Begin typing your search above and press return to search.

ట్రంప్ ప్రేమలేఖను కనీసం కవర్ కూడా చించకుండా వెనక్కి పంపిన కిమ్

డొనాల్డ్ ట్రంప్ పంపిన లేఖను ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తెరవకుండానే వెనక్కి పంపినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. గత ఏడాది నుంచి కిమ్‌తో సంప్రదింపులకు ట్రంప్ ప్రయత్నిస్తున్నా స్పందన లేదని తెలిపింది. అణ్వస్త్ర దేశంగా గుర్తించాలన్న కిమ్ డిమాండ్ ఇరుదేశాల మధ్య చర్చలకు అడ్డంకిగా మారినట్లు సమాచారం.

By:  A.N.Kumar   |   23 Nov 2026 1:40 PM IST
ట్రంప్ ప్రేమలేఖను కనీసం కవర్ కూడా చించకుండా వెనక్కి పంపిన కిమ్
X

ప్రపంచ దేశాల అధ్యక్షులందరినీ తన చిటికెన వేలితో ఆడిస్తానని గొప్పలు చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఒకప్పుడు ఇద్దరూ కలిసి లవ్ లెటర్స్ రాసుకున్నామని ట్రంప్ మురిసిపోతే ఇప్పుడు ఏకంగా ట్రంప్ పంపిన లేఖను కనీసం కవర్ కూడా తెరవకుండానే ప్యాంగ్యాంగ్ వెనక్కి పంపేసిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. అంతర్జాతీయ దౌత్యంలో ఇదో వింతైన.. ఆసక్తికరమైన మలుపుగా మారింది.

గత ఏడాది కాలంగా వాషింగ్టన్, ప్యాంగ్యాంగ్ మధ్య ఉన్న అన్ని రకాల అధికారిక.. అనధికారిక మార్గాల ద్వారా ట్రంప్ బృందం కిమ్‌ను సంప్రదించడానికి తీవ్రంగా ప్రయత్నించిందని డబ్ల్యూఎస్‌జే నివేదిక పేర్కొంది. అయితే అటువైపు నుంచి కనీసం హలో అనే మాట కూడా వినిపించలేదు. దీంతో విసుగెత్తిన ట్రంప్.. పాత స్నేహం గుర్తుచేస్తూ స్వయంగా ఒక లేఖ రాసి ఉత్తర కొరియా ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తకు అందించారు. కానీ ఆ లేఖను చదవడం అటుంచి.. కనీసం కవర్ చింపడానికి కూడా కిమ్ ఆసక్తి చూపకుండా రిటర్న్ టు సెండర్ అన్నట్లుగా వెనక్కి పంపేశారట.

ఇటీవల ఆసియా పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో వరుస భేటీలు జరిపిన ట్రంప్.. కిమ్‌ను కూడా కలిసి ఫోటోలకు పోజులివ్వాలని ఆశపడ్డారు. కానీ కిమ్ వైపు నుంచి వచ్చిన షరతులు వైట్‌హౌస్‌కు మింగుడుపడలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర కొరియాను ఒక చట్టబద్ధమైన అణ్వస్త్ర దేశంగా అమెరికా అధికారికంగా గుర్తించాలన్నది కిమ్ ప్రధాన డిమాండ్. గతంలో సింగపూర్, వియత్నాం, డీఎంజెడ్‌లలో జరిగిన మూడు భేటీల్లో అణ్వాయుధాల తగ్గింపుపై అమెరికా పట్టుబట్టగా ఇప్పుడు ఆ ప్రసక్తే లేదని ప్యాంగ్యాంగ్ స్పష్టం చేస్తోంది.

2019లో ట్రంప్‌తో చివరిసారిగా కరచాలనం చేసినప్పటి నుంచి కిమ్ తన అమ్ములపొదిని గణనీయంగా పెంచుకున్నట్లు అంతర్జాతీయ రక్షణ నిపుణుల అంచనాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఆంక్షల భయంతో చర్చల టేబుల్ వద్దకు వచ్చిన కిమ్.. ఇప్పుడు 60 అణు వార్‌హెడ్లు, అమెరికా భూభాగాన్ని చేరుకోగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అండతో ఇప్పుడు నాతో మాట్లాడాలంటే నా రూల్స్ ఒప్పుకోవాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

ప్రపంచ నేతలందరినీ తన దారికి తెచ్చుకుంటానని భావించే ట్రంప్ దౌత్యానికి.. కిమ్ ప్రదర్శిస్తున్న ఈ మౌనవ్రతం పెద్ద పరీక్షగా మారింది. ఒకప్పుడు చరిత్రాత్మక కరచాలనాలతో వార్తల్లో నిలిచిన ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు కనీసం ఉత్తరాలు కూడా మార్చుకోలేని స్థితికి చేరడం అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.