Begin typing your search above and press return to search.

ఖైరతాబాద్ బరిలోకి మాధవీలత, చీకోటి !

ఖైరతాబాద్ శాసనసభకు ఉప ఎన్నికలు జరగడం ఖాయం అవడంతో భారతీయ జనతాపార్టీ నుండి ఈ సారి ఎవరు బరిలోకి దిగుతారు అన్న విషయంలో కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి.

By:  Garuda Media   |   3 Oct 2026 2:00 PM IST
ఖైరతాబాద్ బరిలోకి మాధవీలత, చీకోటి !
X

ఖైరతాబాద్ శాసనసభకు ఉప ఎన్నికలు జరగడం ఖాయం అవడంతో భారతీయ జనతాపార్టీ నుండి ఈ సారి ఎవరు బరిలోకి దిగుతారు అన్న విషయంలో కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో కోర్టు ఆయన మీద అనర్హత వేటు వేసింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది.

అయితే గత ఎన్నికల ఫలితాల అనంతరం దానం నాగేందర్ అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చాడని తాను వేసిన పిటీషన్ ఇంకా కోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో తన పిటీషన్ మీద తీర్పు వచ్చే వరకు ఖైరతాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు జరపవద్దని గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన పి.విజయారెడ్డి కోర్టులో పిటీషన్ వేసింది. దీంతో తాత్కాలికంగా ఇక్కడ ఎన్నికలకు బ్రేక్ పడింది.

2009 ఎన్నికల నుండి ఖైరతాబాద్ లో బీజేపీ తరపు నుండి చింతల రామచంద్రారెడ్డి వరసగా పోటీ చేస్తూ వస్తున్నాడు. 2014లో విజయం సాధించిన ఆయన 2009, 2018, 2023లలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయడానికి కొత్త మొఖాలు అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన కొంపెల్లి మాధవీలత ఈసారి ఖైరతబాద్ శాసనసభ స్థానం నుండి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఆమె ప్రచారం పలుమార్లు వివాదాస్పదం అయింది. అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేసిన ఆమె ఆ ఎన్నికల్లో 3,23,894 ఓట్లు సాధించింది.

ఇక క్యాసినోలు, జూదం వ్యాపారాల నిర్వహణతో ఫెమా ఉల్లంఘనలకు పాల్పడ్డాడని ఈడీ దాడులు ఎదుర్కొన్న చీకోటి ప్రవీణ్ కుమార్ ఆ తరువాత బీజేపీ పార్టీలో చేరి పలు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుండి పోటీ చేసేందుకు ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఖైరతాబాద్ శాసనసభ ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయిన చింతల రామచంద్రారెడ్డి 16,062 ఓట్లు సాధించాడు. అనంతరం 2014 ఎన్నికల్లో 53,102 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ మీద 20,846 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 2018 ఎన్నికల్లో 34,666 ఓట్లకు, 2023 ఎన్నికల్లో 38,094 ఓట్లకు పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలో అక్కడ చింతల రామచంద్రారెడ్డి స్తానంలో కొత్త వారిని బరిలోకి దించి ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి చింతల రామచంద్రారెడ్డి మరోసారి టికెట్ దక్కించుకుంటాడా ? కొత్తమొకం తెర మీదకు వస్తుందా ? వేచిచూడాలి.