Begin typing your search above and press return to search.

కిలారి నాట్ హ్యాపీ...జగన్ ఏమంటారో ?

వైసీపీ తరఫున పదవులు అందుకున్న వారు అంతా 2024 ఎన్నికల తరువాత పెద్ద హ్యాండ్ ఇచ్చారు. రాజకీయాలు ఇంతేనని తేల్చి చెప్పినట్లుగా ఈ చర్యలు ఉన్నాయి.

By:  Satya P   |   9 Dec 2025 9:11 AM IST
కిలారి నాట్ హ్యాపీ...జగన్ ఏమంటారో ?
X

వైసీపీ తరఫున పదవులు అందుకున్న వారు అంతా 2024 ఎన్నికల తరువాత పెద్ద హ్యాండ్ ఇచ్చారు. రాజకీయాలు ఇంతేనని తేల్చి చెప్పినట్లుగా ఈ చర్యలు ఉన్నాయి. జగన్ తన వెంట ఉన్నారని భావించి అధికారంలో ఉన్నపుడు ఎందరికో పదవులు కట్టబెట్టారు. అలాగే సామాజిక సమీకరణలు చూసి మరీ అందలాలు ఎక్కించారు. చాలా మందికి చట్టసభలలో ప్రవేశం అన్నది ఒక కలగా ఉంటే దానిని తీర్చారు. అనూహ్యంగా మంత్రులు అయిన వారు రాజ్యసభ మెట్లెక్కిన వారూ ఉన్నారు లోక్ సభలో వెలిగిన వారూ ఉన్నారు. అయితే వైసీపీకి దక్కిన భారీ ఓటమి ముందు ఇవేమీ పనిచేయలేదు. జగన్ నీడ నుంచి తొందరగానే బయటపడ్డారు. అలాంటి వారికి కూటమిలో చోటు అయితే దక్కింది కానీ అక్కడ వారికి సంతోషం అయితే చిక్కడం లేదు అని అంటున్నారు.

కిలారి తీరుతో :

సీనియర్ నేత గుంటూరు జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టీడీపీలో రాజ్యసభకు వెళ్ళి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఆయన బలమైన సామాజిక వర్గం దన్నుతో పాటు నిబద్ధతతో చేసిన రాజకీయం మూలంగా ఈ పదవులు దక్కాయి. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరారు జగన్ ఆయనను ఎమ్మెల్సీగా చేసి ప్రతిపక్ష నాయకుడిగా కూడా నియమించి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించారు. ఆయన అల్లుడుగా కిలారి రోశయ్య వైసీపీలో చేరి 2019లో పొన్నూరు నుంచి ఘన విజయం సాధించారు. ఆయన ఓడించినది కూడా బిగ్ షాట్ నే. అప్పటికి అయిదు సార్లు గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రను. అలా గ్రేట్ అనిపించుకున్న కిలారి రోశయ్య అయిదేళ్ళ పాటు పార్టీలో ఉంటూ అధికారంలో భాగం అయ్యారు. కానీ 2024 లో ఓటమి తరువాతనే ఆయనలో మార్పు కనిపించింది. ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. దానికి ప్రజారాజ్యం పూర్వం బంధాలు కూడా కారణం అని అంటున్నారు.

జంప్ చేసినా :

అయితే చిత్రమేంటి అంటే ఎమ్మెల్యేగా వైసీపీలో ఉంటూ తన హవా చాటుకున్న కిలారి రోశయ్యకు జనసేనలో అంతటి గౌరవం కానీ ప్రాధాన్యత కానీ దక్కడం లేదని అంటున్నారు. అంతవరకూ ఎందుకు ఆయన మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉన్న నాయకుడు. అలాంటి నేతకు పొన్నూరు జనసేన ఇంచార్జి బాధ్యతలు కూడా అప్పగించలేదని గుర్తు చేస్తున్నారు. ఇక జనసేన పాత కాపులు అంతా ఆయనను దూరం పెడుతున్నారని కావాలనే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు. ఇక టీడీపీ సంగతి సరే సరి. అక్కడ నరేంద్ర హవా పీక్స్ లో ఉంటుంది అని చెబుతారు. మొత్తానికి చూస్తే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా రోశయ్యకు దక్కాల్సిన గౌరవం అయితే జనసేనలో కానీ కూటమిలో కానీ లభించడం లేదని అంటున్నారు. ఇదే విషయాన్ని ఈ మధ్యనే మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు వీడియో రిలీజ్ చేసి మరీ చెప్పడమూ జరిగింది.

వైసీపీలోకేనా :

ఈ నేపథ్యంలో కిలారి రోశయ్య తిరిగి వైసీపీలోకి రావాలని చూస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఆయన వదిలిపెట్టి వెళ్ళినా పొన్నూరులో వైసీపీకి కూడా గట్టి నేత అయితే లేరని అంటున్నారు. రోశయ్య పార్టీని వీడినా జగన్ ని ఏమీ అనలేదు, పైగా ఆయన తన మామ ఉమ్మారెడ్డికి మండలిలో ప్రతిపక్ష స్థానం ఇవ్వలేదని అలిగి వెళ్ళారని అంతే తప్ప మరేమీ లేదని అంటున్నారు. ధూళిపాళ్ళ నరేంద్ర వంటి పెద్ద లీడర్ ని ఓడించారు, ఆయన సమర్ధతకు పార్టీ బలం తోడు అయితే కచ్చితంగా 2029లో గెలిచి తీరుతారు అని అభిమానులు అంటున్నారు. అయితే వైసీపీని వీడిపోయిన నేతల విషయంలో జగన్ ఆలోచనలు ఎమిటో అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి రానున్న రోజులలో రోశయ్య అడుగులు ఏ వైపు పడతాయో ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.