Begin typing your search above and press return to search.

రూ.549 కోట్ల మోసానికి కేరాఫ్ అడ్రస్ సత్తుపల్లి

ఈ ముఠాకు చెందిన 24 మందిపై కేసులు నమోదు చేసిన పద్దెనిమిది మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By:  Garuda Media   |   12 Jan 2026 1:00 PM IST
రూ.549 కోట్ల మోసానికి కేరాఫ్ అడ్రస్ సత్తుపల్లి
X

రూ.549 కోట్ల భారీ మోసానికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. షాకింగ్ అంశం ఏమంటే.. ఇంత భారీ మోసానికి పాల్పడిన వారు తెలంగాణలోని మారుమూల ప్రాంతాన్ని వేదికగా చేసుకొని చేయటం. ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి.. నిరుద్యోగులకు కమీషన్ ముట్టచెబుతామని చెప్పి.. వారి చేత బ్యాంకు ఖాతాలు తెరిపించి వాడుకునే ఉదంతాన్ని గుర్తించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. విదేశాలకు చెందిన వారితో కలిసి ముఠాగా ఏర్పడి ఈ భారీ మోసానికి తెర తీసినట్లుగా ఖమ్మం పోలీసులు గుర్తించారు.

ఈ ముఠాకు చెందిన 24 మందిపై కేసులు నమోదు చేసిన పద్దెనిమిది మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని ఖమ్మం సీపీ వెల్లడించారు. ఇంతకూ అసలేం జరిగిందంటే.. సత్తుపల్లి మండలానికి చెందిన సాయికిరణ్ అనే యువకుడు గత ఏడాది డిసెంబరు 24లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. బ్యాంకు ఖాతాను తెరిపించి మోసం చేసినట్లుగా పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా భారీ రాకెట్ ను గుర్తించారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన పలువురు ఒక ముఠాలా ఏర్పాడ్డారు. వీరు విదేశాలకు చెందిన సైబర్ నేరస్థులతో కలిసి మ్యాట్రిమోని.. రివార్డు పాయింట్లు.. గేమింగ్.. బెట్టింగ్.. షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మోసం చేసే ముఠాలకు వీరి బ్యాంకుఖాతాల్ని వినియోగిస్తున్నారు. కాంబోడియాలో నివసిస్తున్న చైనాకు చెందిన పలువురిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీరు దోచుకున్న సొమ్ముల్ని నిరుద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చేశారు. ఆ ఖాతాల నుంచి ఏజెంట్ల ఖాతాలకు.. అక్కడి నుంచి తమ సొంత ఖాతాలకు డబ్బులు మళ్లించేలా ప్లాన్ చేసిన వైనాన్ని గుర్తించారు.

ఈ క్రమంలో నిందితులు మనోజ్ కల్యాణ్ బ్యాంకు ఖాతాలో రూ.114.18 కోట్లు.. అతడి భార్య భానుప్రియ ఖాతాలో రూ.45.62 కోట్లు.. బావమరిది సతీష్ ఖాతాలో రూ.135.48 కోట్లు.. భాగ్యలక్ష్మి ఖతాలో రూ.81.72 కోట్లు.. రాజు బ్యాంకు ఖాతాలో రూ.92.54 కోట్లు, వికాస్ చౌదరి ఖాతాలో రూ.80.41 కోట్ల లావాదేవీలు చేసినట్లుగా గుర్తించారు. వీరందరి ఖాతాలు కలిపి నిందితులు మొత్తం రూ.549.95 కోట్లకు పైనే దోచుకున్నట్లుగా గుర్తించారు. ఈ భారీ మొత్తాన్ని విదేశీయులకు ఎంత పంపారు? వీరు ఎంత మొత్తాన్ని వాటాగా పొందారు? ఇంత భారీగా లావాదేవీలు జరుగుతున్నా.. బ్యాంకు సిబ్బంది ఎందుకు అనుమానించలేదు? విదేశీ మోసగాళ్లతో ఎలా ఒప్పందం చేసుకున్నారు? ఈ మొత్తానికి కింగ్ పిన్ ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి.