కిమ్ జోంగ్ ఉన్ 2.0... ఉ.కొరియా కొత్త వారసురాలు ఈమె!
ఈ సందర్భంగా ఈ కొత్త నిర్ణయం.. కిమ్ కుటుంబ రాజవంశం నాల్గవ తరానికి విస్తరించే అవకాశాన్ని స్పష్టంగా సూచిస్తుందని అంటున్నారు.
By: Raja Ch | 12 Feb 2026 6:14 PM ISTఉత్తర కొరియా నాయకుడు (నియంత) కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రపంచానికి పెద్దగా పరిచయం అవసరం లేదనే సంగతి తెలిసిందే! తనదైన శైలిలో ఉత్తర కొరియాను పరిపాలిస్తూ.. తనదైన శైలిలో ప్రపంచాన్ని టెన్షన్ పెడుతూ.. ప్రధానంగా దక్షిణ కొరియాకు అప్పుడప్పుడూ కలలోకి సైతం వస్తాడనే పేరున్న కిమ్.. తాజాగా తన తర్వాత ఎవరు అనే ప్రశ్నకు సమాధానాన్ని కనుగొన్నారని.. ఈ సందర్భంగా తన టీనేజ్ కుమార్తెను వారసురాలిగా నియమిస్తున్నారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... ఉత్తర కొరియా నాయకుడు జిమ్ జోంగ్ ఉన్ తన టీనేజ్ కుమార్తె ‘కిమ్ జు ఏ’ ను వారసురాలిగా ఎంపిక చేసుకున్నారని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్.ఐ.ఎస్) గురువారం చట్టసభ సభ్యులకు తెలిపింది. ఈ సందర్భంగా ఈ కొత్త నిర్ణయం.. కిమ్ కుటుంబ రాజవంశం నాల్గవ తరానికి విస్తరించే అవకాశాన్ని స్పష్టంగా సూచిస్తుందని అంటున్నారు. దీంతో.. కిమ్ జు ఏ గురించిన చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది.
వాస్తవానికి ఈ నెల చివర్లో ఉతర కొరియాలో వర్కర్స్ పార్టీ ప్రధాన కాంగ్రెస్ సమావేశం జరగనుంది. ఉత్తర కొరియాలో ప్రతీ ఐదు సంవత్సరాలకు జరిగే అత్యంత కీలక సమావేశంగా దీన్ని పరిగణిస్తారు! ఈ సమయంలో రాబోయే ఐదు సంవత్సరాలకు సంబంధించిన కీలక విధాన లక్ష్యాలను ఈ సందర్భంగా కిమ్ వివరిస్తారు. అయితే.. ఈ కార్యక్రమానికి ఆమె హాజరైతే.. ఈ విషయంపై ఆల్ మోస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసినట్లేనని.. ఈ విషయాన్ని తాము నిశితంగా పరిశీలుస్తామని ఎన్.ఐ.ఎస్. చెబుతోంది.
కాగా... కిమ్ జు ఏ మొదటిసారిగా బయట ప్రపంచానికి కనిపించింది 2022లో అని చెబుతారు. ఆ ఏడాది నవంబర్ లో లాంగ్-రేంజ్ క్షిపణి పరీక్ష సమయంలో ఆమె బహిరంగంగా కనిపించిందని.. అప్పటి నుంచి ఆమె తండ్రితో కలిసి ఆయుధ ప్రయోగాలు, సైనిక కవాతులు, ఫ్యాక్టరీ సందర్శనల్లో పాల్గొంటుందని అంటున్నారు. ఇదే క్రమంలో.. గత ఏడాది సెప్టెంబర్ లో చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ తో బీజింగ్ వేదికగా జరిగిన శిఖరాగ్ర సమావేశానికీ హాజరయ్యారు!
ఇదే క్రమంలో... ఈ ఏడాది జనవరిలోనూ కిమ్ ఇల్ సంగ్, కిమ్ జోంగ్ ఇల్ ల సమాధి అయిన కుంసున్సన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ వద్ద తన తల్లితండ్రులతో కలిసి ఆమె నివాళులర్పించింది. దీంతో.. ఆమెను ‘ప్రియమైన వ్యక్తి, దేశానికి మార్గదర్శకత్వం వహించే గొప్ప శక్తి’ అని ఆ దేశ ప్రభుత్వ మీడియా కొనియాడిన పరిస్థితి. సాధారణంగా ఆ దేశ అగ్ర నాయకులు, వారి వారసుల విషయంలోనే ఇలాంటి పద ప్రయోగాలు చేస్తారని అంటున్నారు!
ఇక... 1948లో స్థాపించబడినప్పటి నుంచీ ఉత్తర కొరియాను కిమ్ కుటుంబంలోని పురుషులు మాత్రమే పాలిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా.. ఆ వంశం నుంచి తొలుత కిమ్ ఇల్ సంగ్.. ఆ తర్వాత కిమ్ జోంగ్ ఇల్.. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ పాలిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆమె నియామకం ధృవీకరించబడితే మాత్రం ఈ కీలక రాజ్యంలో ఆమె నాయకత్వం చారిత్రాత్మక మార్పును సూచిస్తుందనే చెప్పాలి.
