వృద్ధాప్యానికి భరోసా: కేరళలో వినూత్న 'టైమ్ బ్యాంక్' ఆవిష్కరణ
భారతదేశంలో సామాజిక ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కేరళ రాష్ట్రం, వృద్ధుల సంక్షేమానికి మరో ముందడుగు వేసింది.
By: A.N.Kumar | 5 Nov 2025 8:00 AM ISTభారతదేశంలో సామాజిక ఆవిష్కరణలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కేరళ రాష్ట్రం, వృద్ధుల సంక్షేమానికి మరో ముందడుగు వేసింది. దేశంలోనే వృద్ధుల జనాభా పెరుగుతున్న నేపథ్యంలో కేరళలోని కొట్టాయం జిల్లా, ఎలికుళం పంచాయతీ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే 'టైమ్ బ్యాంక్' పద్ధతి.
* ఏంటి ఈ 'టైమ్ బ్యాంక్'?
'టైమ్ బ్యాంక్' అనేది సమయాన్నే కరెన్సీగా మార్చే ఒక సామాజిక సంరక్షణ పద్ధతి. దీని ముఖ్య ఉద్దేశం నేడు యువత వృద్ధులకు సేవ చేస్తే, భవిష్యత్తులో వారికి అవసరమైనప్పుడు ఆ సేవను తిరిగి పొందడం.
యువత ముందుగా పంచాయతీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. వారు స్థానిక వృద్ధులకు సహాయం చేయాలి. ఈ సేవల్లో ఆసుపత్రికి తీసుకెళ్లడం, మందులు తెచ్చిపెట్టడం, ఇంటి పనుల్లో సహాయపడడం, లేదా కేవలం తోడుగా ఉంటూ మాట్లాడడం వంటివి ఉంటాయి.
సమయం ఎలా జమ అవుతుంది?
యువకులు వృద్ధులకు సేవ చేసిన ప్రతి గంట సమయం 'టైమ్ పాయింట్స్' రూపంలో వారి 'టైమ్ బ్యాంక్' ఖాతాలో జమ అవుతుంది.ఆ యువతే పెద్దవారై, భవిష్యత్తులో వారికి వృద్ధాప్యంలో సహాయం అవసరమైనప్పుడు, వారు తమ ఖాతాలోని టైమ్ పాయింట్లను ఉపయోగించి అదే విధమైన సంరక్షణ సేవలను తిరిగి పొందవచ్చు.: నేడు మనం ఇతరులకు సమయాన్ని ఇస్తే, రేపు ఆ సమయం మనకు తిరిగి వస్తుంది.
* జపాన్ స్ఫూర్తి – ఒంటరితనానికి పరిష్కారం
ఈ 'టైమ్ బ్యాంక్' ఆలోచన జపాన్‌లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న "టైమ్ బ్యాంకింగ్ సిస్టమ్" స్ఫూర్తితో తీసుకున్నది. కేరళలో విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం వలసలు పెరగడం వలన, చాలా మంది వృద్ధులు ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలు విదేశాలకు వెళ్లడంతో, సంరక్షణ లోపించి వృద్ధులు అభద్రతాభావంతో ఉంటున్నారు. ఇలాంటి కీలక సమయంలో, ఎలికుళం పంచాయతీ ప్రారంభించిన ఈ పద్ధతి వృద్ధులకు ఒక ఆత్మీయ భరోసాను కల్పిస్తోంది.
* మానవతా విలువలకు పెంపు
'టైమ్ బ్యాంక్' కేవలం వృద్ధుల సంరక్షణ పద్ధతి మాత్రమే కాదు. ఇది సమాజంలో పరస్పర సహకారం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి ఉన్నతమైన విలువలను పెంపొందించే ప్రయత్నం. ఇది యువతలో సేవా మనోభావాన్ని పెంచడమే కాకుండా.. వృద్ధుల జీవితాల్లో ఆనందాన్ని, ధైర్యాన్ని నింపుతుంది.
ఎలికుళం పంచాయతీ చేపట్టిన ఈ 'టైమ్ బ్యాంక్' కార్యక్రమం దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలిచి, వృద్ధుల సంరక్షణ విషయంలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందని ఆశిద్దాం.
