Begin typing your search above and press return to search.

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

కేరళలోని కోజికోడ్ జిల్లా కరంతుర్‌లో ఉన్న హరహర మహాదేవ క్షేత్ర కమిటీ ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న మ్యారేజ్ క్యాంప్ పెట్టింది.

By:  A.N.Kumar   |   3 Nov 2026 10:00 PM IST
పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ
X

ముప్పై దాటినా మూడో ముడి పడక.. రూట్ మ్యాప్ దొరకక సతమతమవుతున్న బ్రహ్మచారులందరికీ కేరళ నేషనల్ హైవేనే ఒక భారీ వేదికై కూర్చుంది.. చదువు, ఉద్యోగం, 30 లక్షల ప్యాకేజీ అంటూ కెరీర్ వేటలో పడి పళ్లు ఊడే వయసొచ్చినా పెళ్లిపీటలు ఎక్కలేకపోతున్న కుర్రాళ్లకు ‘అమ్మాయిలు దొరకడమే కష్టమనుకుంటే... దొరికిన అప్లికేషన్ ఫారాలు కూడా అయిపోవడం’ అసలైన ఘోరకలి. ఈ వింత ఘటన కేరళలో చోటుచేసుకుంది.

“ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటా బాబూ..” అని 25 ఏళ్ల వయసులో ప్రతిజ్ఞ చేసిన కుర్రాళ్లకు.. 35 ఏళ్లు వచ్చాక అసలు కథ సినిమా చూపిస్తోంది.. చదువు, సెటిల్‌మెంట్, రూఫ్ పైన ఒక ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ అంటూ కెరీర్ వెనక పరుగెత్తి.. తీరా వెనక్కి తిరిగి చూసుకునేసరికి పెళ్లి వయసు కాస్త దాటిపోతోంది. తీరా పెళ్లి చూపులు చూద్దామంటే పిల్లను ఎవ్వరూ ఇవ్వని పరిస్థితి.. దీంతో మనసులోనే పాత పాటలు పాడుకునే పరిస్థితి వచ్చింది. అందుకు సజీవ సాక్ష్యమే కేరళలో ఇటీవల జరిగిన ఒక విచిత్రమైన ఉచిత వివాహ రిజిస్ట్రేషన్ క్యాంప్..

కేరళలోని కోజికోడ్ జిల్లా కరంతుర్‌లో ఉన్న హరహర మహాదేవ క్షేత్ర కమిటీ ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న మ్యారేజ్ క్యాంప్ పెట్టింది. పాపం నిర్వాహకులు ఏదో అమాయకంగా ఒక 1,500 నుండి 2,000 అప్లికేషన్ ఫారమ్‌లు ప్రింట్ చేయించి “ఎవరైనా ఉంటే రండి బాబోయ్” అని పిలిచారు. కానీ తీరా ఆదివారం ఉదయం 8 గంటలు అయ్యేసరికి ఆలయ ప్రాంగణానికి దాదాపు 7,000 మందికి పైగా యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు దండెత్తారు.

వచ్చిన జనాన్ని చూసి నిర్వాహకులకు కళ్లు తేలేయాల్సి వచ్చింది. ఆ క్యూ లైన్ ఆలయ ప్రాంగణం దాటి పక్కనే ఉన్న నేషనల్ హైవే వరకు రెండు బస్ స్టాప్‌ల దూరం బారులు తీరింది. రెండు బస్సుల మేర క్యూ ఉంటే ట్రాఫిక్ పోలీసులు ఊరుకుంటారా? వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇక అప్లికేషన్ ఫారమ్‌ల సంగతి చెప్పక్కర్లేదు. ఫారాలు నిమిషాల్లో మాయమైపోతే.. వెంటనే జిరాక్స్ సెంటర్‌కి పరుగెత్తి మరో 4,000 ఫొటోకాపీలు తీయించారు. అవి కూడా చాలక ఆఖరికి సిబ్బంది చెమటలు కక్కేశారు. అక్కడ పెళ్లి సంబంధాల కోసం వచ్చిన వారికంటే.. ఈ ‘బ్రహ్మచారుల జాతర’ను వింతగా చూడ్డానికి వచ్చిన స్థానికుల సంఖ్యే ఎక్కువైపోయింది.

ఈ క్యాంప్‌కి వచ్చిన వారిలో 80 శాతానికి పైగా 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారే ఉండటం ఇక్కడ అసలు సిసలైన ట్విస్ట్. ఒకప్పుడు 25 ఏళ్లకు పెళ్లి కొడుకుగా మారే కుర్రాళ్లు ఇప్పుడు 35 వచ్చినా పిల్లను వెతుక్కునే పనిలో ఉన్నారు. అమ్మాయిలేమో ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు. అబ్బాయిలేమో “సొంత ఇల్లు కట్టాలి.. ప్యాకేజీ పెరగాలి” అని 30 దాటేస్తున్నారు. తీరా ఇద్దరికీ అన్ని కుదిరి పెళ్లికి సిద్ధపడితే.. మధ్యలో ‘జాతకాలు’ వచ్చి పడగ విప్పుతున్నాయి. అబ్బాయి-అమ్మాయికి నచ్చినా జాతకంలో ఏదో దోషం ఉందనో నక్షత్రాలు కలవలేదనో సంబంధాలు క్యాన్సిల్ అవుతున్నాయి. 100% అక్షరాస్యత ఉన్న కేరళలోనే జాతకాల పేరుతో పెళ్లిళ్లు ఆగిపోతుంటే.. ఇక మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటో ఆలోచించండి.

ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు సంబంధం చూసి పెళ్లి జరిపించేవారు. కానీ ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించడం ఎంత కష్టమో నచ్చిన జోడీని వెతుక్కోవడం అంతకంటే పెద్ద సవాలుగా మారింది. 7 వేల మంది బ్రహ్మచారులు ఒక్కచోట చేరి సృష్టించిన ఈ హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ జాతరలో పాల్గొన్న 7 వేల మందిలో ఎంతమందికి జాతకాలు కుదిరి తాళి కట్టే భాగ్యం దక్కుతుందో వేచి చూడాలి.