేరే వేదికకు మారాల్సివచ్చింది. దీంతో సీనియర్ నేత తీవ్ర అసహనానికి గురయ్యారు. పండుగ ముందు, ఆ తర్వాత కూడా మీడియాతో మాట్లాడిన బొత్స తన అసహనాన్ని దాచుకోలేకపోయారు. చివరికి వేదిక మార్పు తనకు ప్రాణాలకే ముప్పుగా పరిణమించిందని ఆయన చెప్పుకోవడం పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు. చూడటానికి చిన్న విషయమే అయినా నాగార్జున వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం బొత్సను రాజకీయంగా దెబ్బకొట్టినట్లే అంటున్నారు. అందుకే తనకు అవమానం జరిగిందన్నట్లు భావిస్తూ ప్రభుత్వంపై మాటల దాడికి సిద్దమయ్యారు అంటున్నారు. ప్రతిపక్ష నేత అయిన తనకు జిల్లా అధికారులు సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు.

ఈ విషయంలో బొత్సకు మద్దతుగా ఆ పార్టీ మొత్తం ఏకమై డీసీసీబీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున టార్గెట్ గా మాటల యుద్ధం కొనసాగించింది. పండుగకు ముందు, తర్వాత కూడా నాగార్జున వల్లే తమ నేతకు అవమానం జరిగిందని ప్రచారం చేస్తోంది. అయితే ప్రత్యర్థులు ఏకమై తనపై దాడి చేస్తున్నా, నాగార్జున ఎంతో అనుభవం ఉన్నట్లు స్పందిస్తున్న తీరు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాగార్జునపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నా పార్టీలో ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం ఏంటని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

బొత్స తరఫున జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతోపాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం మాట్లాడుతూ తమ నేతకు అవమానించారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది. అయితే ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో టీడీపీ, జనసేన నుంచి ఎవరూ మాట్లాడకపోవడం చర్చకు దారితీస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిని ప్రతిపక్షం టార్గెట్ చేసినా, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మాట్లాడకపోవడానికి కారణం ఏమైవుంటుందని కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. తాము ఈ విషయంలో జోక్యం చేసుకుని నాగార్జునకు మరింత హైప్ పెంచడం అవసరమా? అన్న ఆలోచనతో నేతలు ఎవరూ పెదవి విప్పడం లేదని టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ఒక సారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాగార్జున రాజకీయంగా జూనియర్, ఇప్పటివరకు రాజకీయంగా ఎలాంటి పదవులు పొందలేదు. కానీ, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఐదేళ్లు పనిచేశారు. అందరితో చక్కని సమన్వయంతో పార్టీని నడిపించారన్న గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలకమైన డీసీసీబీ పగ్గాలు ఆయనకు అప్పగించింది. కానీ ఆయన నాయకత్వాన్ని సమర్థతను గుర్తించేందుకు జిల్లా నేతలకు మనసు రావడం లేదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒకవైపు బొత్స అండ్ కో ప్రభుత్వంపైన పార్టీ జిల్లా అధ్యక్షుడిపైన విమర్శలు గుప్పిస్తుంటే మూకుమ్మడిగా ఎదురుదాడి చేయాల్సిన టీడీపీ నేతలు సైలెంట్ గా ఉండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో బొత్స అడ్వాంటేజ్ తీసుకోడానికి చురుకుగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. టీడీపీ నేతలు ఎవరూ మాట్లాడకపోవడం వల్ల తనను అవమానించేందుకు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని బొత్స చెప్పుకుంటున్నారు. అదే సమయంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును వ్యూహాత్మకంగా మధ్యలోకి లాగుతున్నారని అంటున్నారు. గవర్నర్ హోదాలో ఉన్న అశోక్ ఎలాగూ తన విమర్శలపై స్పందించే పరిస్థితి లేనందున ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేలా బొత్స ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.