Begin typing your search above and press return to search.

5053 పేజీల ఛార్జ్‌షీట్‌తో కేత‌న్ అగ‌ర్వాల్ కేసు.. దేశంలో సినీఫ‌క్కీని త‌ల‌పించేలా టాప్-5 హ‌త్యోదంతాలు!

కోర్టులో సమర్పించిన ఈ భారీ చార్జ్‌షీట్‌లో నిందితులకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు పొందుపరిచారు.

By:  Sivaji Kontham   |   20 Sept 2026 12:56 PM IST
5053 పేజీల ఛార్జ్‌షీట్‌తో కేత‌న్ అగ‌ర్వాల్ కేసు.. దేశంలో సినీఫ‌క్కీని త‌ల‌పించేలా టాప్-5 హ‌త్యోదంతాలు!
X

సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి పూణే రూరల్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి వడ్గావ్ మావల్ కోర్టులో ఏకంగా 5053 పేజీలతో కూడిన భారీ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. పూణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్‌ను గత ఏడాది జూన్ 18న లోహగడ్ కోటపై నుంచి తోసివేయడంతో అత‌డు ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య కేసుకు సంబంధించి అత‌డి కాబోయే భార్య సియా గోయల్. ఆమె ప్రియుడు చేతన్ చౌదరితో పాటు రితేష్ హాంగే అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కోర్టులో సమర్పించిన ఈ భారీ చార్జ్‌షీట్‌లో నిందితులకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను పోలీసులు పొందుపరిచారు. వాటిలో ప్రధానంగా మెసేజ్‌లు, ఫోటోలు, మొబైల్ ఫోన్ డేటా, కాల్ డిటైల్ రికార్డ్స్, సాక్షుల వాంగ్మూలాలు , టెక్నికల్ అనాలసిస్ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ దర్యాప్తులో నిందితులు ఈ హత్యకు ముందు పక్కాగా పథకం రచించినట్లు వెల్లడైంది. లోహగడ్ కోట వద్దే గతంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఇలాంటి ఘటనే జరిగిందా అని నిందితురాలు సియా గోయల్ ఆన్‌లైన్‌లో శోధించినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా గత ఏడాది మే నెలలో మేఘాలయలో హనీమూన్ సమయంలో హత్యకు గురైన రాజా రఘువంశీ కేసు (సోనమ్ రఘువంశీ కేసు) గురించి కూడా వారు ఇంటర్నెట్‌లో పలుమార్లు స్టడీ చేసినట్లు వెల్లడైంది.

ఇక ఇటీవలి కాలంలో భారతదేశంలో ఇలాంటిదే అత్యంత సంచలనం సృష్టించిన కొన్ని ఘాతుకాలను పరిశీలిస్తే.. ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యోత్సవం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. సహజీవనం చేస్తున్న భాగస్వామిని అతి కిరాతకంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచిన వైనం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే బెంగళూరులో జరిగిన శ్రద్దా మర్డర్ కేసు (మహాలక్ష్మి హత్యోదంతం) కూడా మరో దారుణమైన ఉదాహరణగా నిలిచింది. ఒక మహిళ శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో కుక్కిన ఈ సంఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.

అలాగే కోల్‌కతాలోని ఆర్‌.జి కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఉదంతం వైద్య రంగంలోనూ.. దేశవ్యాప్తంగానూ గొప్ప‌ నిరసనలకు.. సంచలనానికి దారితీసింది. మరోవైపు దేశ రాజధానిలో జరిగిన అంకిత హత్య కేసు లేదా ఉమేష్ పాల్ హత్య వంటి ఘటనలు కూడా ప్రణాళికాబద్ధమైన నేరాలకు అద్దం పట్టాయి. ఇటువంటి కేసులన్నీ నేరస్థులు నేరాన్ని అమలు చేయడానికి ముందే సినిమాలను తలపడేలా ఇంటర్నెట్‌లో ప్లాన్లు వేయడం.. హత్యల తర్వాత దొరకకుండా ఉండేందుకు డిజిటల్ ఆధారాలను చెరిపేయడానికి ప్రయత్నించడం వంటి కోణాలతో తీవ్ర సంచలనం సృష్టించాయి.

సెర్చ్ హిస్టరీయే నేరస్థులను పట్టించే బలమైన ఆయుధాలు:

ఇలాంటి ప్రీ ప్లాన్డ్ మ‌ర్డ‌ర్ కేసుల్లో ఇంట‌ర్నెట్ శోధ‌న క్రిమినల్స్ ని ఎలా ప‌ట్టిస్తోందో తెలిస్తే అవాక్క‌వుతారు. చాలా ప్రీ-ప్లాన్డ్ మర్డర్ కేసుల్లో నేరస్థులు ఎంత పక్కాగా పథకం రచించినా డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ శోధనలు.. సెర్చ్ హిస్టరీయే నేరస్థులను పట్టించే బలమైన ఆయుధాలుగా మారుతున్నాయి. హత్యకు ముందు గూగుల్‌లో చేసే సెర్చ్‌లు, క్రైమ్ వెబ్‌సైట్ల స్టడీలు లేదా ఇలాంటి ఇతర సంఘటనల కోసం వెతికిన ఆన్‌లైన్ రికార్డులు నేరస్థుల ఆలోచనా విధానాన్ని (మోడస్ ఆపరేండి) పోలీసులు- సైబర్ ఎక్స్‌పర్ట్‌లకు స్పష్టంగా కళ్లకు కడుతున్నాయి. ఫోన్ డేటా, బ్రౌజింగ్ హిస్టరీ, డిలీట్ చేసిన డిజిటల్ జాడలను రిట్రీవ్ చేయడం ద్వారా పోలీసులు కోర్టులో తిరుగులేని సాక్ష్యాలను ప్రవేశపెడుతున్నారు. ముందస్తు పథకం ప్రకారం.. ప్రమాదంగా చిత్రీకరించాలని చూసే నిందితులు, తాము ఆన్‌లైన్‌లో చేసిన అనుమానాస్పద సెర్చ్‌ల ద్వారానే దర్యాప్తు అధికారుల కంట్లో పడి సులభంగా చట్టం ముందు దోషులుగా నిలబడుతున్నారు.