సర్ జాబితాతో ఉప ఎన్నిక... ఖైరతాబాద్ లిట్మస్ టెస్ట్
ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికకు మరో ప్రత్యేకత ఏంటి అంటే సర్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత నివహించే తొలి ఎన్నికగా ఉంటుంది. ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా మీదనే ఇపుడు దేశమంతా రచ్చ సాగుతోంది.
By: Satya P | 29 Sept 2026 9:06 AM ISTతెలంగాణాలో ఒక ఉప ఎన్నిక జరగబోతోంది. బహుశా దానిని 2027 ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ నిర్వహిస్తారు. ఆ సమయంలో ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. వాటితోనే కలిపి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది అంటున్నారు. ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికల నిర్వహణను ఆరు నెలల వ్యవధిలో పూర్తి చేయాలి. సెప్టెంబర్ 23 నుంచి ఈ సీటు ఖాళీగా ఉందని గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాబట్టి మార్చి 23 లోగా అక్కడ ఎన్నిక ముగిసేలా షెడ్యూల్ ఉండబోతోంది. ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికకు మరో ప్రత్యేకత ఏంటి అంటే సర్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత నివహించే తొలి ఎన్నికగా ఉంటుంది. ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా మీదనే ఇపుడు దేశమంతా రచ్చ సాగుతోంది. దాంతో ఖైరతాబాద్ లో ఏమి జరుగుతుంది అన్నది మొత్తం తెలంగాణాయే కాదు, మరో తెలుగు రాష్ట్రం ఏపీ కూడా గమనించేలా ఈ ఉప ఎన్నిక ఉండబోతోంది అని అంటున్నారు.
ఓట్ల దొంగతనం అంటూ :
ఇదిలా ఉంటే కోర్టు తీర్పు వల్ల తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే బీజేపీ మీద నిప్పులు చెరుగుతున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న దానం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. 2024లో దేశంలో నిర్వహించిన లోక్ సభ ఎన్నికల్లో ఇదే జరిగిందని కూడా ఆరోపించారు. అయితే ఇప్పటికే తెలంగాణాలో పూర్తి అయిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఖైరతాబాద్ సీటు ఫలితాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేదని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తానే గెలిచి చూపిస్తాను అని అంటున్నారు.
గట్టి పోటీగానే :
అయితే దానం నాగేందర్ నే మరోసారి కాంగ్రెస్ ఇక్కడ పోటీకి నిలపనుంది. బీజేపీకి కూడా ఖైరతాబాద్ లో పట్టు ఉంది. 2014లో చింతల రామచంద్రారెడ్డి ఇక్కడ నుంచే గెలిచారు. ఆయనకు 53 వేల దాకా ఓట్లు వచ్చాయి. దాంతో బీజేపీ ఈసారి గెలిచి తీరుతామని నమ్మకంగా ఉంది. దానం అనర్హత వేటుని రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. జనంలో కూడా ఆయన పట్ల సానుభూతి కంటే వ్యతిరేకత ఉంటుందని బీజేపీ ఊహిస్తోంది. ఉప ఎన్నికకు ఆయన పార్టీ ఫిరాయింపు కారణం అని బీజేపీ జనాలకు చెప్పనుంది అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ దొందుకు దొందే అని కూడా బీజేపీ ప్రచారం చేయనుంది అంటున్నారు. బీఆర్ఎస్ కూడా తమకు బలమైన కేంద్రంగా ఖైరతాబాద్ ని చూస్తోంది. కచ్చితంగా తాము గెలుస్తామని అంటోంది. బీసీ అభ్యర్ధిని బరిలోకి దింపితే ఫలితం అనుకూలం అవుతుందని లెక్క వేస్తోంది. తమ పార్టీకే జనాలు 2023లో ఓటేసారు, మళ్లీ తమ పార్టీనే గెలిపిస్తారు అన్నది గులాబీ పార్టీ ధీమాగా ఉంది.
యాంటీ సెంటిమెంట్ గా :
ఇకపోతే దానం నాగేందర్ కి 2004లో అసిఫ్ నగర్ లో జరిగిన ఉప ఎన్నికలు ఒక యాంటీ సెంటిమెంట్ గా ఉన్నాయని అంటున్నారు. ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన అప్పట్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్‌లోకి చేరారు. ఆ మీదట అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఆసిఫ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే మజ్లీస్ పార్టీ అక్కడ గెలిచింది. పార్టీలు మారే నాయకులకు ఆనాడు ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పారని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఇపుడు చూస్తే 2023లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అనర్హత వేటు పడడంతో ఆయన తిరిగి ఉప ఎన్నికల బరిలోకి వస్తున్నారు. మరి యాంటీ సెంటిమెంట్ పనిచేస్తుందా అన్న ఆందోళన అయితే ఆయన వర్గంలో ఉంది అని అంటున్నారు. చిత్రమేంటి అంటే నాడూ నేడూ గెలిచిన పార్టీని వదిలేసి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి దానం బరిలో ఉండడం అంటున్నారు.
