అడవి పందులను తినాలంటే ఎలా మంత్రి గారూ..?
కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులు, మంత్రులు చేసే కామెంట్లు, ఇచ్చే సలహాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటాయనే సంగతి తెలిసిందే.
By: Raja Ch | 11 Oct 2025 10:00 PM ISTకొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులు, మంత్రులు చేసే కామెంట్లు, ఇచ్చే సలహాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంటాయనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు ఎంతో ఇబ్బందికరంగా ఉన్న సమస్య గురించి విన్నవించుకుందామని వచ్చిన రైతులకు.. ఓ మంత్రి ఇచ్చిన సమాధానం విని వారంతా షాక్ కి గురయ్యారంట. పైగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి, వారి నుంచి అనుమతి కోరుతున్నారు.
అవును... కేరళ రాష్ట్రంలోని గ్రామీణ, కొండ ప్రాంతాలలో పంటలను దెబ్బతీసే అడవి పందుల సమస్య రైతులకు అతి పెద్ద ఆందోళనగా మారింది. ఈ జంతువులు రెగ్యులర్ గా వ్యవసాయ భూములపై దాడి చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. ప్రధానంగా వరి, అరటి, దుంప పంటలను నాశనం చేస్తున్నాయట. ఫలితంగా... రైతులకు గణనీయమైన ఆర్థిక నష్టాలు సంభవిస్తున్నాయి.
ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా అడవి పందుల వల్ల పంటలు నాశనమవుతున్న సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో.. అడవి పంది మాంసం తినడం వల్ల ఈ సమస్యను త్వరగా పరిష్కరించవచ్చని కేరళ వ్యవసాయ మంత్రి పి. ప్రసాద్ తెలిపారు. అలప్పుజ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... వ్యవసాయ క్షేత్రాల్లో చంపబడిన అడవి పందుల మాంసాన్ని తినడానికి అనుమతించడం వల్ల ఈ సమస్య పరిష్కారమవుతుందని వాదించారు.
అయితే... ప్రస్తుత కేంద్ర చట్టం ఆ పనికి అనుమతించదని చెప్పిన మంత్రి ప్రసాద్... తన అభిప్రాయం ప్రకారం వ్యవసాయ క్షేత్రాలలో చంపబడిన అడవి పందుల మాంసాన్ని ప్రజలు తినడానికి అనుమతించాలని.. అటువంటి అనుమతి ఇవ్వడం వలన వ్యవసాయ భూములకు విస్తృతంగా నష్టం కలిగిస్తున్న అడవి పందుల జనాభాను నియంత్రించడానికి ప్రజలు ప్రోత్సహించబడతారని తెలిపారు.
అక్కడితో ఆగని ఆయన... వాటిని చంపకుండా ఉండాలని చెప్పేందుకు అడవి పందులేమీ అంతరించిపోతున్న జాతి కూడా కాదని మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న మానవ-జంతు సంఘర్షణ సంఘటనలను పరిష్కరించే లక్ష్యంతో కేరళ అసెంబ్లీ 1972 వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని సవరించే బిల్లును ఆమోదించిన కొద్దిసేపటికే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఈ విధంగా... పంట పొలాలలో అడవి పందుల సమస్యను నివారించడానికి వాటిని చంపి తినడమే సరైన పరిష్కారం అంటూ వ్యవసాయమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. పంటపొలాల్లోకి ఏనుగులు వచ్చి నాశనం చేసిన సందర్భాలను గుర్తు చేస్తూ.. దానికీ అదే పరిష్కారమా? అంటూ కొంతమంది స్పందిస్తున్నారు! సరైన పరిష్కారం దిశగా ఆలోచించాలని మరికొంతమంది సూచిస్తున్నారు!
