కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ : ఆర్ఎస్ఎస్ ని నిషేధించాల్సిందే !
ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాలు పంచుకునే వారు ప్రభుత్వ ఉద్యోగాలు చేయరాదని ఆ విధంగా నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
By: Satya P | 1 Nov 2025 5:00 AM ISTరాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ని నిషేధించాల్సిందే అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూనే ఆర్ఎస్ఎస్ మీద ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాదు ఆర్ఎస్ఎస్ ని ఆయన విషం తో పోల్చారు. ఆర్ ఎస్ ఎస్ భావజాలం మీద ఆయన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. కర్ణాటకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు.
గాంధీ హత్యకు కారణం :
ఖర్గే మహాత్మా గాంధీ హత్యను మరోసారి చర్చకు పెట్టారు. 1948 లో మహాత్మా గాంధీ హత్య జరిగితే ఆర్ ఎస్ ఎస్ దానిని సెలబ్రేట్ చేసుకుందని ఖర్గే పాత విషయాలంటూ ముందు పెట్టారు ఆ తరువాతనే ఆర్ఎస్ఎస్ ని దేశంలో బ్యాన్ చేశారు అని అన్నారు. ఆనాటి దేశ హో మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి అందిన సమాచారం ప్రకారం ఆర్ఎస్ఎస్ హిందూ మహా సభ భావ జాలం కారణంగానే దేశంలో ఏర్పడిన ఒక రకమైన వాతావరణం గాంధీ హత్యకు కారణంగా మారిందని చెప్పారు.
వారు ఉద్యోగాలు చేయరాదు :
ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాలు పంచుకునే వారు ప్రభుత్వ ఉద్యోగాలు చేయరాదని ఆ విధంగా నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. పటేల్ కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉండేవారు అన్నారు. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత నరేంద్ర మోడీ ప్రభుత్వం జూలై 9న ఈ నిషేధం ఎత్తివేసిందని అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధం విధించింది, దాని మీద బీజేపీ కోర్టుకు వెళ్ళింది. ఈ వివాదం నేపథ్యంలో ఖర్గే చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి కాంగ్రెస్ కమలం పార్టీల మధ్య మంట పుట్టించాయి.
కాంగ్రెస్ నాజీల పార్టీ :
మల్లిఖార్జున ఖర్గే ఆర్ఎస్ఎస్ మీద చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో బీజేపీ కూడా ఘాటుగానే స్పందించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇండియన్ నాజీ కాంగ్రెస్ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. పటేల్ సేవలను గత యాభై ఏళ్ళలో కాంగ్రెస్ విస్మరించింది అని ఆయన నిందించారు. పటేల్ అడుగు జాడలలో నడవడానికి కాంగ్రెస్ ఏ రోజూ ఇష్టపడలేదని అన్నారు కేవలం ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకించడానికే పటేల్ పేరుని కాంగ్రెస్ వాడుకుంటోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ఎస్ అంటే :
ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదని, అది ఒక రాజకీయేత సంస్థ అని షెహజాద్ పూనావాలా గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా కోర్టు ఆర్ఎస్ఎస్ మీద నిషేధాన్ని ఎత్తి వేసిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ కి ఆర్ఎస్ఎస్ అంటేనే ఎందుకో అసహనం అని ఎద్దేవా చేశారు. దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ మీద విషం చిమ్మడం కాంగ్రెస్ కి ఎప్పటి నుంచో అలవాటు అని అన్నారు మొత్తం మీద చూస్తే పటేల్ జయంతి వేళ పాత విషయాలు తవ్వుకుంటూ కాంగ్రెస్ బీజేపీ ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకోవడం గమనార్హం. పటేల్ దేశానికి చేసిన సేవలలో కూడా తమకు అనుకూలంగా ఉన్న వాటిని తీసుకుని ప్రత్యర్థుల మీద వాటిని ప్రయోగించడం గతాన్ని తవ్వి కెలకడంతో సర్దార్ గురించిన అసలు విషయాలు ఈ తరానికి ఏ మేరకు తెలియచేస్తున్నారు అన్నదే ప్రశ్నగా ఉంది.
