Begin typing your search above and press return to search.

ఆ యువనేత హోటల్ కి రమ్మన్నాడు.. హీరోయిన్ సంచలన ఆరోపణలు!

రినీ ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే, యూత్ కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు రాహుల్ మంఖూటతిల్ పేరు బహిర్గతం కావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.

By:  A.N.Kumar   |   21 Aug 2025 3:21 PM IST
ఆ యువనేత హోటల్ కి రమ్మన్నాడు.. హీరోయిన్ సంచలన ఆరోపణలు!
X

కేరళ రాజకీయాల్లో మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్ద దుమారానికి దారితీశాయి. మలయాళ నటి, జర్నలిస్ట్‌గా కూడా పనిచేసిన రినీ ఆన్‌ జార్జ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమయ్యాయి. రినీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక ప్రముఖ పార్టీకి చెందిన యువ నేత తనకు అసభ్యకరమైన సందేశాలు పంపి, హోటల్‌కు రావాలని ఆహ్వానించాడని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి తెలియజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆ నేతకు మరిన్ని అవకాశాలు కల్పించారని ఆమె వాపోయారు. “తమ కుటుంబంలోని మహిళలను కాపాడుకోలేని రాజకీయ నాయకులు, ఇతర మహిళలకు రక్షణగా ఎలా నిలుస్తారు?” అని ప్రశ్నించిన రినీ... తాను ఈ అనుభవాలను బయటపెట్టడానికి కారణం ఇంకా చాలా మంది మహిళలు మౌనంగా ఇలాగే బాధపడుతుండడమే అని స్పష్టం చేశారు.

- రాహుల్ మంఖూటతిల్‌పై బహిరంగ ఆరోపణలు

రినీ ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే, యూత్ కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు రాహుల్ మంఖూటతిల్ పేరు బహిర్గతం కావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. బీజేపీ కార్యకర్తలు రాహుల్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శిస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక రచయిత హనీ భాస్కరన్ కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ రాహుల్‌పై తన అనుభవాన్ని బహిరంగం చేశారు. మొదట్లో సాధారణ సంభాషణలతో ప్రారంభమైన సందేశాలు, తరువాత అసభ్యంగా మారాయని ఆమె ఆరోపించారు. తన గురించి చెడుగా మాట్లాడినట్లు.. తప్పుడు ప్రచారం చేశాడని కూడా హనీ పేర్కొన్నారు.

- చర్యల లోపం.. పెరుగుతున్న ఆరోపణలు

హనీతో పాటు యూత్ కాంగ్రెస్‌లోనే పలువురు మహిళలు రాహుల్‌పై ఫిర్యాదులు చేసినా, ఇప్పటివరకు పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు రావడం మరింత చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలతో కేరళ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితిలో పడగా, రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది.

ఇప్పుడీ ఆరోపణలపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రాహుల్ భవిష్యత్తు ఏమవుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.