ఉత్తర కొరియాతో రష్యా జట్టు.. బంధం బలోపేతం
ఉత్తర కొరియా, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మునుపెన్నడూ లేని రీతిలో మరింత బలపడుతున్నాయి.
By: A.N.Kumar | 16 Aug 2026 11:24 PM ISTఉత్తర కొరియా, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మునుపెన్నడూ లేని రీతిలో మరింత బలపడుతున్నాయి. రష్యాతో తమ దేశానికి ఉన్న బలమైన మిత్రత్వాన్ని పునరుద్ఘాటిస్తూ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన, విశ్వసనీయమైన మిత్రదేశమని స్పష్టం చేసిన కిమ్.. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం పట్ల తీవ్ర గర్వాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఒక ప్రత్యేక లేఖను రాశారు.
పుతిన్ సమర్థవంతమైన నాయకత్వంలో రష్యా అన్ని రంగాల్లోనూ అద్భుతమైన పురోగతిని సాధిస్తోందని కిమ్ కొనియాడారు. పాశ్చాత్య దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ తన జాతీయ ప్రయోజనాలను.. దేశ సమగ్రతను కాపాడుకోవడంలో రష్యా చూపుతున్న ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహబంధం రాబోయే రోజుల్లో మరింత విస్తరించి, బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందాలని ఆయన ఆకాంక్షించారు.
ఉక్రెయిన్ యుద్ధం.. సైనిక సహకారం
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్యాంగ్యాంగ్, మాస్కోలను మరింత దగ్గర చేసింది. రష్యాకు ఉత్తర కొరియా పూర్తి స్థాయిలో సైనిక, దౌత్య మద్దతును అందిస్తోంది. రష్యా బలగాల కోసం ఉత్తర కొరియా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేయడంతో పాటు, సైనిక సహాయాన్ని కూడా అందిస్తున్నట్లు అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. దీనికి ప్రతిఫలంగా, రష్యా నుంచి ఉత్తర కొరియాకు అధునాతన సైనిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సహాయం, నిత్యావసరాల మద్దతు లభిస్తున్నట్లు తెలుస్తోంది.
పాశ్చాత్య దేశాలకు వ్యూహాత్మక సవాలు
అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల ఆంక్షలతో అంతర్జాతీయంగా కొంతవరకు ఒంటరిగా మారిన ఉత్తర కొరియాకు మాస్కోతో బంధం అత్యంత కీలకంగా మారింది. అలాగే ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాకు ప్యాంగ్యాంగ్ సహకారం వ్యూహాత్మకంగా ఎంతో ప్రయోజనకరంగా మారింది. గతంలో ఇరు దేశాలు కుదుర్చుకున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కూడా వీరి బంధ తీవ్రతను స్పష్టం చేస్తోంది.
కిమ్ జోంగ్ ఉన్ తాజా ప్రకటనలు ఇరు దేశాల మధ్య బంధం కేవలం తాత్కాలిక అవసరం కాదని, సుదీర్ఘకాలం కొనసాగే ఒక బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యమని స్పష్టం చేస్తున్నాయి. రానున్న కాలంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో.. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఈ రష్యా-ఉత్తర కొరియా అక్షం మరింత కీలక పాత్ర పోషించనుంది.
