Begin typing your search above and press return to search.

భారత్‌పై పాక్‌ 'పరోక్ష యుద్ధం' ఆరోపణలు: అఫ్గాన్‌ ఘర్షణలతో బిజీగా ఉంచాలనే వ్యూహమట

అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఘర్షణల వెనుక భారతదేశం ఉందని, తమను "ఘర్షణలతో బిజీగా ఉంచాలనే వ్యూహం"లో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

By:  A.N.Kumar   |   2 Nov 2025 2:56 PM IST
భారత్‌పై పాక్‌ పరోక్ష యుద్ధం ఆరోపణలు: అఫ్గాన్‌ ఘర్షణలతో బిజీగా ఉంచాలనే వ్యూహమట
X

పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఘర్షణల వెనుక భారతదేశం ఉందని, తమను "ఘర్షణలతో బిజీగా ఉంచాలనే వ్యూహం"లో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

* ఖవాజా ఆసిఫ్‌ ఆరోపణల సారాంశం

ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్‌ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "భారత్‌ తూర్పు (భారత్‌-పాక్‌), పశ్చిమ (పాక్‌-అఫ్గాన్‌) సరిహద్దులపై మాకు సమస్యలు సృష్టిస్తోంది." "అఫ్గాన్‌తో వివాదాలను ముద్రించాలనే ప్రణాళికలతో భారత్‌ పరోక్షంగా జోక్యం చేసుకుంటోంది." అఫ్గాన్‌ ఘర్షణలతో పాటు, 'ఆపరేషన్‌ సిందూర్‌' వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఆయన భారత్‌పై విమర్శలు గుప్పించారు. అఫ్గానిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ కాలం నుంచే భారత్‌ పాకిస్థాన్‌పై పరోక్ష యుద్ధం కొనసాగిస్తోందని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆసిఫ్‌ తెలిపారు. "అవసరమైతే ఆ ఆధారాలను అంతర్జాతీయ వేదికపై బయటపెడతాం," అని ఆయన హెచ్చరించారు.

* అఫ్గాన్‌పై పాక్‌ వైఖరి

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న అఫ్గాన్‌ పౌరుల సమస్యను పాక్‌ ఇప్పటికే అంతర్జాతీయ వేదికల్లో లేవనెత్తిందని ఖవాజా ఆసిఫ్‌ పేర్కొన్నారు. "అఫ్గాన్‌ భూభాగం నుంచి జరిగే ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యలకు ఆ దేశమే బాధ్యత వహించాలి," అని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ తరఫున ఎలాంటి శత్రుత్వ చర్యలు జరగడం లేదని, కాల్పుల విరమణ ఉల్లంఘనకు అఫ్గాన్‌ బలగాలే కారణమని ఆయన ఆరోపించారు.

* శాంతి చర్చల ప్రయత్నాలు

ఇటీవల పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఘర్షణలు పెరిగినప్పటికీ, తుర్కియే , ఖతార్‌ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తూ శాంతి చర్చలకు వేదిక కల్పించాయి. నవంబర్‌ 6న ఇరుదేశాల ప్రతినిధులు మరోసారి చర్చలకు కూర్చోనున్నారు.

పాకిస్థాన్‌ నాయకులు తమ లోపలి రాజకీయ, భద్రతా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్‌పై నిందలు మోపడం పాత వ్యూహమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అఫ్గానిస్థాన్‌తో ఘర్షణల నేపథ్యంలో అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంగానే ఈ తాజా ఆరోపణలను చూస్తున్నారు.