ఢిల్లీ, ముంబై, బెంగళూరు కంటే హైదరాబాదే బెస్ట్... వీడియో వైరల్!
చాలా మందికి పలు దేశాలతోనూ, పలు ప్రాంతాలతోనూ, పలు నగరాలతోను రకరకాల బంధాలు ఉంటుంటాయి.
By: Raja Ch | 1 Dec 2025 3:56 PM ISTచాలా మందికి పలు దేశాలతోనూ, పలు ప్రాంతాలతోనూ, పలు నగరాలతోను రకరకాల బంధాలు ఉంటుంటాయి. ఈ క్రమంలో చాలా మందికి హైదరాబాద్ తో ఆర్థికపరమైన బంధం కంటే ఆత్మీయమైన బంధం ఉంటుందని చెబుతుంటారు. అయితే అది అక్కడ ఎక్కువకాలం ఉన్నవారికే కాదు.. జస్ట్ గంటల సమయం ఉన్నవారి మనసు కూడా అలా దోచేస్తుంది హైదరాబాద్.
అవును... దేశంలోని అద్భుత నగరాల్లో హైదరాబాద్ స్థానం ప్రత్యేకం అని అంటారు. ఈ క్రమంలో.. అంతకు మించి భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు ఓ వ్యక్తి. ఇందులో భాగంగా... ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల కంటే హైదరాబాద్ బెస్ట్ నగరమని.. ఢిల్లీకి చెందిన కెవిన్ సామ్ అనే వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ సందర్భంగా కెవిన్ సామ్ తన ఇన్ స్టా గ్రామ్ లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. హైదరాబాద్ కు వచ్చిన కొన్ని గంటల్లోనే తనకు కలిగిన తొలి అభిప్రాయం ఇదని చెప్పుకొచ్చాడు! కెవిన్ సామ్... ఈ వీడియోలో హైదరాబాద్ లో తిరుగుతూ కెమెరాలో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. తన మాటలు చాలా మందిని బాదపెట్టొచ్చు, వారు తిట్టొచ్చు అని అన్నాడు.
ఈ క్రమంలోనే.. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఏది బెస్ట్ సిటీ అనే ప్రశ్నకు తనకు సమాధానం దొరికిందని.. అదే హైదరాబాద్ అని.. తాను ఇక్కడకు వచ్చి నాలుగే గంటలవ్వగా, ఇప్పటికే సిటీ తనను బాగా ఆకట్టుకుందని చెప్పాడు. తాను ఢిల్లీ వాసినని.. బెంగళూరు, ముంబై నగరాలకూ వెళ్లానని.. కానీ హైదరాబాద్ కు పోటీనే లేదని అన్నాడు.
ఇదే సమయంలో... హైదరాబాద్ రోడ్లు బెంగళూరు కంటే చాలా మంచిగా ఉన్నాయని.. ముంబై కంటే క్లీన్ గా ఉన్నాయని.. గాలి స్వచ్ఛంగా ఉందని.. ఇక ఫుడ్ కూడా చాలా బాగుందని సామ్ తెలిపాడు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇక కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు వారి వారి అనుభవాలను పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా... నిజంగా హైదరాబాద్ సూపర్ సిటీ అని, ఇక్కడ ఫుడ్ బాగుంటుందని, హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టమని రకరకాల కామెంట్లు పెడుతున్నారు!
