Begin typing your search above and press return to search.

కళాకు అదిరిపోయే చాన్స్...దక్కితే ధన్యమైనట్లే ?

ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ మంత్రి, ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కిమిడి కళా వెంకటరావుకు ఒక అద్భుతమైన అవకాశం దక్కనుంది అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

By:  Satya P   |   3 April 2026 2:00 PM IST
కళాకు అదిరిపోయే చాన్స్...దక్కితే ధన్యమైనట్లే ?
X

ఉత్తరాంధ్రాకు చెందిన సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ మంత్రి, ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కిమిడి కళా వెంకటరావుకు ఒక అద్భుతమైన అవకాశం దక్కనుంది అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కళా ఈనాటి వారు కారు, టీడీపీలో 1983లో ఎన్టీఆర్ ద్వారా టికెట్ తీసుకుని గెలిచిన తొలి తరం ఎమ్మెల్యే. అదే ఎన్టీఆర్ హయాంలో ఎన్నో కీలక శాఖలకు ప్రత్యేకించి హోం శాఖ వంటి శాఖను చేపట్టిన వారు. చంద్రబాబు హయాంలోనూ మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ మెంబర్ కూడా పనిచేశారు. ఇక 2024 లో విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చివరి నిముషంలో షిఫ్ట్ అయి కూడా భారీ మెజారిటీతో గెలిచారు కళా వెంకటరావు.

మంత్రి పదవి కోసం :

ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అంతా అనుకున్నారు. ఆయన సైతం ఇదే తనకు చివరి అవకాశం అని కూడా భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయనకు మరో కీలకమైన పదవి దక్కబోతోంది అని ప్రచారం సాగుతోంది. ఆ పదవే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అని అంటున్నారు ఈ పదవి గతంలో కళా ఒకసారి చేసి ఉన్నారు. అయినా కానీ ఇది అత్యంత పవిత్రమైన పోస్టు, ఎంతో ఉన్నతమైన పోస్టు. ఆయన మంత్రి పదవి తనకు దక్కకపోతే టీటీడీ చైర్మన్ పదవి అయినా ఇస్తారని 2024 సమయంలోనే ఆశ పెట్టుకున్నారు. కానీ ఆనాడు దక్కని భాగ్యం ఈనాడు లభిస్తోంది అని అంటున్నారు.

ఇంకా ఏడు నెలల సమయం :

ఇదిలా ఉంటే టీటీడీకి ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న బీ ఆర్ నాయుడు పదవీ కాలం ఇంకా ఏడు నెలలు పైగా ఉంది. ఆయన్ 2024 నవంబర్ 6న తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు 54వ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎం.ఎస్. రాజు వంటి సభ్యులతో కూడిన 24 మంది సభ్యుల కొత్త పాలకవర్గం కూడా బాధ్యతలు స్వీకరించింది. దాంతో ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే కళాకు ఈ చాన్స్ దక్కవచ్చు అని అంటున్నారు. లేదా కాస్తా ముందుగానే టీటీడీకి కొత్త కార్యవర్గాన్ని నియమించాలన్న ఆలోచన కూడా కూటమి ప్రభుత్వానికి ఉంది అని అంటున్నారు.

మంత్రి వర్గ విస్తరణ :

ఇక ఏపీ మంత్రి వర్గ విస్తరణ ఈ ఏడాది జూన్ 12 తరువాత జరగవచ్చు అని ప్రచారం మరో వైపు సాగుతోంది దానికి కారణం అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్ళు పూర్తి అవుతుంది. ఈ రెండేళ్ళలో మంత్రుల పనితీరుని బేరీజు వేసుకుని కొందరిని పక్కన పెట్టి కొత్త వారికి చాన్స్ ఇవ్వడం సామాజిక ప్రాంతీయ రాజకీయ సమీకరణలను కూడా పరిగణలోకి తీసుకుని మార్పుచేర్పులు చేయడం అన్నది కూటమి వ్యూహంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మంత్రి వర్గంలో మార్పులు చేస్తే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చు అన్నది కూటమి పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది అని అంటున్నారు.

పదవి ఖాయమైందని :

సో మంత్రులుగా ఎవరికైనా చాన్స్ ఇవ్వలేని పక్షంలో ముందుగానే వారికి కీలక పదవులు వేరేవి కట్టబెట్టాలని చూస్తున్నారని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే కళా వెంకటరావుకు టీటీడీ చైర్మన్ పదవి ఖాయమైందని అది వీలైనంత తొందరలోనే దక్కనుందని అంటున్నారు. దీంతో ఆయన వర్గీయులలో ఆనందం అయితే వ్యక్తం అవుతోంది. దేవదేవుని సన్నిధిలో ఉంటూ ఈ పదవి నిర్వహించడం అంటే మహద్భాగ్యంగా అంతా భావిస్తారు. దాంతో కళాకు ఈ చాన్స్ దక్కితే అంతకంటే గొప్పది వేరేది ఉండదని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో ఏమో.