ఏసీ గదులు కాపాడవు.. ఈడ్చకొస్తాం: అమిత్‌షాపై ఖర్గే ఫైర్
నిన్నటి వరకు లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు.. కేంద్రంపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.
By: Garuda Media | 30 July 2026 7:57 PM ISTనిన్నటి వరకు లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు.. కేంద్రంపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ``మూర్ఖులు.. రేప్ కేసులో నిందితులకు మద్దతు ఇచ్చేవారు`` అంటూ.. కేంద్ర మంత్రులపై అన్నాచెల్లెళ్లు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తాజాగా గురువారం.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సెంట్రిక్‌గా నిప్పులు చెరిగారు. ఆయనను ఈడ్చుకొస్తాం.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
రాజ్యసభలో పరీక్ష పేపర్ లీకేజీ సవరణ బిల్లు వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ సమయంలో ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై లాఠీ చార్జీలు చేయించారని.. పెల్లెట్ తుపాకులతో కాల్పులు జరిపించారని.. దీనికి బాధ్యులు ఎవరని ఖర్గే నిలదీశారు. ``దీనికి సమాధానం చెప్పాల్సిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మౌనంగా ఉండి.. ఏసీ గదుల్లో కూర్చుంటే.. ఊరుకుంటామని అనుకుంటు న్నారా? ఏసీ గదులు మిమ్మల్ని కాపాడవు. బయటకు ఈడ్చుకువచ్చి.. ప్రజల ముందు నిలబెడతాం.`` అని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
పోలీసులు జరిపిన పెల్లెట్ దాడుల్లో.. విద్యార్థుల శరీరాలు తూట్లు పడ్డాయని, రక్తం కారుతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఖర్గే.. వారిని చూస్తే.. తమ గుండె తరుక్కుపోతోందన్నారు. మరికొందరికి పెల్లెట్లు తగిలి కళ్లు పోయాయని..వారు చూడలేక పోతున్నారని అన్నారు. వారి ఆవేదన కేంద్రానికి పట్టదా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు చేయించింది ఎవరో తేల్చాల్సిన బాధ్యత ఉందన్నారు. కేంద్ర హోం మంత్రి సభ నుంచి తప్పించుకున్నా.. ప్రజల నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఆయనను ప్రజల మధ్యకు ఎలా తీసుకురావాలో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు.
చైర్మన్ ఫైర్..
ఈ సందర్భంగా ఖర్గేను ఉద్దేశించి రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఫైరయ్యారు. ఆవేశ పడితే సమస్య లు పరిష్కారం కావని.. బిల్లుపై చర్చించాలని బిల్లులో ఏముందో దానిపై చర్చించాలని ఆయన పదే పదే కోరారు. సభను రాజకీయ వేదిక చేయొద్దని అన్నారు. ఈ సమయంలో బీజేపీ సభ్యులు కూడా ఖర్గేను కార్నర్ చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ``మీరు నిలబడేందుకే మరో మనిషి అవసరం. మీరు లాక్కొస్తారా ఖర్గే జీ`` అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సమయంలో కాంగ్రెస్-బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అనంతరం సభను వాయిదా వేశారు.
