‘నాన్నా పిట్టల దొర.. ప్రెస్‌మీట్ కథలు బాగా చెప్పావు!’: ఎంపీ చిన్నిపై కేశినేని నాని ఘాటు కౌంటర్
కేశినేని బ్రదర్స్ ఎంపీ చిన్ని, మాజీ ఎంపీ నాని మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇద్దరు పరస్పర ఆరోపణలు, పోలీస్ కేసులతో రాజకీయంగా వేడిపుట్టిస్తున్నారు.
By: Tupaki Political Desk | 16 Jun 2026 5:00 PM ISTకేశినేని బ్రదర్స్ ఎంపీ చిన్ని, మాజీ ఎంపీ నాని మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇద్దరు పరస్పర ఆరోపణలు, పోలీస్ కేసులతో రాజకీయంగా వేడిపుట్టిస్తున్నారు. బ్యాంకులను మోసం చేసి రూ.120 కోట్లు ఎగవేశారని, మాజీ ఎంపీ విజయవాడకు విజయ్ మాల్యాలా తయారయ్యారంటూ సోమవారం ఎంపీ కేశినేని శివనాథ్ చేసిన ఆరోపణలు రచ్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై ఎంపీ సోదరుడు మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఘాటుగా స్పందించారు. "నాన్నా పిట్టల దొర, ప్రెస్‌మీట్ పెట్టి పిట్ట కథలు బాగా చెప్పావు.. నీ కథలు నమ్మేందుకు ప్రజలు పిచ్చివాళ్లా మైడియర్ చార్లెస్ శోభరాజ్!" అంటూ కేశినేని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో ఇద్దరి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితనపై చేసిన ఆరోపణలపై మాజీ ఎంపీ కేశినేని నాని స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో కూర్చొని తనపై ఆరోపణలు చేసే బదులు ఎంపీ హోదాలో సీబీఐకి ఫిర్యాదు చేయొచ్చు కదా? అంటూ సవాల్ విసిరారు. అంతే కాకుండా పిట్టలదొర, చార్లెస్ శోభరాజ్ అంటూ తన సోదరుడిపై మాజీ ఎంపీ వాగ్బాణాలు సంధించడం ఆసక్తికర చర్చకు తెరలేపిందని అంటున్నారు. తనపై విమర్శలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా ఎంపీపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ ఎంపీ.
ఢిల్లీలో పేకాట.. గల్లీలో ప్రెస్‌మీట్లా?
తన అప్పులు, ఆస్తులు, ఆదాయంపై ఎంపీ చిన్ని చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ నాని పలు సూటి ప్రశ్నలు సంధించారు. సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేయొచ్చుగా అంటూ సవాల్ విసిరారు. "నా అక్రమ ఆర్థిక లావాదేవీలపై నిజంగా అంత నమ్మకం ఉంటే గల్లీలో కూర్చుని ప్రెస్‌మీట్లు పెట్టి తప్పుడు కథలు చెప్పడం ఎందుకు? నేరుగా సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేసి నా ఆస్తులు జప్తు చేయించి ప్రజలకు పంచిపెట్టొచ్చు కదా" అని చాలెంజ్ చేశారు మాజీ ఎంపీ నాని. ఢిల్లీలో పేకాడుకుంటూ కాలక్షేపం చేసే బదులు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేయవచ్చు కదా అంటూ ట్వీట్ చేశారు. మట్టి, పేకాట గోలలో పడి నువ్వు ఒక బాధ్యతాయుతమైన ఎంపీవి అనే సంగతి పూర్తిగా మర్చిపోయినట్టున్నావ్" అంటూ ఘాటుగా విమర్శించారు.
ఒక ఎంపీగా ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా మాట్లాడి నాపై నీ ఆక్రోశాన్ని వెళ్లగక్కే అవకాశం ఉన్నా.. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే గల్లీ స్థాయి ప్రెస్‌మీట్లకు పరిమితమయ్యావని ఎద్దేవా చేశారు. కాగా, విజయవాడ పార్లమెంట్ పరిధిలో గత కొంతకాలంగా ఈ అన్నాదమ్ముల మధ్య కొనసాగుతున్న యుద్ధం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం తమ్ముడి చేతిలో ఓడిపోయిన మాజీ ఎంపీ నాని రాజకీయాలకు దూరమంటూ ప్రకటించారు. కానీ, సొంత తమ్ముడు, ఎంపీ చిన్ని విషయంలో రాజకీయ పోరాటం మాత్రం విరమించలేదు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఎంపీ చిన్ని ప్రోద్బలంతో తన అనుచురుడిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని మాజీ ఎంపీ నాని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో మానవ హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఆరోపిస్తూ జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇక అప్పటి నుంచి మొదలైన డైలాగ్ వార్ ప్రతిరోజూ ఏదో రూపంలో వేడి పెంచుతూనే ఉందని అంటున్నారు.
