Begin typing your search above and press return to search.

తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. పోటీకి సిద్ధంగా ఉన్నారా?

ఈ సారి జూబ్లీహిల్స్ పక్కనే ఉన్న ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   15 Nov 2025 5:00 AM IST
తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. పోటీకి సిద్ధంగా ఉన్నారా?
X

తెలంగాణలో ఉప ఎన్నికల వాతావరణం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. జూబ్లీహిల్స్ యుద్ధం ముగిసిన వెంటనే.. నగరంలోనే మరో నియోజకవర్గానికి ఉప ఎన్నిక తరుముకొచ్చే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. ఈ సారి జూబ్లీహిల్స్ పక్కనే ఉన్న ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సీనియర్ నేత దారం నాగేందర్ గెలుపొందారు. అయితే బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన దానం.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. అంతేకాకుండా 2024 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

తెలంగాణలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా, వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదును స్పీకర్ త్వరగా పరిష్కరించడం లేదని కోర్టును ఆశ్రయించింది. ఇక సుప్రీం ఆదేశాలతో ఇటీవలే స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరుపుతున్నారు. అయితే ఈ 10 మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ విషయంలో ఆయన తప్పించుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే అనర్హతకు ముందే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం మరోవైపు సాగుతోంది.

నిజానికి దానం ఎప్పుడో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ముందుకొచ్చారని అంటున్నారు. అయితే తగిన సమయం కోసం ఎదురుచూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. దానం రాజీనామాను ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారని అంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత ప్రజల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలాబలాలపై ఒక అవగాహన వచ్చింది కనుక.. ఇక ఆయన దానం విషయంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. దీంతో కొద్ది రోజుల్లోనే ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయి ఉప ఎన్నిక జరిగే పరిస్థితి కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.

అయితే జూబ్లీహిల్స్ లో చేయి కాల్చుకున్న బీఆర్ఎస్.. ఖైరతాబాద్ ఎన్నికను కూడా కోరుకునే పరిస్థితి ఉందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా చెబుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నుంచి ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని, కచ్చితంగా మళ్లీ గెలిచి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెబుతామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా తేలిపోవడంతో ఇప్పుడున్న పరిస్థితిలో మరిన్ని ఉప ఎన్నికలను ఆ పార్టీ కోరుకునే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఈ కారణంగా స్పీకర్ ఎదుట విచారణకు ఉన్న అనర్హత పిటిషన్లపై వెంటనే నిర్ణయం వెలువడేలా ఒత్తిడి చేసే పరిస్థితి లేదంటున్నారు. అయితే బీఆర్ఎస్ ను మరింత ఒత్తిడికి గురిచేసే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపి దానం నాగేందర్ తో రాజీనామా చేయిస్తే, అప్పుడెలా ఉంటుందనేది చూడాల్సివుందని అంటున్నారు.