ప్రపంచంలోనే క్రూరుడు నెతన్యాహు.. అరెస్టుకు పాక్ డిమాండ్
పాకిస్థాన్ రక్షణ శాఖా మంత్రి ఖ్వాజా అసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా మదురోను కిడ్నాప్ చేసినట్టే.. ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహును కిడ్నాప్ చేయాలని కోరారు
By: A.N.Kumar | 11 Jan 2026 4:06 PM ISTపాకిస్థాన్ రక్షణ శాఖా మంత్రి ఖ్వాజా అసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా మదురోను కిడ్నాప్ చేసినట్టే.. ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహును కిడ్నాప్ చేయాలని కోరారు. చరిత్రలో గాజాలో పాలస్తీనా ప్రజలపై జరిగినన్ని దురాగతాలు ఎక్కడా జరగలేదని వ్యాఖ్యానించారు. 4 వేల- 5వేల సంవత్సర కాలంలో ఏ సమాజమూ ఇజ్రాయిల్ చేసినన్ని దురాగతాలు చేయలేదన్నారు. ప్రపంచంలో ఇంత కంటే పెద్ద నేరస్థున్ని చూడలేదని ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. మానవత్వానికి నెతన్యాహు ఓ పెద్ద నేరస్థుడని అభివర్ణించారు. కానీ ప్రపంచం మాత్రం నెతన్యాహును నేరస్థుడిగా చూడటంలేదన్నారు. టర్కీ కూడా నెతన్యాహును కిడ్నాప్ చేయాలని పాకిస్థాన్ పౌరులు ప్రార్థిస్తున్నట్టు ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు.
నెతన్యాహుపై కోపం ఎందుకు ?
పాకిస్థాన్ మొదటి నుంచి పాలస్తీనా వైపు నిలబడుతోంది. గాజాలో ఇజ్రాయిల్ దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడింది. ఇజ్రాయిల్ కు వ్యతిరేకంగా ఉన్న దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. పాలస్తీనకు మద్దతుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖ్వాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.
ట్రంప్ ను కోరడమంటే ?
మదురోలాగా నెతన్యాహును కిడ్నాప్ చేయమని కోరడమంటే.. పాకిస్థాన్ వెనుజులా అధ్యక్షుడి కిడ్నాప్ ను సమర్థించినట్టే. పాకిస్థాన్ వైఖరి అమెరికాకు అనుకూలంగా ఉన్నట్టే. అదే సమయంలో నెతన్యాహుకు అండదండగా ఉన్న ట్రంప్ ను ఇలాంటి కోరిక కోరడం.. పాకిస్థాన్ అమాయకత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఎందుకంటే ఇజ్రాయిల్ వెనుక ఉన్నది అమెరికానే. అమెరికా అండ లేకుండా పాలస్థీనాపై ఇన్ని దాడులు చేస్తుందా ?. ఇన్నేళ్లుగా యుద్ధాన్ని కొనసాగిస్తుందా ? అన్నది అసలు ప్రశ్న. ఇదంతా తెలియనట్టు పాకిస్థాన్ రక్షణ మంత్రి మాట్లాడటం హాస్యాస్పదం. పాక్ మంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఖ్వాజా ఆసిఫ్ ప్రకటన అమాయకత్వంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇదే ప్రభుత్వం ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిందని, ఇప్పుడు మానవత్వాన్ని నిలబెట్టే స్వతంత్ర జడ్జిగా అమెరికాను ఉండమని కోరుతూ, నెతన్యాహును కిడ్నాప్ చేయమని కోరుతోందంటూ ట్వీట్ చేశారు.
అమెరికాకు పాపం అంటదా ?
ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజలపై దారుణాలు చేసిందని చెబుతున్న పాకిస్థాన్.. ఆ పాపం అమెరికా అండ లేకుండా చేసిందా అన్న ప్రశ్న వేసుకోవాలి. ఆ పాపంలో అమెరికాకు భాగస్వామ్యం లేదా ?. ఇది పాకిస్థాన్ కు తెలియదా ?. ఇది ద్వంద్వ దౌత్యనీతి కాదా ?. ఇజ్రాయిల్ ప్రతి పాపంలోనూ అమెరికాదే శీఘ్ర భాగం. పాలస్తీనా, గాజా సమస్య ఇంత కాలం ఉందంటే అది అమెరికా మద్దతుతోనే. అమెరికా తోలుబొమ్మే నెతన్యాహు. తోలుబొమ్మను కిడ్నాప్ చేయమని ఆడించే వాడిని కోరడమంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుదా ?.
