Begin typing your search above and press return to search.

మిస్ యూనివర్స్ లో మన 19 ఏళ్ల కజియా.. ఎవరీమె.? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకుంది. జైపూర్‌లో జరిగిన పోటీల్లో 52 మందిని వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. ప్రస్తుతం లా చదువుతున్న ఆమె మోడలింగ్, నటన, శాస్త్రీయ నృత్యంలోనూ ప్రతిభ చూపుతోంది. నవంబర్‌లో ప్యూర్టోరికోలో జరిగే 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.

By:  A.N.Kumar   |   7 Nov 2026 12:17 PM IST
మిస్ యూనివర్స్ లో మన 19 ఏళ్ల కజియా.. ఎవరీమె.? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
X

చేతిలో లా పుస్తకాలు.. మరోవైపు మోడలింగ్ కూడా.. నటనలో ప్రతిభ.. 19 ఏళ్లకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఇప్పుడు అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమైన కాజియా లిజ్ మెజో ప్రయాణం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

సాధారణంగా మనకు అందాల పోటీలు అనగానే కేవలం రూపమే కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం, ప్రతిభ, వ్యక్తిత్వం, లక్ష్యసాధనను జడ్జీలు పరిగణలోకి తీసుకొని విజేతను ప్రకటిస్తారు. ఇవన్నీ కలబోసి 19 ఏళ్లకే అన్నీ సాధించేసింది కేరళ కుట్టి.. ఆమె కాజియా లిజ్ మెజో.. చిన్న వయసులోనే జాతీయ స్థాయి అందాల పోటీల్లో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

జైపూర్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 ఫైనల్స్ లో 52 మంది పోటీదారులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది కాజియా. దీంతో నవంబర్ లో ప్యూర్టోరికోలో జరుగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరుఫున బరిలోకి దిగే అవకాశం దక్కించుకుంది.

కాజియా లిజ్ మెజో స్వస్థలం కేరళలోని మావెలికర.. అయితే ఆమె బాల్యం, విద్యాభాస్యంలో ఎక్కువ భాగం యూఏఈలోని అబుదాబిలోనే సాగింది. భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో పెరిగిన ఆమెకు చిన్నతనం నుంచే కళలు, ప్రదర్శన రంగాలపై ఆసక్తి ఏర్పడింది. ఈ ఆసక్తే క్రమంగా మోడలింగ్, అందాల పోటీల వైపు అడుగులు వేయించింది. కేరళ నుంచి మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న తొలి విజేతగా ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

కాజియా ప్రస్తుతం లా చదువుతున్నారు. మరోవైపు మోడలింగ్, నటన, అందాల పోటీల్లో తన ప్రతిభను పరీక్షించుకుంటున్నారు. శాస్త్రీయ నృత్యంలోనూ ఆమెకు ప్రవేశం ఉంది. చదువు , కళలు, మోడలింగ్ ఇలా విభిన్న రంగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

17 ఏళ్లకే మిస్ టీన్ దివా 2024 టైటిల్ ను కాజియా గెలుచుకుంది. ఆ తర్వాత 2025లో మిస్ టీన్ ఇంటర్నేషన్ పోటీల్లో పాల్గొని భారత్ తరుఫున రన్నరప్ గా నిలిచింది. తాజాగా 2026 మిస్ యూనివర్స్ కేరళ టైటిల్ ను సొంతం చేసుకుంది. దాదాపు 52 మంది పోటీదారులను అధిగమించి కాజియా విజేతగా నిలిచి ఇప్పుడు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటంతో మిస్ యూనివర్స్ వరల్డ్ పోటీలకు ఎంపికైంది.

కాజియా కథ కేవలం అందాల పోటీలో విజయం సాధించిన ఓ యువతి కథ మాత్రమే కాదు. చిన్న వయసులోనే విభిన్న రంగాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ చదువును కొనసాగిస్తూనే అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న యువ ప్రతిభ ప్రయాణం. ఇప్పుడు ఆమె చూపు ప్రపంచ కిరీటంపై ఉంది. ఈ 19 ఏళ్ల కేరళ యువతి మిస్ యూనివర్స్ వేదికపై ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.