Begin typing your search above and press return to search.

ఖలీదా - హసీనా... ఇద్దరు బేగంలను కలిపిన శత్రువు కథ తెలుసా..?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీ.ఎన్.పీ) అధినేత్రి ఖలీదా జియా (80) మంగళవారం ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు.

By:  Raja Ch   |   30 Dec 2025 9:00 PM IST
ఖలీదా - హసీనా... ఇద్దరు  బేగంలను కలిపిన శత్రువు కథ తెలుసా..?
X

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీ.ఎన్.పీ) అధినేత్రి ఖలీదా జియా (80) మంగళవారం ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో చేరిన ఖలీదాకు న్యుమోనియా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సమయంలో ఆమె ఆరోగ్యం అప్పటి నుంచి వేగంగా క్షీణించింది. ఇదే క్రమంలో.. గుండె, కిడ్నీ, లివర్ తదితర సమస్యలు తీవ్రమయ్యాయని చెబుతున్నారు.

అవును... బంగ్లాదేశ్ రాజకీయాలపై బలమైన ముద్ర వేసి.. పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసి.. ఈ క్రమంలో సుమారు రెండేళ్ల పాటు జైలు జీవితం అనుభవించిన ఖలీదా జియా మృతి చెందారు. కొన్నేళ్ల క్రితం ఆమె కుమారుడు అరాఫత్ రెహమాన్ కోకో కూడా మలేసియాలో కన్ను మూయగా.. మరో కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల ప్రవాసం తర్వాత ఇటీవల బంగ్లాదేశ్ లో అడుగుపెట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల్లో ఆయన పాత్ర కీలకం అని అంటున్నారు!

ఆ సంగతి అలా ఉంచితే.. నాలుగు దశాబ్దాలకు పైగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక భూమిక పోషించిన షేక్ హసీనా - ఖలీదా జియా ల గురించిన చర్చ ఈ సందర్భంగా ఆసక్తికరం అనే చెప్పాలి. ఆ దేశాన్ని పాలించిన ఈ మహిళా మాజీ ప్రధానులిద్దరూ లోతైన వ్యక్తిగత శత్రుత్వాలను కలిగి ఉన్నారు. వీరిద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అయితే.. అనూహ్యంగా ఓ విషయంలో మాత్రం ఇద్దరూ పరోక్షంగా ఏకతాటిపైకి వచ్చారు. అది బంగ్లా చరిత్రలో కీలక ఘట్టం!

ఇద్దరి మధ్యా అసాధారణ పొత్తు!:

వీరిద్ధరి మధ్యా తీవ్ర వైరం ఉన్నప్పటికీ 80లలో ఇద్దరు బేగంల మధ్య పరిస్థితులు ఓ అసాధారణమైన, అసౌకర్యమైన పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి కల్పించాయి! కారణం... ఆ సమయంలో బంగ్లాదేశ్ సైనిక పాలకుడు హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్ చేతిలో ఉంది. అతడు 1982 తిరుగుబాటు ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని మార్షల్ లా ద్వారా దేశాన్ని తనదైన శైలిలో పరిపాలిస్తున్నాడు. ఎన్నికలను అత్యంత కఠినంగా నిర్వహించాడు.

ఈ క్రమంలో... ఓ పక్క షేక్ హసీనా అవామీ లీగ్, మరోపక్క ఖలీదా జియా బీ.ఎన్.పీ.. సమాంతరంగా కానీ వేర్వేరు నిరసన ఉద్యమాలకు నాయకత్వం వహించాయి. ఈ సమయంలో... ముహమ్మద్ ఎర్షాద్ సామూహిక అరెస్టులు, అత్యవసర చట్టాలతో స్పందించాడు. ఈ క్రమంలో.. 1980ల చివరి నాటికి ఈ ఇద్దరు ప్రత్యర్థి బేగంలు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. ఇందులో భాగంగా.. ఎర్షాద్‌ ను తొలగించడానికి సమన్వయంతో కూడిన వ్యతిరేకత అవసరమని భావించారు.

వ్యక్తిగత శత్రుత్వాన్ని పక్కనపెట్టి.. హసీనా - ఖలీదా.. ఎర్షాద్ వ్యతిరేక కూటమిలో చేతులు కలిపారు. ఈ సమయంలో వారిద్దరిదీ ఒకటే డిమాండ్.. 'నియంత రాజీనామా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ'! ఈ పరిణామాల నేపథ్యంలో... 1990లో దేశంలో ఆందోళనలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. విద్యార్థి ఉద్యమాల ద్వారా నడిచే నిరంతర నిరసనలు దేశాన్ని దాదాపు స్తంభింపజేశాయని చెప్పొచ్చు. దీంతో.. ఎర్షాద్ డిసెంబర్ 6, 1990న రాజీనామా చేశారు.

ఈ ఇద్దరి బేగంల పోరాట ఫలితంగా బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఓ కీలక మలుపుగా ఈ ఘటన నిలిచింది! వీరి ఐక్యత దేశంలో సైనిక పాలనను అంతం చేయడంలో సక్సెస్ అయ్యింది.