Begin typing your search above and press return to search.

పొత్తు లేకుండా గెలిస్తేనే క్రెడిబిలిటీ.. పవన్, మెగా ఫ్యామిలీ రాజకీయాలపై కేతిరెడ్డి సెటైర్

తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోరాడి విజయం సాధించడాన్ని కేతిరెడ్డి ప్రస్తావించారు. "విజయ్ ఎవరి సాయం తీసుకోలేదు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు.

By:  A.N.Kumar   |   9 May 2026 12:43 PM IST
పొత్తు లేకుండా గెలిస్తేనే క్రెడిబిలిటీ.. పవన్, మెగా ఫ్యామిలీ రాజకీయాలపై కేతిరెడ్డి సెటైర్
X

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఆయన చేసిన విమర్శలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్‌గా మారాయి. తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ సాధించిన విజయాన్ని ఉదాహరణగా చూపుతూ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని కేతిరెడ్డి తక్కువ చేసి మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

పవన్ విజయం వెనుక చంద్రబాబు హస్తం: కేతిరెడ్డి

గత ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు గాను 21 స్థానాలను గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్ సాధించిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తుండగా కేతిరెడ్డి మాత్రం భిన్నమైన వాదనను వినిపించారు. "పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలిచారని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఆ గెలుపు వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే జనసేనకు ఆ మెజార్టీ దక్కింది. ఇది కేవలం టీడీపీ వల్ల వచ్చిన విజయమే తప్ప, జనసేన స్వశక్తితో సాధించింది కాదు" అని ఆయన వ్యాఖ్యానించారు. పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగితేనే ఏ పార్టీ బలమైనా తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

విజయ్‌ను ఉదాహరణగా చూపుతూ విమర్శలు

తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోరాడి విజయం సాధించడాన్ని కేతిరెడ్డి ప్రస్తావించారు. "విజయ్ ఎవరి సాయం తీసుకోలేదు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. తన దమ్ము ఏంటో నిరూపించుకున్నారు. నిజమైన రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం అదే. రాజకీయాల్లో పార్టీ పెట్టడం ముఖ్యం కాదు, ఆ పార్టీకి ప్రజల్లో క్రెడిబిలిటీ ఉండాలి. విజయ్ లాగా ఒంటరిగా గెలిస్తేనే ఆ గౌరవం ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా పొత్తులు లేకుండా గెలిచి చూపిస్తే అప్పుడు ఆయన బలం ఏంటో ఒప్పుకుంటాం" అని సవాల్ విసిరారు.

చిరంజీవి రాజకీయ ప్రస్థానంపై కామెంట్స్

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావనను కూడా కేతిరెడ్డి తీసుకువచ్చారు. "చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు, ఒంటరిగా పోటీ చేసి 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. కానీ చివరకు పార్టీని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. రాజకీయాలు అంటే కేవలం గ్లామర్ కాదు.. నిలబడే ధైర్యం ఉండాలి. చిరంజీవి లాగా పార్టీని విలీనం చేయడం లేదా పవన్ లాగా పొత్తులపై ఆధారపడటం వల్ల ప్రజల్లో నమ్మకం కలగదు" అని ఘాటుగా విమర్శించారు.

సోషల్ మీడియాలో ముదిరిన యుద్ధం

కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. "పొత్తులు అనేవి రాజకీయ వ్యూహాల్లో భాగం. గత ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది" అని వారు కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు వైసీపీ మద్దతుదారులు మాత్రం కేతిరెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూ సొంత బలం లేకుండా రాజకీయం చేయడం వ్యర్థమని పోస్టులు పెడుతున్నారు.

మొత్తానికి తమిళ హీరో విజయ్ విజయాన్ని ఏపీ రాజకీయాలతో ముడిపెడుతూ కేతిరెడ్డి చేసిన ఈ విశ్లేషణ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ చర్చలకు దారితీసింది. రాజకీయాల్లో 'ఒంటరి పోరు' గొప్పదా లేక 'వ్యూహాత్మక పొత్తు' గొప్పదా అనే దానిపై కొత్త చర్చ మొదలైంది. ఒకప్పుడు మిత్రులుగా ఉన్న నేతలు ఇప్పుడు ఈ స్థాయిలో విమర్శలు చేసుకోవడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.