Begin typing your search above and press return to search.

భార‌త్ -కెన‌డా భ‌విష్య‌త్ పరిణామాల‌పై జ‌ర్న‌లిస్ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన క్ర‌మంలో, కెనడా నాయకత్వం భారత్‌తో సుదీర్ఘ కాలం విభేదించడానికి ఇష్టపడటం లేదని ఆయన పేర్కొన్నారు.

By:  Sivaji Kontham   |   20 Jan 2026 9:31 AM IST
భార‌త్ -కెన‌డా భ‌విష్య‌త్ పరిణామాల‌పై జ‌ర్న‌లిస్ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

కెనడియన్ సీనియర్ జర్నలిస్ట్ టెర్రీ మైలెవ్‌స్కీ ఖలిస్థాన్ ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన విశ్లేషణలోని విష‌యాలు సూటిగా ఉండ‌టంతో అందరి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి.

నిజానికి భార‌త‌దేశానికి చాలా కాలంగా త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంగా ఉన్న ఖ‌లిస్థాన్ ఉద్య‌మం అనేది సహజంగా పుట్టినది కాదని, అది పూర్తిగా పాకిస్థాన్ అందించే బాహ్య మద్దతుపైనే ఆధారపడి ఉందని మైలెవ్‌స్కీ స్పష్టం చేశారు. ఒకవేళ పాకిస్థాన్ మద్దతు ఉపసంహరించుకుంటే, ఆ ఉద్యమం వెనువెంటనే తుడిచిపెట్టుకుపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని ఆయన ఒక `ప్రాక్సీ ప్రాజెక్ట్` (ఇతరుల ప్రయోజనాల కోసం నడిచేది)గా అభివర్ణించారు.

నిజ్జర్ హత్య తర్వాత భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన క్ర‌మంలో, కెనడా నాయకత్వం భారత్‌తో సుదీర్ఘ కాలం విభేదించడానికి ఇష్టపడటం లేదని ఆయన పేర్కొన్నారు. సాధారణ కెనడా పౌరులకు భావజాల పోరాటాల కంటే ఉద్యోగాలు, వాణిజ్యం, ఆర్థిక స్థిరత్వం ముఖ్యమని, అందుకే ప్రభుత్వం ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చూడాలని భావిస్తోందని చెప్పారు. దౌత్య సంబంధాల పునరుద్ధరణ కోసం కెన‌డా సిద్ధంగా ఉంద‌ని ఆయ‌న‌ అన్నారు. భారత్, కెనడా ప్రభుత్వాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయకుండా, ఈ సమస్యను పక్కన పెట్టడానికి ఒక అలిఖిత ఒప్పందానికి రావాల‌ని మైలెవ్‌స్కీ సూచించారు. కఠినమైన అంశాల‌ను ఎదుర్కొంటూనే సంబంధాలు క్షీణించకుండా చూసుకోగల రాజకీయ బలం భారత నాయకత్వానికి ఉందని ఆయన ప్రశంసించారు.

మైలెవ్‌స్కీ వ్యాఖ్యలు భారత దేశం మొదటి నుండి చెబుతున్న వాదనను బలపరుస్తున్నాయి. ఖలిస్థాన్ అనేది ప్రజల నుండి వచ్చిన ఉద్యమం కాదని, అది విదేశీ శక్తుల అండతో నడుస్తున్న ఒక కుట్ర అని భారత్ ఎప్పటి నుండో చెబుతోంది. టెర్రీ మైలెవ్‌స్కీ విశ్లేషణ ప్రకారం.. మున్నుందు భారత్-కెనడా మధ్య వాణిజ్య - దౌత్య సంబంధాలు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. ఖలిస్థాన్ అంశం కేవలం రాజకీయ ప్రకంపనలకే పరిమితం అవుతుందని, అది దేశాల మధ్య సంబంధాలను శాశ్వతంగా దెబ్బతీయలేదని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.