Begin typing your search above and press return to search.

ఏం అందం సామీ.. మన లేడీ మల్లయోధురాలు ఇప్పుడు సోషల్ మీడియాను ‘బరువులెత్తి’ షేక్ చేస్తోంది..

సాధారణంగా పవర్‌లిఫ్టింగ్ అనగానే భారీ కాయం, కొండంత బలం, గంభీరమైన శరీరాకృతి ఉన్న అథ్లెట్లే గుర్తుకొస్తారు.

By:  A.N.Kumar   |   4 Sept 2026 6:32 PM IST
ఏం అందం సామీ.. మన లేడీ మల్లయోధురాలు ఇప్పుడు సోషల్ మీడియాను ‘బరువులెత్తి’ షేక్ చేస్తోంది..
X

సాధారణంగా పవర్‌లిఫ్టింగ్ అనగానే భారీ కాయం, కొండంత బలం, గంభీరమైన శరీరాకృతి ఉన్న అథ్లెట్లే గుర్తుకొస్తారు. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ చలాకీతనం, అమాయకపు చిరునవ్వుతోనే కొండంత బరువులను సునాయాసంగా ఎత్తేస్తోంది ఒక భారతీయ యువతి. ఆమే 21 ఏళ్ల భారత యువ పవర్‌లిఫ్టర్ కేయా కునాల్ బెనర్జీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగిపోతోంది.

అంతర్జాతీయ వేదికపై రజత వెలుగులు

దక్షిణాఫ్రికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన 'ఐపీఎఫ్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్'లో కేయా కునాల్ బెనర్జీ భారత పతాకాన్ని ఎగురవేశారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన దిగ్గజ అథ్లెట్లతో పోటీపడి, తన విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో రజత పతకం సాధించారు.

ఈ పోటీల్లో కేయా ప్రదర్శించిన ఒక డెడ్‌లిఫ్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేయా శరీర బరువు కేవలం 45.7 కిలోలు. కానీ పోటీలో ఆమె ఏకంగా 140 కిలోల బరువును డెడ్‌లిఫ్ట్ చేసి అక్కడి న్యాయనిర్ణేతలను, ప్రేక్షకులను విస్తుపోయేలా చేశారు. అంటే తన సొంత బరువు కంటే దాదాపు మూడు రెట్లకు పైగా బరువును ఆమె ఎత్తడం విశేషం.

బలం వెనుక కఠోర శ్రమ

పవర్‌లిఫ్టింగ్‌లో కేవలం బాహుబలం ఉంటే సరిపోదు. దానికి సరైన టెక్నిక్, ఏకాగ్రత, క్రమశిక్షణ, మానసిక ధైర్యం తోడవ్వాలి. రోజువారీ కఠోర సాధనతోనే కేయా ఈ స్థాయికి చేరుకున్నారు. 45 కిలోల విభాగానికి చెందిన అథ్లెట్ అంత పెద్ద బరువును అలవోకగా లేపడం ఆమె వెనుకున్న అనితర సాధ్యమైన శ్రమకు నిదర్శనం.

సోషల్ మీడియాలో 'బుట్టబొమ్మ' అంటూ ప్రశంసలు

పోటీలలో ఆమె మెరుపులు, అమాయకమైన ముఖకవళికలు, లిఫ్ట్ చేశాక ఇచ్చే కాన్ఫిడెంట్ స్మైల్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లు ఆమెను ‘మోస్ట్ బ్యూటిఫుల్ పవర్‌లిఫ్టర్’ అని, ‘బుట్టబొమ్మ’ అని కొనియాడుతున్నారు. అందానికి, అపారమైన బలపరాక్రమాలకు కేయా సరైన నిదర్శనమని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

బాహ్య సౌందర్యం కంటే అంతర్జాతీయ స్థాయిలో ఆమె సాధించిన రజత పతకం.. చూపించిన క్రీడా పటిమ భారత క్రీడారంగానికి గర్వకారణం. ఈ వైరల్ గుర్తింపు ఆమెకు మున్ముందు ఒలింపిక్స్, ఇతర అంతర్జాతీయ వేదికలపై మరిన్ని పతకాలు సాధించేందుకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.