Begin typing your search above and press return to search.

కేశినేని మ‌ద్ద‌తు ఎవ‌రికి.. మారిన వ్యూహం.. !

విజ‌య‌వాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఉర‌ఫ్‌.. నాని.. స్థానిక ఎన్నిక‌ల స‌మ‌రంలో త‌న కుమార్తెను బ‌రిలోకి దింపుతార‌ని అనుకున్నా.. ఆయ‌న మౌనంగా ఉండడం.. నామినేష‌న్ల ప‌ర్వానికి ముందు.. త‌ర్వాత కూడా.. ఏమాత్రం స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

By:  Garuda Media   |   21 Oct 2026 10:00 PM IST
కేశినేని మ‌ద్ద‌తు ఎవ‌రికి.. మారిన వ్యూహం.. !
X

విజ‌య‌వాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఉర‌ఫ్‌.. నాని.. స్థానిక ఎన్నిక‌ల స‌మ‌రంలో త‌న కుమార్తెను బ‌రిలోకి దింపుతార‌ని అనుకున్నా.. ఆయ‌న మౌనంగా ఉండడం.. నామినేష‌న్ల ప‌ర్వానికి ముందు.. త‌ర్వాత కూడా.. ఏమాత్రం స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా నాని రాజ‌కీయాలు మారుతున్నాయ‌ని అంటు న్నారు. జ‌న‌సేన నుంచి పోటీ చేస్తున్న వంగ‌వీటి రాధాకృష్ణ‌కు కేశినేనితో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరువురు గ‌తంలో వేర్వేరు పార్టీల్లోనే ఉన్నా.. రాధాకు కేశినేని అండ‌గా ఉన్నారని టాక్ ఉంది.

ముఖ్యంగా విజ‌య‌వాడ‌లోని పారిశ్రామిక వ‌ర్గాలు, క‌మ్మ స‌హా.. బీసీ సామాజిక వ‌ర్గాల్లో కేశినేనికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా.. ఓటు బ్యాంకును కాపాడుకున్నారు. అదేస‌మ‌యంలో సానుభూతి కూడా ఉంది. దీంతో రాధా ఈ వ్య‌వ‌హారాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. తాజాగా కేశినేనిని క‌లుసుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించార‌ని తెలుస్తోంది. అయితే.. రెండు రోజుల్లో తానే క‌లుస్తాన‌ని కేశినేని హామీ ఇచ్చిన‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు ఆఫ్‌దిరికార్డుగా చెబుతున్నాయి.

క‌ట్ చేస్తే.. ఇక్క‌డ మ‌రో ట్విస్టు కూడా ఉంది. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ ఆలూరి బాల వెంక టేశ్వ‌ర‌రావు.. కేశినేని ఫ్యామిలీకి దూర‌పు బంధువు అన్న విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. నిజానికి వారికి బంధుత్వం ఉంద‌న్న విష‌యం పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. తాజాగా ఓ వెబ్‌సైట్ ఈ వ్య‌వ‌హారం గురించి బ‌య‌ట పెట్ట‌డం.. ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియాలోనూ ఈ విష‌యాలు వెలుగు చూడ‌డం గ‌మ‌నార్హం. పైగా.. విజ‌య‌వాడ పోలీసు క‌మిష‌న‌ర్‌గా ఉన్న స‌మ‌యంలో వెంక‌టేశ్వ‌ర‌రావు.. కేశినేని ట్రావెల్స్‌కు స‌హ‌కారం అందించార‌న్న వాద‌న ఉంది.

ఈ నేప‌థ్యంలో ఇటు వైపు నుంచి ఆయ‌న కూడా కేశినేని నాని మ‌ద్ద‌తు కోరుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌మ్మ సామాజిక వ‌ర్గం నాయ‌కుడు కావ‌డం.. దూర‌పు బంధువు కూడా అయిన‌ట్టు ప్రచారంలో ఉండ‌డంతో కేశినేని ఆయ‌న కు మ‌ద్ద‌తు ఇస్తార‌ని.. అనుకూలంగా సామాజిక వేదిక‌ల ద్వారా ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన గ‌త స్థానిక ఎన్నిక‌ల్లో మెజారిటీ వార్డుల్లో టీడీపీని గెలిపించుకున్న అనుభ‌వం ఉన్న కేశినేనిని మ‌చ్చిక చేసుకునేందుకు అటు రాధా.. ఇటు వెంక‌టేశ్వ‌ర‌రావు కూడా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కేశినేని ఎలాంటి వ్యూహం అనుస‌రిస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.