కేతిరెడ్డి మైండ్ గేమ్.. కూటమి నేతలకు బిగ్ టెస్టే.. !
అంతేకాదు.. ఈ వ్యవహారం.. కూటమి నేతల ఐక్యతకు, వారి సమన్వయానికి కూడా పెద్ద టెస్టుగా పేర్కొంటున్నారు. దీంతో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యల విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది.
By: Garuda Media | 27 Sept 2026 5:00 AM ISTఅనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటన వైసీపీలో కంటే కూడా. కూటమి నాయకులను ఆలోచనలో పడేసింది. విశ్లేషకులు ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. కేతిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారం.. కూటమి నేతల ఐక్యతకు, వారి సమన్వయానికి కూడా పెద్ద టెస్టుగా పేర్కొంటున్నారు. దీంతో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యల విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది.
త్వరలోనే జరగనున్న స్థానిక ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితిలో నూ ఏకగ్రీవాలను ప్రోత్సహించరాదని.. ప్రతిస్థానంలోనూ పోటీ చేయాలని పార్టీ అధినేత నిర్దేశించారు. ఒకవేళ అభ్యర్థులు లేకపోతే.. ఇంచార్జ్‌లు తమ తమ కుటుంబాల్లోని వారిని నిలబెట్టాలని కూడా జగన్ దిశానిర్దేశం చేశారు. అంటే.. మొత్తంగా ఏకగ్రీవాలకు ఛాన్స్ లేకుండా చేయాలన్నది జగన్ వ్యూహం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
అయితే.. జగన్ నిర్ణయానికి భిన్నంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ధర్మవరంలో అన్ని స్థాని కాలను ఏకగ్రీవం చేసుకునేందుకు తాము సహకరిస్తామని అన్నారు. కూటమి నాయకులు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకోవచ్చని కూడా చెప్పారు. ఈ ప్రకటన సంచలనంగా మారింది. ఎందుకంటే.. ఏకగ్రీవాలకు వ్యతిరేకమని వైసీపీ చెబుతుంటే.. కేతిరెడ్డి ఇలాంటి ప్రకటన చేయడం ఏంటన్నది ప్రశ్న. అయితే.. ఇందులోనే అసలు మైండ్ గేమ్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. బీజేపీ తరఫున ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన సత్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం మంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయన సొంత పార్టీలోనే అనైక్యతను చవిచూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీలో రెండు వర్గాలు ఆధిపత్య ధోరణికి తెరదీశాయి. దీనికితోడు టీడీపీ కూడా.. వేరుగా రాజకీయాలు చేస్తోంది. ఇది ఏకగ్రీవాలపై ప్రభావం చూపుతుందన్న చర్చ ఉంది. అందుకే.. వారి అనైక్యతను గుర్తు చేస్తూ.. మీరు ఏకగ్రీవాలు చేసుకోవాలన్న సాధ్యం కాదన్న చురకలు అంటించేలా కేతిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారన్నవాదన వినిపిస్తోంది. మరం ధర్మవరంలో ఏం జరుగుతుందో చూడాలి.
