నానీ కోసం నానీ: చిన్నితో వివాదం అందుకేనా ..!
అంతేకాదు.. ఇరువురు నాయకులు కూడా `నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత` అన్నట్టుగా విమర్శలు చేసుకోవడం వంటివి రాజకీయంగా ఆసక్తిని రేపాయి.
By: Garuda Media | 20 Sept 2025 11:01 PM ISTవిజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్.. ఉరఫ్ చిన్ని, అదే విధంగా వైసిపి సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పేర్ని నానీల మధ్య రాజకీయ దుమారం రేగింది. వాస్తవానికి ఈ ఇద్దరి నాయకుల నియోజకవర్గం వేరు. పరిధులు కూడా వేరు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని మచిలీపట్నం నియోజకవర్గం నుంచి నాని గత ఎన్నికల్లో ఓడిపోగా.. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేశినేని చిన్ని గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నా రు. నియోజకవర్గాలతోనూ.. రాజకీయ పార్టీలతోనూ కూడా సంబంధం లేని ఇద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకోవడం గమనార్హం.
అంతేకాదు.. ఇరువురు నాయకులు కూడా `నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత` అన్నట్టుగా విమర్శలు చేసుకోవడం వంటివి రాజకీయంగా ఆసక్తిని రేపాయి. మరి ఇద్దరి మధ్య ఏం జరిగింది? అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయంలో అవినీతి చోటు చేసుకుందని సహజంగానే టిడిపి నాయకులు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై రెండు రోజుల కిందట కేశినేని చిన్ని మాట్లాడుతూ.. పేర్ని నాని విషయాన్ని ప్రస్తావించారు. బియ్యాన్ని రేషన్ సరుకులను కూడా అప్పటి మంత్రి దోచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దేవాలయ భూములను కూడా నానీ దోచేశారని అన్నారు.
గతంలో టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో పేర్ని నాని ఫ్యామిలీ పై కేసు నమోదు కావడం.. రేషన్ బియ్యాన్ని గోడౌన్లలో పట్టుకోవడం తెలిసిందే. దీనిని ఉద్దేశించే కేశినేని చిన్ని పేర్ని నాని పై విమర్శలు గుప్పించారన్నది రాజకీయంగా వైసిపి నాయకులు చేసిన వ్యాఖ్య. ఇక దీనికి కౌంటర్ గా నాని కూడా తీవ్రంగా స్పందించారు. క్రికెట్ అసోసియేషన్ పేరుతో చిన్ని దోచుకుంటున్నారని.. అసలు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం లోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో చిన్నిని ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఆయన దోపిడీని తట్టుకోలేకపోతున్నారని సంచలన విమర్శలు చేశారు.
అంతేకాదు విజయవాడ నడిబొడ్డుకు వచ్చి నిరూపిస్తానని కూడా సవాల్ విసిరారు. నిజానికి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామనే. అయినప్పటికీ అసలు సంబంధమే లేని నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు నాయకులు ఇలా రోడ్డును పడటం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఆసక్తిని రేపాయి. ఇది ఎటువైపు దారితీస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు.. ఒకరిపై ఒకరు సవాళ్లు కూడా రువ్వుకున్నారు. ఇందులో ఎవరు వెనక్కి తగ్గినట్టుగా కనిపించడం లేదు. దీన్నిబట్టి ఏం జరుగుతుందనేది చూడాలి.
ఇక, ఈ విషయంపై ఇటు టిడిపి అటు వైసిపి నాయకులు కూడా మౌనంగా ఉన్నారు. మరి ఇది ఉద్దేశపూర్వకంగా కేశినేని చిన్నిపై పేర్ని నాని చేసిన విమర్శలుగా చూడాలా? లేకపోతే యాదృచ్ఛికంగా చేసిన విమర్శలుగా భావించాలా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీ కేశినేని నాని, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్నీల మధ్య కొన్నాళ్లుగా జరుగుతున్న రాజకీయ యుద్ధం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కేశినేని నానీకి మద్దతుగా వైసిపి నాయకులు నిలబడిన విషయం కూడా చర్చకు వచ్చింది.
ఈ క్రమంలో తాజాగా చేసిన విమర్శల వెనుక కేశినేని నానిని తమ వైపు తిప్పుకునే వ్యూహం ఏదైనా ఉందా? ఈ క్రమంలోనే పేర్ని నానిని రంగంలోకి దింపారా? అనే చర్చ కూడా తెరమీదకు వచ్చింది. ఏదేమైనా ఎన్నడూ లేని విధంగా చిన్నిని పేర్ని నాని టార్గెట్ చేయటం విజయవాడలో ఉన్న నాయకులందరూ సైలెంట్ గా ఉండడం వంటివి ఆసక్తిని రేపుతున్నాయి. మరి ఇది చివరకు ఎటువంటి పరిణామానికి దారితీస్తుంది అనేది చూడాలి.
