Begin typing your search above and press return to search.

కేరళం రాజకీయం : కమలం పువ్వు ఎవరి చెవిలో ?

కేరళం రాష్ట్రంలో ఎపుడూ రెండే కూటములు రెండే శిబిరాలు. రాజకీయం కూడా అలాగే అటూ ఇటూ మోహరించి ఉంటుంది.

By:  Satya P   |   28 March 2026 8:30 AM IST
కేరళం రాజకీయం : కమలం పువ్వు ఎవరి చెవిలో  ?
X

కేరళం రాష్ట్రంలో ఎపుడూ రెండే కూటములు రెండే శిబిరాలు. రాజకీయం కూడా అలాగే అటూ ఇటూ మోహరించి ఉంటుంది. ప్రతీ అయిదేళ్ళకు ఒక కూటమిని ప్రజలు ఎన్నుకుంటారు. అయితే 2016లో గెలిచిన లెఫ్ట్ కూటమి 2021లో మరోసారి గెలిచి వరసగా రెండోసారి అధికారం సంపాదించింది. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని కూడా ఎల్డీఎఫ్ ఆరాటపడుతోంది. ఇక పదేళ్ళుగా అధికారానికి దూరం అయిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అయితే ఈసారి అధికారం పక్కా అనుకుంటోంది. దాంతో తనదైన శైలిలో పావులు కదుపుతోంది. అయితే ఈ రెండు కూటముల మధ్యలోకి బీజేపీ చొచ్చుకుని వచ్చేసింది.

కమలంతో కలవరం :

బీజేపీకి గతంలోనే 16 శాతం దాకా ఓటు షేర్ ని సాధించింది. ఇక 2024 ఎన్నికల్లో దానిని మరింత పెంచుకుంది. ఈసారి ఏకంగా పాతిక శాతం దాకా ఓటు షేర్ సాధించాలని వీలైనన్ని సీట్లు కూడా తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. అయితే కమలం పుంజుకుంటే ఆ దెబ్బ ఎవరికి పడుతుంది అన్నదే ప్రధాన కూటమిలో అతి పెద్ద కలవరం రేపుతోంది. నిజానికి ఎపుడూ రెండు పార్టీలు కానీ కూటములు కానీ ఉంటే ఏ తంటా లేదు, మూడవ పార్టీ వచ్చినపుడే అపుడే ఎవరికి మూడుతుందో అన్న చర్చ స్టార్ట్ అవుతుంది. అలా చూసుకుంటే బీజేపీ తన సత్తాను చాటుకోవడానికి చేస్తున్న దూకుడు అధికార ఎల్డీఎఫ్ కి కానీ విపక్ష యూడీఎఫ్ కి కానీ ఏ విధంగానూ మింగుడు పడడం లేదు అని అంటున్నారు.

క్రాస్ ఓటింగ్ ఆరోపణలు :

బీజేపీని మధ్యన పెట్టి ఎల్డీఫ్ యూడీఎఫ్ ఒకరి మీద మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీతో సీక్రెట్ గా తెర వెనక పొత్తులు మీకు ఉన్నాయంటే మీకు ఉన్నాయని కమ్యూనిస్టులు కాంగ్రెస్ రెండూ ఆరోపించుకోవడంతో కేరళ రాజకీయం హీటెత్తిపోతోంది. సీపీఎం కాదు సీజేపీ అంటూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేయడంతో కామ్రేడ్స్ మండిపోతున్నారు. తమకు బీజేపీతో రహస్య పొత్తు ఏమిటి అని వారు విరుచుకుపడుతున్నారు. కమ్యూనిస్టు జనతా పార్టీగా సీపీఎం మారింది అంటున్న రాహుల్ గాంధీ మీద ఎర్రన్నలు ఆగ్రహంగా ఉన్నారు. ఇక రాహుల్ అంతటితో ఊరుకోలేదు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ని కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి నేరుగా ప్రధాని మోడీ కాపాడుతున్నారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. సరిగ్గా ఇదే తీరున కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఎల్డీఎఫ్ మీద విమర్శలు చేయడం విశేషం.

