ప్రజలకు దూరమైతే అంతే: కేరళలో ఎమ్మెల్యేను కుమ్మేయాలని చూశారు!
మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధి ఎవరైనా ఎందుకు ఉంటారు? అంటే.. ప్రజల తరఫున పనిచేసేందుకు.
By: Garuda Media | 4 Oct 2025 3:00 PM ISTమంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధి ఎవరైనా ఎందుకు ఉంటారు? అంటే.. ప్రజల తరఫున పనిచేసేందుకు. వారి సమస్యలు పరిష్కరించేందుకు, ప్రజల గోడు వినేందుకు, ఆదుకునేందుకు!. ఈ విషయంలో ఎలాంటి తేడాలేదు. అయితే.. గత కొన్నాళ్లు గా.. ప్రజాప్రతినిధులు వ్యక్తిగత లబ్ధి, వ్యాపారాల యావలో పడి.. ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారు. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అనే తేడా ఏమీలేదు. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు ఇలానే ఉంటున్నారు. దీంతో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రోజులు నెలలు కాదు.. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. అయితే.. ప్రజలు మాత్రం ఎంతకాలం భరిస్తారు? అవకాశం వస్తే.. ఎవరినీ లెక్కచేయరు!. ఇప్పుడు కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది.
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఉన్న కుతుపారంపు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కేపీ మోహన్ విజయం దక్కించుకు న్నారు. అయితే.. ఆయన స్థానికంగా ఉండడం మానేశారని, తమను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. రాష్ట్ర రాజధాని తిరువనంత పురంలోనే ఆయన పాగా వేశారని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో స్థానిక సమస్యలు ఎక్కడివక్కడే ఉంటున్నాయి. ముఖ్యంగా కేరళలో 99 శాతం విద్యాధికులే ఉన్నారు. దీంతో వారంతా పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే అలాంటివేమీ తనకు తెలియదన్నట్టే వ్యవహరిస్తున్నారు. అలాగే, స్థానికంగా సరైన వైద్య సేవలు కూడా అందడం లేదని వారు చెబుతున్నారు. అయినా.. ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు వేచి వేచి విసిగిపోయారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే మోహన్‌పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రజలు.. అవకాశం కోసం ఎదురు చూశారు. తాజాగా ఆయన స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చారు. దీంతో విషయం తెలిసిన నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఇంత జరిగినా మోహన్ మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా.. చూస్తాలే.. చేస్తాలే.. అంటూ వడివడిగా వారిని దాటుకుంటూ వెళ్తూ సమాధానం ఇచ్చారు. దీంతో అప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రజలను ఆయనను చేయి పట్టుకుని ఒక్క ఉదుటన గుంజారు.అంతేకాదు.. కొందరు మహిళలు.. చీర నడుముకు బిగించి.. కొట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ పరిణామాలతో ఉలిక్కిపడ్డ పోలీసులు వెంటనే అప్రమత్తమై.. ఎమ్మెల్యేను అతి బలవంతం మీద.. అక్కడ నుంచి తరలించారు. 50 మందిపై కేసుపెట్టారు.
అందరికీ పాఠమే!..
కేరళలో ఎమ్మెల్యేపై జరిగిన ఘటన అందరికీ పాఠమే. ప్రజల కోసం.. ప్రగతి కోసం.. అంటూ ఎన్నికల సమయంలో మాటలు చెప్పి.. హామీలు గుప్పించే నాయకులు ఎన్నికలు అయ్యాక.. కనిపించకుండా తిరుగుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వారందరికీ మోహన్ ఓ ఉదాహరణ. పక్కనేపోలీసులు ఉండడంతో ఎమ్మెల్యే మోహన్ బతికిపోయాడు కానీ.. వారు కనుక విడిపించి ఉండకపోతే.. ప్రజల ఆగ్రహానికి ఆయన తీవ్రంగా గాయపడి ఉండేవాడని.. స్థానికులు చెబుతున్నారు. సో.. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా.. మంత్రులైనా.. ప్రజల సమస్యలను పట్టించుకుని .. ప్రజలకుచేరువ కాకపోతే.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనక తప్పదని అంటున్నారు పరిశీలకులు.
