Begin typing your search above and press return to search.

తెగని పంచాయితీ.. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బ్రేక్?

2023 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేయటం తెలిసిందే. ఆ ఎన్నికల్లో దానం నాగేందర్ విజయం సాధించారు.

By:  Garuda Media   |   2 Oct 2026 11:03 AM IST
తెగని పంచాయితీ.. ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బ్రేక్?
X

అనూహ్య రీతిలో మలుపులు తిరిగుతున్న ఖైరతాబాద్ పంచాయితీ మరోసారి కోర్టు ముంగిట నిలిచింది. ఇటీవల ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యిందంటూ అధికారిక గెజిట్ వెల్లడైన వేళ.. గతంలో తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ తేలే వరకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వొద్దంటూ 2023 ఎన్నికల నాటి కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు తాము తీర్పు వెల్లడించే వరకు ఉప ఎన్నిక వద్దంటూ టీహైకోర్టు పేర్కొంది. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగింది?

2023 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేయటం తెలిసిందే. ఆ ఎన్నికల్లో దానం నాగేందర్ విజయం సాధించారు. కట్ చేస్తే.. ఈ ఎన్నికను సవాలు చేస్తూ.. దానం నాగేందర్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో భార్యతో పాటు తనపై ఆధారపడిన వారి ఆస్తులను పూర్తిగా వెల్లడించలేదంటూ విజయారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు పంపిణీ చేశారన్న మరో ఆరోపణ చేస్తూ 2024 జనవరి 20న పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని టీహైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది.

ఆ తర్వాతేం జరిగింది?

ఈ పిటిషన్ ను విచారణకు సేకరించినప్పటికి ఆ తర్వాత దీనిపై విచారణ సాగలేదు. దీంతో.. అలా పెండింగ్ లో పడిపోయింది. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న దానం నాగేందర్ సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు.. సుప్రీంలో ఎదురుదెబ్బ

బీఆర్ఎస్ నేతల పిటిషన్ ఆధారంగా దానంపై వేటు వేసే అంశంపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు కోరింది. ఈ సందర్భంగా స్పీకర్ దానంపై వేటు వేయలేదు. ఈ నిర్ణయాన్ని విభేధిస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో సవాలు చేస్తే.. పలు దఫాలుగా జరిగిన విచారణ అనంతరం ఆయనపై అనర్హత వేటు వేస్తూ టీహైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాల్ని సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. సుప్రీంలోనూ ఆయనకు ఎదురుదెబ్బ తగలటంతో.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లుగా పేర్కొంటూ గెజిట్ విడుదలైంది.

మరోమారు విజయారెడ్డి ఎంట్రీ

సుప్రీం ఆదేశాలు.. అనంతరం అసెంబ్లీ స్థానం ఖాళీ అంటూ గెజిట్ వెలువడిన నేపథ్యంలో.. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ త్వరలో విడుదల అవుతుందన్న అంచనాల వేళ.. మరోసారి విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తి కాకపోవటాన్ని ప్రస్తావిస్తూ.. ఆ కేసు లెక్క తేలే వరకు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

అసలు పాయింట్ ఇదే

గతంలో విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఖైరతాబాద్ ఉప ఎన్నికకు ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. దానం ఎన్నికను రదదు చేసి.. తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరటం తెలిసిందే. సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలు.. గతంలోని తీర్పులు.. ముఖ్యంగా ప్రమోద్ లక్ష్మణ్ గుడాధే వర్సెస్ ఎన్నికల సంఘం కేసు సందర్భంగా సుప్రీం ప్రస్తావించిన అంశాల్ని ఇప్పుడు తెర మీదకు వచ్చాయి.

గతంలో సుప్రీం చెప్పిందేంటి?

ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేయాలంటూ ఎవరైనా పిటిషనర్ కోర్టును ఆశ్రయించిన వేళ.. మరో అభ్యర్థిని విజేతగా ప్రకటించాలని కోరితే.. ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగా.. ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తే.. ఒకే నియోజకవర్గానికి ఇద్దరు వ్యక్తులు ఎన్నికయ్యే పరిస్థితి ఉత్పన్నమవ్వొచ్చని సుప్రీం గతంలో పేర్కొంది. అంతేకాదు.. వేటు కోసం దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్ లో ఉన్న స్థానాన్ని సాధారణ ఖాళీగా పరిగణించి ఉప ఎన్నికను నిర్వహించలేమని స్పష్టం చేసింది.

టీహైకోర్టులో గురువారం ఏం జరిగింది?

గురువారం విజయారెడ్డి తాజా పిటిషన్ ను విచారణకు స్వీకరించిన వేళ.. దీనిపై తుది తీర్పు వచ్చే వరకూ ఉప ఎన్నిక వద్దని హైకోర్టు పేర్కొంది. దీనికి ఎన్నికల కమిషన్ తరఫు హాజరైన న్యాయవాది కూడా ప్రాథమికంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నిక నిర్వహించమని ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని టీహైకోర్టు ఆదేశించింది. దీంతో.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియకు బ్రేక్ పడినట్లుగా చెప్పాలి.

ఇప్పుడు డిసైడ్ చేయాల్సింది ఎవరు?

విజయారెడ్డి తాజా పిటిషన్ నేపథ్యంలో స్పందించిన హైకోర్టు కారణంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఖాళీగా ఎన్నికల సంఘం ప్రకటించిన వేళ.. విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించటం..అందుకు బ్రేకులు వేస్తూ హైకోర్టు పేర్కొనటం.. ఎన్నికల సంఘాన్ని ఉప ఎన్నిక నిర్వహించమని అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పిన నేపథ్యంలో.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిలిచిపోవటం ఖాయమైనట్లేనని చెబుతున్నారు. మొత్తంగా టీహైకోర్టు తీర్పు అనంతరమే ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడన్నది ఆధారపడి ఉంటుందని చెప్పాలి. మొత్తంగా సినిమాటిక్ మలుపులు తిరుగుతున్న ఖైరతాబాద్ ఉప ఎన్నిక చివరకు ఏమవుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.