కాంగ్రెస్ అనుమానం :

కాంగ్రెస్ కి బలమున్న నియోజకవర్గాలలో ఎల్డీఎఫ్ బీజేపీ ఒక రహస్య అవగాహకు వచ్చి క్రాస్ ఓటింగ్ కి పాల్పడేందుకు చూస్తున్నారన్నది కాంగ్రెస్ అనుమానంగా ఉంది అంటున్నారు. ఇక ఆ సీట్లు ఏంటి అంటే త్రిస్సూర్, వడకర, కాసరగోడ్, మంజేశ్వరం, పాలక్కడ్, రణ్ని, కొణ్ని వంటి అసెంబ్లీ స్థానాలలో ఈ రకమైన సీక్రెట్ ప్లాన్స్ ఉన్నాయని కాంగ్రెస్ అంటోంది. యూడీఎఫ్ అభ్యర్థులను ఓడించేందుకు ఎల్డీఎఫ్ బీజేపీ ఒక అవగాహనతో ముందుకు వస్తున్నాయని కూడా ఫైర్ అవుతొంది.

యాంటీ ఇంకెంబెన్సీ చీల్చడానికి :

ఇక బీజేపీని ముందున పెట్టి బలపరచడం ద్వారా రెండు సార్లు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ తన ప్రజా వ్యతిరేకతను ఓట్ల చీలిక రూపంతో తగ్గించుకోవడానికి ఎత్తులు వేస్తోంది అని కాంగ్రెస్ అంటోంది. ప్రజలంతా యూడీఎఫ్ కి మద్దతుగా ఉన్నారని అందుకే ఈ రకంగా వామపక్షాలు చేస్తున్నాయని కాంగ్రెస్ కీలక నేతలు అంటున్నారు. మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ కి పడకుండా చూసేందుకు ఇండిపెండెంట్లను కూడా ఎల్డీఎఫ్ ముగ్గులోకి దించుతోంది అని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

ఓటమి భయంతోనే :

అయితే దీనిని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ది ఓటమి భయం తప్ప మరోటి కాదని అన్నారు. నిజానికి చూస్తే కాంగ్రెస్ తోనే బీజేపీ కేరళ ఎన్నికల్లో రహస్యంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయని ఎదురు దాడి చేస్తోంది. ఎల్డీఎఫ్ ని మరోసారి అధికారంలోకి రానీయకుండా కాంగ్రెస్ ఈ విధమైన ఎత్తులు వేస్తోందని ముఖ్యమంత్రి హాట్ కామెంట్స్ చేశారు.

బీజేపీని తగ్గించాలనే :

అయితే కాంగ్రెస్ తమను కమ్యూనిస్టులతో కలిపి కట్టడం పట్ల బీజేపీ నేతలు మండుతున్నారు. తెలంగాణాలో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పి ప్రచారం చేసి అక్కడ తమ విజయావకాశాలు దెబ్బ తీశారని అదే ప్రయోగం ఇపుడు కేరళలో కూడా చేస్తున్నారు అని కమలనాధులు అంటునారు. తప్పుడు ఆరోపణలు కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నారని ఆగ్రహం చెందుతోంది. ఇదిలా ఉంటే బీజేపీ ఎవరి వైపు అంటే చెప్పడం కష్టమే. అయితే సీపీఎం మరోసారి అధికారంలోకి రావడానికి కమలం పార్టీ సహకరిస్తోందా అంటే క్షేత్ర స్థాయిలో అయితే ఏమైనా ఉండొచ్చు కానీ పై స్థాయిలో కష్టమని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ బీజేపీ విషయంలోనూ స్థానికంగా ఏమైనా జరిగితే జరగవచ్చు అని అంటున్నారు. మొత్తానికి కమలం పువ్వు ఎవరి చెవిలో పెడుతున్నారో తెలియదు కానీ జనాలకు మాత్రం గ్రౌండ్ లెవెల్ లో రాజకీయం మీద పూర్తి అవగాహన ఉంది అని అంటున్నారు